– సాధ్యాసాధ్యాలపై అధికారుల ఆలోచన
– ఇప్పటికే అమల్లో ఉన్న రాష్ట్రాల పరిశీలన
– లా అండ్ ఆర్డర్ కోణంలోనూ చర్చ
– సీఎం ఆదేశాలపై అధికారుల ప్రణాళికలు
Government Exercise On Night Economy : తెలంగాణలో త్వరలోనే రాత్రి పూట కూడా వాణిజ్య, వ్యాపార సముదాయాలు తెరిచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నైట్ ఎకానమీపై కసరత్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చిన నేపథ్యంలో అధికారులు పలు కోణాల్లో ఈ ప్రతిపాదననను పరిశీలిస్తున్నారు. నైట్ ఎకానమీ పేరిట వ్యాపార సంస్థలకు 24 గంటలూ అనుమతులిస్తే రవాణా, టూరిజం, హాస్పిటాలిటీ వంటి కీలక రంగాల్లో వేగవంతమైన వృద్ధి సాధించవచ్చని ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేస్తున్న మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు అనుభవాలు చెబుతున్నాయి. దీనివల్ల అటు పన్నుల రూపంలోనూ ఖజానాకు మంచి ఆదాయం సమకూరటంతో బాటు అనేక మందికి ఉపాధి కూడా దొరకుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
నిజానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నైట్ ఎకానమీ అంశాన్ని పరిశీలించింది. దీని అమలు కోసం తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం- 1988లోని కొన్ని అంశాలకు సవరణలు చేస్తూ కార్మిక శాఖ 2023 ఏప్రిల్‌లో జీఓ కూడా జారీ చేసింది. దీనికి వార్షిక రుసుముగా రూ.10 వేలు రుసుమును నిర్ణయించింది. బ్లింక్ కామర్స్, టాటా స్టార్ బక్స్, రెడ్ రోజ్ వంటి పలు సంస్థలు ఔట్‌లెట్లు, కాఫీ షాపులు, సూపర్ మార్కెట్ల ఏర్పాటుకు అనుమతి కోరుతూ అప్పుడే పలు దరఖాస్తులు కూడా ప్రభుత్వానికి వచ్చాయి. ఇవిగాక, డ్వాక్రా మహిళల ఉత్పత్తులు అమ్ముకునేందుకు గానూ శిల్పారామం, చార్మినార్, గొల్కొండ వద్ద నైట్ బజార్లు ఏర్పాటు చేయాలని కూడా నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నైట్ ఎకానమీలో మద్యం దుకాణాలకు మాత్రం అనుమతి ఉండదు.
Read More: బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ అవుతోందా?
దుకాణాల యాజమాన్యం తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు గుర్తింపు కార్డులను జారీ చేయటం, ప్రత్యేక పని గంటలు, సెలవులను కేటాయించటం, జాతీయ సెలవు దినాలు, పండగ రోజుల్లో పని చేసే వారికి మరోరోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వటం, నైట్ షిఫ్ట్‌లో పనిచేసే మహిళ ఉద్యోగులకు రవాణా, భద్రత అందించటం, రికార్డుల నిర్వహణలో పారదర్శకత వంటి మార్గదర్శకాల మీద ప్రభుత్వ అధికారులు కసరత్తు చేస్తోంది.