– సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్రలను తిప్పికొట్టాలి
– పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది
– రామగుండం సింగరేణి ఏరియాలో వంశీకృష్ణ ఎన్నికల ప్రచారం
– పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్
– మోడీ, కేసీఆర్ తీరుపై ఆగ్రహం
– కొప్పుల ఈశ్వర్ కార్మికులకు చేసిందేమీ లేదంటూ విమర్శలు
– వంశీకృష్ణ గెలిస్తే ఐటీ మినహాయింపు, కార్మికులకు ఇళ్లు
పెద్దపల్లి, స్వేచ్ఛ: సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను పన్ను మినహాయింపు కోసం కృషి చేస్తానన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. రామగుండం సింగరేణి ఏరియా ఓసీపీ 3 కృషి భవన్‌లో కాంగ్రెస్ పార్టీ, ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో బాయి బాట కార్యక్రమం జరిగింది. ఇందులో వంశీకృష్ణతోపాటు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఐఎన్‌టీయూసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, కేంద్ర మాజీమంత్రి, దివంగత కాకా వెంకట స్వామికి కార్మికులంటే ఎనలేని ప్రేమ అని చెప్పారు. లేబర్ నాయకుడిగా కార్మిక సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ అప్పుల పాలు చేసి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపిందని మండిపడ్డారు. సింగరేణి నష్టంలో ఉన్నప్పుడు వడ్డీలేని రుణాన్ని తీసుకువచ్చి సంస్థను కాపాడింది కాకా వెంకటస్వామి అని గుర్తు చేశారు వంశీకృష్ణ.
గత పది సంవత్సరాలుగా సింగరేణిలో ఒక కొత్త బుక్ గానీ ఏర్పాటు చేయలేదన్నారు. సంస్థను ప్రైవేటుపరం చేసే కుట్రలను తిప్పి కొట్టాలని, రావాల్సిన 30 కోట్ల బకాయిలను చెల్లించాలని చెప్పారు. సింగరేణిలో కొత్త బావులను నెలకొల్పుతామని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామన్న వంశీకృష్ణ, ఎంపీగా అవకాశం కల్పిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. గని ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మరణిస్తే కోటి రూపాయలు, కాంట్రాక్ట్ కార్మికుడికి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గత పది సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ కార్మికులకు చేసింది ఏమీ లేదన్నారు. చందాలు వేసుకొని ఎమ్మెల్యేగా గెలిచిన ఈశ్వర్ కుప్పలు కుప్పలుగా డబ్బులను ఎలా సంపాదించారని అడిగారు. పది సంవత్సరాలు ప్రజల సొమ్మును దోచుకున్నది సరిపోక మళ్లీ ఎంపీగా ప్రజల ముందుకు వస్తున్నారని విమర్శించారు. బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుని సింగరేణి సంస్థను ప్రవేటుపరం చేసేందుకు కుట్రలు చేశారన్నారు.
Also Read: దొందూ దొందే! బీజేపీ, బీఆర్ఎస్ కలిసే తెరవెనుక నాటకాలు
రాముడి జపం చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ రావణాసురుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని లంకను చేసి భరతమాతను మోడీ బంధించారని అన్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి విదంగా రాజ్యాంగాన్ని మారుస్తానంటున్న మోడీకి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో కేడీని పాతాళానికి తొక్కాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రామగుండానికి పూర్వ వైభవం తీసుకువస్తునన్న ఆయన, సింగరేణి కార్మికుల సౌకర్యార్థం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. సంస్థను కాపాడిన కాకా వెంకటస్వామి మనవడు వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి, చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని విన్నవించుకున్నారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్.