Jaggar Reddy: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల్లో మొత్తం ఐదుగురు తోపు లీడర్లు ఉంటే.. తమ పార్టీలో వంద మంది ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్‌లో ముగ్గురు ఉంటే.. బీజేపీలో ఇద్దరు ఉండొచ్చని, కానీ, తమ పార్టీలో వంద మంది బలమైన గళం వినిపించే నాయకులు ఉన్నారని వివరించారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ ఇలా.. వంద మంది తోపు లీడర్లు ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు, బీజేపీలో బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఉన్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నదని, అందుకే నరేంద్ర మోడీ, అమిత్ షాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని చెప్పారు. కేసీఆర్ తమ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేడని స్పష్టం చేశారు.
కేసీఆర్ బయటకు వస్తే రానివ్వండని, తాము తమ అస్త్రాలను బయటకు తీస్తామని జగ్గా రెడ్డి అన్నారు. ఎందుకంటే ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా.. ఏ విధంగా దాడి చేసినా తిప్పికొట్టే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని వివరించారు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు అని చెప్పారు. కాంగ్రెస్ హవా ఉన్నదని, తామే మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ 14 సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. తాము పాండవులమని, విజయం తమ వైపే ఉంటుందని వివరించారు.
Also Read: పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ.. సీఎం రేవంత్ రెడ్డి
నకిలీ దేశభక్తులు తమ గురించి డంభాలు పోతున్నారని, వారంతా నకిలీ దేశభక్తులేనని జగ్గా రెడ్డి అన్నారు. నిజమైన దేశభక్తులు తమ గురించి, తమ త్యాగాల గురించి బయటకు చెప్పడం లేదని వివరించారు. అందుకే తాను ఈ విషయాలను చెబుతున్నానని తెలిపారు. అసలైన దేశభక్తులు గాంధీ కుటుంబమేనని అన్నారు. రాహుల్ గాంధీ ముత్తాత మోతీలాల్ నెహ్రూ తమ ఆస్తిని స్వాతంత్ర్య ఉద్యమం కోసం ఖర్చు పెట్టుకున్నారని తెలిపారు. ఆ తర్వాత కూడా వారి కుటుంబం దేశం కోసమే సేవ చేసిందని వివరించారు. ప్రాణ త్యాగం కూడా చేశారని పేర్కొన్నారు. అంతటి త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం తమ దేశభక్తి గురించి చెప్పడం లేదని తెలిపారు.