Government Employee Absconded With 15 Crores : అతనో ప్రభుత్వ ఉద్యోగి. నెలకు లక్షకు పైనే జీతం అందుతోంది. అయినా డబ్బు వ్యామోహం తీరలేదు. ఈజీగా ఎలా సంపాదించాలా అనేదే అతడి ఆలోచన. రమ్మీలాంటి పలు ఆన్ లైన్ గేమ్స్‌కి అలవాటుపడ్డాడు. బెట్టింగులు పెట్టడం మొదలు పెట్టాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 కోట్లు అప్పు చేసి మరీ బెట్టింగుల కింగ్‌గా మారాడు.
చివరకి ఉద్యోగం పోగొట్టుకోవడంతోపాటు జైలు పాలయ్యాడు. కీసర మండలం మిషన్ భగీరథ ఏఈగా పని చేస్తుండేవాడు రాహుల్. ఆన్ లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. తనకు తెలిసిన కాంట్రాక్టర్ల నుంచి ఏకంగా రూ.15 కోట్ల దాకా తీసుకున్నాడు. దానికి ప్రతిగా కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. కాలం గడుస్తుందే గానీ, కాంట్రాక్టులు అందకపోవడంతో కాంట్రాక్టర్లు మోసపోయామని గ్రహించారు. ఇతగాడి లీలలు ఉన్నతాధికారులకు తెలిసి ఆరు నెలల క్రితం సస్పెండ్ చేశారు.
Read More: ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ ఏర్పాటుకు ప్రయత్నాలు.. ఆధారాలన్నీ ఇవ్వనున్న ‘స్వేచ్ఛ’
అతనికి సహకరించిన అదే శాఖలో పని చేస్తున్న ఇంకో అధికారి పైనా వేటు పడింది. దాదాపు 37 మంది కాంట్రాక్టర్లను నమ్మించి 15 కోట్ల దాకా రాబట్టాడు రాహుల్. ఇస్తానన్న కాంట్రాక్టులు రాక, తీసుకున్న డబ్బులూ ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో బాధితులంతా బయటకొస్తున్నారు. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. ఈక్రమంలోనే కీసర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాహుల్ కోసం వెతకగా పరారీలో ఉన్నట్టు తేలింది.
సైలెంట్‌గా విదేశాలకు చెక్కేద్దామని రాహుల్ ప్లాన్ చేయగా బెడిసికొట్టింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ తీసుకొచ్చి వివరాలు సేకరిస్తున్నారు. ఇతని కుటుంబంలోని అందరూ ప్రభుత్వ ఉద్యోగులే. భార్య ఎలక్ర్టికల్ డిపార్ట్ మెంట్‌లో ఏఈగా ఉండగా, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగాలే చేస్తున్నారు. కానీ, రాహుల్ అత్యాశకు పోయి కాంట్రాక్టర్లను నిండా ముంచి బెట్టింగులకు పాల్పడ్డాడు. చివరికి ఊచలు లెక్కబెడుతున్నాడు.