Global Issue: నేడు ప్రపంచం ముందున్న అత్యంత తీవ్రమైన సమస్యల్లో జల సంక్షోభం ఒకటి. ఇటు మనదేశంలోనూ నానాటికీ జల వనరుల కొరత పెరుగుతూ పోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచినీటి వనరుల్లో మన దేశం వాటా 4 శాతం మాత్రమే. మనదేశంలో ప్రతి ముగ్గురిలో ఒక మనిషి స్వచ్ఛమైన నీటిని పొందలేకపోతున్నాడని, 2050 నాటికి దేశంలో నీటి కొరత మరింత పెరగటమే గాక దేశంలో సగం జిల్లాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘పంటల సాగును మార్చడం, భారతీయ వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం’ అనే అంశంపై డీసీఎం శ్రీరాం ఫౌండేషన్ చేపట్టిన అధ్యయనంలో దేశంలోని జలవనరుల గురించిన అనేక ఆసక్తికర, ఆందోళనకరమైన అంశాలు బయటికొచ్చాయి.
భారతదేశపు భూగర్భ జలాల్లో నానాటికీ పెరిగిపోతున్న ఆర్సెనిక్, ఫ్లోరైడ్ సమస్యపై కేంద్ర భూగర్భజల అథారిటీ ప్రతిస్పందనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. భారతదేశంలోని 25 రాష్ట్రాల్లోని 230 జిల్లాల్లో ఆర్సెనిక్, 27 రాష్ట్రాల్లోని 469 జిల్లాల్లో ఫ్లోరైడ్ భూగర్భ జలాలు కలుషితమయ్యాయి. మనదేశంలో 60 శాతం వ్యవసాయం భూగర్భజలాల ఆధారంగానే జరుగుతోంది. నీతి అయోగ్ 2018 నివేదిక ప్రకారం దేశంలో 60 కోట్ల మంది తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుండగా, 43 శాతం జనాభాకు నేటికీ రక్షిత సదుపాయం లేదు. ఈ సమస్య కారణంగా ఏటా 2 లక్షలమంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మనదేశంలోని జల వనరుల్లో 70% కలుషితమైపోవటం, నేటికీ ఇంటి ఆవరణలో తాగునీటి వసతి లేక మరోచోట నుంచి నీళ్లు తెచ్చుకునేవారి జనాభా గణనీయంగా ఉందని ఆ నివేదిక వెల్లడించింది.
దేశంలోని అనేక గ్రామాల్లో మంచినీటి కోసం నేటికీ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని, నీటి కొరత మూలంగా దేశం మహిళలు ఏటా సుమారు 15 కోట్ల పని దినాలను కోల్పోతున్నారనీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ – యూనిసెఫ్ సంయుక్త నివేదిక పేర్కొంది. పారిశుద్ధ్యం, తాగునీటి పురోగతిపై ఈ రెండు సంస్థలు చేసిన అధ్యయనంలో మోతాదుకు మించిన భూగర్భజలాల వినియోగం, భూ సారాన్ని దెబ్బతీయటం, అధిక కాలుష్యానికి కారణమై.. అనేక పర్యావరణ , సామాజిక, ఆర్థిక సమస్యలకు దారితీయనుందని వెల్లడైంది. భూగర్భజల వనరులను బాధ్యతాయుతంగా వినియోగించుకోవటానికి సరైన పర్యవేక్షణ, నియంత్రణ గల వ్యవస్థలు, ప్రణాళికలు అవసరమని ఈ అధ్యయనం వెల్లడించింది. పారిశ్రామిక వ్యర్థ జలాలు, ఇతర మానవ తప్పిదాల కారణంగా హానికారక ఆర్సెనిక్, కాడ్మియం వంటి లోహాలు భూగర్భ జలాల్లో కలిసిపోయి, మానవ, ఇతర ప్రాణుల ఉనికినే ప్రమాదంలోకి నెడుతున్నాయని దీనివల్ల రాబోయే రోజుల్లో భారత్‌లో అనేక ప్రతికూల పరిణామాలు ఏర్పడతాయని ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే మనదేశంలోని గంగా పరీవాహక ప్రాంతంతో బాటు వాయవ్య రాష్ట్రాల్లో భూగర్భ జలాలు కనీస స్థాయికి పడిపోయాయి. దీనివల్ల ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పర్యావరణ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని రకాల జంతుజాలపు ఉనికి శాశ్వతంగా కనుమరుగు అవుతోంది.
Also Read: ఎన్నికల వేళ బీజేపీ డ్రామా.. నోటీసులు రాకుండానే సీఎం రేవంత్‌కు ఇచ్చారంటూ ప్రచారం
ప్రపంచవ్యాప్తంగా భూగర్భ జలాలు ఏటికేడు క్షీణించటంతో ఆహార భద్రత పెను ప్రమాదంలో పడబోతోంది. నదులు, జలాశయాల్లోకి చేరుతున్న నీటి కంటే, ప్రజలు వాడుతున్న నీరు ఎక్కువ కావటం, అదీ సరిపోక భూగర్భ జలాలను తోడేయటంతో విశ్వవ్యాప్తంగా 21 ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు పూర్తిగా క్షీణించాయి. సౌదీ అరేబియా మొదలు పలు దేశాలు ఇప్పటికే భయంకరమైన జలసంక్షోభంలో కూరుకొని పోయాయి. 90వ దశకంలో సాగుకోసం సౌదీ అరేబియా పెద్దయెత్తున భూగర్భజలాలను తోడి, ప్రపంచంలో ఆరవ అతిపెద్ద గోధుమ ఎగుమతిదారుగా మారింది. ఇప్పుడు భూగర్భ జలాలు పడిపోవటంతో ఆ దేశం గోధుమలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. భూగర్భ జలాల వినియోగంలో మనదేశం చైనా, అమెరికా కంటే ముందుంది. పంజాబ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో నేటికీ బోరుబావుల ఆధారంగా వరి, గోధుమ సాగుచేస్తున్నారు. పంజాబ్‌లో ఏకంగా 78 శాతం రైతులు బావినీటిని వాడుతున్నారు. దేశంలో అత్యధికంగా గోధుమను పండించే రాష్ట్రాల్లో ఈ మూడు రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయి.
ఏటికేడు తగ్గిపోతున్న భూగర్భ జలాలు, మానవ తప్పిదాల కారణంగా భూగర్భ జలాల్లోకి చేరుతున్న ఫ్లోరైడ్, ఆర్సెనిక్ వంటి హానికారకాలు, తీర ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు తగ్గడం వల్ల, సముద్రపు ఉప్పు నీరు చొచ్చుకొని వచ్చి పంటనేలలు ఉప్పునేలలుగా మారిపోవటం, మంచినీటి కటకట ఏర్పడుతోంది. భారత్‌లో భూగర్భ జల మట్టాలు ఏటా సగటున ఒకటి నుంచి రెండు మీటర్ల చొప్పున క్షీణిస్తున్నట్లు అంచనా. అవి 8 మీటర్ల దిగువకు పడిపోయిన జిల్లాల్లో పేదరికం రేటు మిగతా జిల్లాల కంటే తొమ్మిది నుంచి 10శాతం అధికంగా ఉందని నివేదికలు వెల్లడిస్తు్న్నాయి. భూగర్భ జలాల లభ్యత క్షీణిస్తే భారత్‌లో 25 శాతానికి పైగా సాగుభూమి తక్షణం ప్రభావితమై కరువు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చిత్తడి నేలలు, నదీ ముఖద్వారాల ఆక్రమణ, పెరుగుతున్న పట్టణీకరణ, చెరువులు, ఇతర నీటి వనరుల విధ్వంసం, అతి వినియోగం భూగర్భ జలాల క్షీణతకు ప్రధాన కారణాలు. ప్రస్తుతం చాలా చోట్ల నీరు అధికంగా అవసరమయ్యే వరి, గోధుమ, చెరకు పంటలనే రైతులు ఎక్కువగా పండిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పథకాన్ని ఆసరాగా చేసుకొని కొందరు రైతులు అవసరానికి మించి భూగర్భ జలాలను తోడేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించాలి. అందుబాటులో ఉన్న నీటిని అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలి. ఖరీఫ్,రబీ సీజన్‌లో ఒకే పంట పండిచే పద్ధతిని మానుకోవటం, తక్కువ నీటితోనే పండే పోషక విలువలున్న చిరుధాన్యాల సాగుకు రైతాంగాన్ని సిద్ధం చేయాలి. పలు పరిశ్రమలు ప్రమాదకర వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా నదులు, చెరువుల్లోకి వదిలిపెడుతున్నాయి. వాన నీటిని ఒడిసిపట్టి ఆయా అవసరాలకు వినియోగించుకోవాలి. తద్వారా భవిష్యత్తులో జల సంక్షోభం తలెత్తకుండా నివారించవచ్చు. నిబంధనల మేరకు వ్యర్థాలను శుద్ధి చేయని కర్మాగారాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం పౌర సమాజం, ప్రభుత్వాలు, అధికార యంత్రంగాలు, స్వచ్ఛంద సంస్థలు సామాన్యులు అందరూ సమన్వయంతో కదలాలి. నీటి సంరక్షణ విషయంలో బాధ్యత యుతంగా వ్యవహరించడం తక్షణ అవసరం. నీటిని పొదుపుగా వాడుకుంటూ వృధాను అరికడుతూ వ్యర్ధ జలాల్ని పునర్వినియోగిస్తూ ప్రతి వర్షం చుక్కలు సౌరక్షించుకుంటూ జల వనరులను పునర్జీవనం కల్పిస్తూ ముందడుగు వేస్తేనే మెరుగైన భవిత సాధ్యమవుతుంది.
డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి
కాకతీయ విశ్వవిద్యాలయం