– ఓట్లు పెరిగినా పెరగని పోలింగ్ కేంద్రాలు
– ఐటీ జోన్‌పై అధికారుల అలసత్వం
– దూరప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు
– ప్రచారానికే పరిమితమవుతున్న అధికారులు
– డబుల్ ఓట్లూ కారణమే
Greater Hyderabad Polling Will Increase In Parliament Elections: పార్లమెంటు నుంచి కార్పొరేటర్ ఎన్నికల వరకు ప్రతిసారి హైదరాబాద్ నగర పరిధిలో అతి తక్కువ శాతం పోలింగ్ నమోదవుతోంది. ఎప్పటికప్పుడు ఎన్నికల అధికారులు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రచారం చేస్తున్నప్పటికీ పోలింగ్ మాత్రం పెరగటం లేదు. 2019 నాటి లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో అతి తక్కువ పోలింగ్ నమోదైన 50 స్థానాల్లో 4 స్థానాలు తెలంగాణలోనివే. దేశవ్యాప్తంగా అత్యల్ప ఓటింగ్ జరిగిన సీట్లలో హైదరాబాద్ 4వ స్థానంలో, సికింద్రాబాద్ 7వ స్థానంలో, మల్కాజ్‌గిరి 12వ స్థానంలో, చేవెళ్ల 25వ స్థానంలో నిలిచాయి. ఈ నాలుగు స్థానాలూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే కావటం గమనార్హం.
కారణాలివే..
పోలింగ్ శాతం అతి తక్కువగా ఉండటానికి ఓటర్ల ఉదాసీనతే ప్రధాన కారణం అని చాలామంది చెబుతున్నారు. ఈ మాటలో కొంత వాస్తవం ఉన్నా దీనికి ఇతర కారణాలూ ఉన్నాయి. ఓటర్ల సంఖ్యకు తగినట్లుగా పోలింగ్ కేంద్రాలను పెంచకపోవటం, ఓటరు నివాస ప్రాంతానికి చాలా దూరంగా పోలింగ్ కేంద్రాలుండటం, క్యూలైన్ల ఏర్పాటులో అధికారుల అలసత్వం, రైల్వే క్రాసింగ్, హైవేలను దాటి పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేక వయోధికులు ఓటింగ్‌కు దూరంగా ఉండటం ప్రధాన కారణాలు. ఇక, పోలింగ్ రోజు సెలవు ప్రకటించినా, రోజువారీ సగటు వేతన జీవులు పనికోసం వెళ్లాల్సి రావటం, చదువు, ఉద్యోగం కారణాలతో ఓటర్లు వేరే ప్రాంతంలో నివాసం ఉండటం, నగరంతో బాటు స్వగ్రామాల్లోనూ ఓటు ఉండటం వంటివి గ్రేటర్ పరిధిలో తక్కువ ఓటింగ్‌కు కారణాలు.
Also Read: పెద్దపల్లి ఫోకస్, ‘పెద్దన్న’ ఎవరో?
హేతుబద్ధత ఏదీ?
ఓటు విలువ గురించి బోలెడన్ని ప్రకటనలిచ్చే ఎన్నికల సంఘం నియోజక వర్గాల పునర్విభజన సమయంలో సమర్థంగా వ్యవహరించలేకపోవటమూ గ్రేటర్ పరిధిలో ఓటింగ్ తగ్గటానికి మరోకారణం. గ్రేటర్ పరిధిలోని సికింద్రాబాద్‌లో సుమారు 21 లక్షలు, హైదరాబాద్ సీటు పరిధిలో 22 లక్షలు, చేవెళ్ల పరిధిలో 29 లక్షల ఓట్లుండగా, మల్కాజ్‌గిరి సీటు పరిధిలో 37 లక్షల ఓటర్లున్నారు. ఓటర్ల సంఖ్య, నియోజక వర్గ భౌగోళిక స్వరూపాన్ని బట్టి దామాషా పద్ధతిలో నియోజక వర్గాల పునర్విభజన జరగలేదనటానికి ఇదే సాక్ష్యం. అసెంబ్లీ, కార్పోరేషన్ డివిజన్‌ల విషయంలోనూ ఈ గందరగోళం ఉంది.
అత్యవసర చర్యలు
ఓటింగ్ పెంచేదుకు ఈసీ చేస్తున్న ప్రచారానికి తోడు పోలింగ్ కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచాలి. హైరైజ్ బిల్డింగ్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జరగాలి. ఓటరుకు సంబంధించిన పోలింగ్ కేంద్రపు రూట్ మ్యాప్‌ను వాట్సప్‌లో పంపటం వల్ల మారుమూల కొత్త ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రానికీ ఓటరు వెళ్లగలడు. రెండు చోట్ల ఓట్లున్నవారి ఓటును నగర పరిధి నుంచి తొలగించాలి. ఓటర్లకు మెరుగైన రవాణా సదుపాయాలున్న ప్రాంతంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి.