– శుక్రవారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
– సభ్యులతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్
– స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక
Amaravati: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన శాసన సభ ఎన్నికల్లో కూటమి ఘన విజయం తర్వాత శుక్రవారం ఉదయం తొలిసారిగా శాసన సభ కొలువుదీరింది. గవర్నర్ నిర్ణయం మేరకు సీనియర్ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టి, కొత్తగా ఎన్నికైన శాసన సభ్యుల చేత ప్రమాణం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణం చేయగా, ఆ తర్వాత మంత్రులు ప్రమాణం చేశారు. పిదవ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాక, అక్షర క్రమంలో మిగిలిన సభ్యులు ప్రమాణం చేశారు. మొత్తం 175 మంది శాసన సభ్యుల్లో తొలిరోజే 172 మంది సభ్యులుగా ప్రమాణం చేయగా, ముగ్గురు టీడీపీ శాసన సభ్యులు పలు కారణాలతో సభకు హాజరు కాలేదు. అనంతరం సభను శనివారం ఉదయానికి ప్రొటెం స్పీకర్ వాయిదా వేశారు.
స్పీకర్‌గా.. అయ్యన్న పాత్రుడు
కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పదవికి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును తెలుగుదేశం ప్రతిపాదించింది. టీడీపీ తరపున నారా లోకేష్, జనసేన తరపున పవన్ కల్యాణ్, బీజేపీ తరపున సత్యకుమార్ అయ్యన్న పాత్రుడి పేరిట మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు వేరెవరూ నామినేషన్ వేయకపోవటంతో అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. దీనిపై నేటి ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. ప్రకటన అనంతరం అధికార, విపక్ష సభ్యులంతా కలిసి అయ్యన్నపాత్రుడిని స్పీకర్ స్థానంలో కూర్చోపెట్టనున్నారు.
గౌరవ సభకు..
ప్రజాస్వామ్య విలువలను, సభా మర్యాదలను పాటించని సభను కౌరవ సభగా అభివర్ణించి, ఈ సభలో తాను కూర్చోనని 2021 నవంబరు 19న నాటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని శపథం చేసి తన సభ్యులతో కలిసి సభను బహిష్కరించారు. కాగా, కాగా 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఖండ విజయాన్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతో నేడు సీఎం హోదాలో అసెంబ్లీకి రావటం విశేషం.