– ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండానే ఛార్జ్‌షీటా?
– ఫోన్లు ధ్వంసం ఆరోపణ అన్యాయం
– కక్షసాధింపు ధోరణిలో ఈడీ, సీబీఐ తీరు
– కవిత తరపు లాయర్ అభ్యంతరాలు
– మంగళవారానికి వాయిదా వేసిన కోర్టు
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దాఖలు చేసిన కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి ఢిల్లీ హైకోర్టును కోరారు. నిబంధనలకు, చట్టానికి విరుద్ధంగా కవితను అరెస్టు చేశారని, లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేయకపోవటంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం హైకోర్టులో ఈ రోజు కవిత బెయిల్ కోసం న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరు, ఈడీ విచారణ సహా కవిత అరెస్టు, ట్రయల్ కోర్టు, సుప్రీంకోర్టులో జరిగిన విచారణ అంశాలపై వాదనలు వినిపించారు.
కవిత అరెస్టుకు నోటీసులు పంపిన సందర్భంలో తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని, మహిళలను విచారించే విషయంలో స్పష్టత కోసం సీఆర్పీసీలోని అంశాలను లేవనెత్తామని, సుప్రీంకోర్టు ఈ పిటిషన్ విచారణకు స్వీకరించి దర్యాప్తు సంస్థకు నోటీసులు కూడా పంపిందని, కానీ, సుప్రీంకోర్టు ఈ పిటిషన్ విచారిస్తుండగానే దర్యాప్తు సంస్థ తన క్లయింటుకు నోటీసులు పంపిందని, దీనిని సుప్రీంకోర్టులో ప్రస్తావించగా.. తదుపరి విచారణ వరకు సమన్లు ఇవ్వమని అదనపు సొలిసిటర్ జనరల్ ఓ ప్రకటన చేశారని గుర్తు చేశారు. హఠాత్తుగా ఓ రోజు కవిత ఇంట్లో సోదాలు చేసి అదేరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా ఇక ఎలాంటి రిలీఫ్ దొరకదని అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పడం, కవితను అదే రోజు సాయంత్రం అరెస్టు చేయడం జరిగిపోయిందని వివరించారు.
వాస్తవానికి ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు అందులో కవిత పేరు లేదని, ఆ తర్వాత కోర్టులో దాఖలు చేసిన చార్జిషీటులో కవిత పేరు ప్రస్తావించి, అంతా కవితనే చేశారని వాదిస్తున్నారని పేర్కొన్నారు. అరెస్టు చేసిన తర్వాత బెయిల్ కోసం ప్రయత్నించినా.. ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారని చెప్పినా ట్రయల్ కోర్టు కనికరించలేదని వివరించారు. ఒక పార్టీలో ముఖ్య నాయకురాలిగా, ఎమ్మెల్సీగా ఉన్న కవితపై తప్పుడు ఆరోపణలు చేసి ఒక మహిళగా ఆమెకు ఉన్న హక్కులను కాలరాసే విధంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరించాయని ఆరోపించారు. కవిత తన మొబైల్ ఫోన్లు అన్నింటినీ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తే .. వాటిని ధ్వంసం చేశారని ఆరోపిస్తున్నదని లాయర్ విక్రమ్ చౌదరి గుర్తు చేశారు. కానీ, వాడని మొబైల్ ఫోన్లను వేరే వారికి ఇస్తే వాళ్లు ఫార్మాట్ చేసుకుని వినియోగించుకున్నారని, దానికి తమ క్లయింటే ఫోన్లు ధ్వంసం చేసిందని ఈడీ ఆరోపించిందని తెలిపారు. మొత్తం 11 ఫోన్లు ఈడీకి ఇస్తే అందులో 4 ఫోన్లు ఫార్మాట్ చేయబడ్డాయని వివరించారు.
ఇక సీబీఐ కూడా చట్టవ్యతిరేకంగా కవితను అరెస్టు చేసిందని న్యాయవాది విక్రమ్ ఆరోపించారు. కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఆమెను విచారించాలని కోర్టులో పిటిషన్ వేసింది. అందుకు కోర్టు అంగీకరించింది. కానీ, దీనిపై కవితకు ఎలాంటి సమాచారం అందలేదని, సీఆర్పీసీ చట్టాల ప్రకారం ఆమెను విచారించడానికి ఆమె సమ్మతం కూడా తీసుకోవాల్సి ఉంటుందని, కనీసం అరెస్టు వారెంట్ కూడా లేకుండానే కవితను అరెస్టు చేశారని అన్నారు. తమ వాదనలను పరిగణనలోకి తీసుకుని కవితకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. ఇక రేపు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ వాదనలు వినిపించనుంది. రేపు మధ్యాహ్నం ఈడీ, సీబీఐల కౌంటర్ ఆర్గ్యుమెంట్లను కోర్టు వింటుంది. ఆ తర్వాత మళ్లీ రిజాయిండర్ వాదనలను న్యాయవాది విక్రమ్ చౌదరి వినిపించనున్నారు. ఆ తర్వాత న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేస్తారు.