– హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఫైనాన్సర్స్ మాయాజాలం
– 50 నుంచి 70 పర్సంటేజ్‌తో సేఫ్ గేమ్
– బలి అవుతున్న మధ్యతరగతి కుటుంబాలు
– మొన్న సాహితీ స్కాంలో లాభపడ్డ కెడియా?
– ఇప్పుడు భారతీ బిల్డర్స్ స్కాంలో 100 కోట్లు కొట్టేసిన అహుజా?
– ఫైనాన్సర్స్ చేతిలోనే నగరం చుట్టుపక్కల వందల ఎకరాలు
– సాహితీ కేసులో ఎప్పటికప్పుడు చక్రం తిప్పుతున్న కెడియా
– తాజాగా మార్కెటింగ్ పర్సన్‌పై ఫిర్యాదులో కీలక పాత్ర?
– భారతీ బిల్డర్స్ కేసులో సునీల్ కుమార్ అహుజా వ్యవహారం బట్టబయలు
– ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనం
దేవేందర్ రెడ్డి, స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం
Financiers conspiracies in real estate sector : పేదోడు పైసా పైసా కూడబెట్టి సొంతింటి కల నెరవేర్చుకుందామని అనుకుంటుంటే అది కలగానే మిగిలిపోతోంది. పెట్టుబడిదారుడు ఆ సొమ్మంతా దొచేసుకుంటున్నాడు. రియల్ ఎస్టేట్‌లో కాలం కలిసి వస్తే వందల కోట్లు చాలా త్వరగానే సంపాదిస్తున్నారు రియల్టర్స్. కానీ, అంతే త్వరగా అట్టడుగు పాతాళానికి కుంగిపోతున్నారు ఇదే రియల్ బిజినెస్ మెన్స్. ఇందుకు కారణం ఫైనాన్సర్స్ పాపాలే. అదను చూసి 5 రూపాయల నుంచి 7 రూపాయల వరకు అంటే 50 శాతం నుంచి 75 శాతం వరకు వడ్డీలు ఇచ్చే మార్వాడీ ఫైనాన్సర్స్ వ్యవహారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై ప్రభావం చూపుతోంది. ప్రాజెక్ట్ తేడా కొట్టడంతో ఆస్తుల్ని రాయించుకోవడం వీళ్లకు అలవాటైపోయింది. చివరకు డబ్బులు కట్టిన మధ్య తరగతి ప్రజలు రోడ్డునపడుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం సాహితీ, భారతీ సంస్థలే.
సాహితీలో సకలం వారే.. ఇప్పటికీ పోలీసులను మేనేజ్ చేస్తూ దందాలు
వేల కోట్ల స్కాంకి పాల్పడ్డ సాహితీ కన్‌స్ట్రక్షన్ స్కాం వెనుక ఫైనాన్సర్స్ బాగోతాలు చాలానే ఉన్నాయి. లక్ష్మి నారాయణ దొచుకున్న రూ.1,200 కోట్లలో రూ.300 కోట్లు వడ్డీల రూపంలో మార్వాడీ ఫైనాన్సర్స్ చేతికి చేరుకుంది. అంటే, వెయ్యి మంది సొంతింటి పెట్టుబడులు ఫైనాన్సర్స్‌కు ఉత్తగా వడ్డీల రూపంలో చేరుకున్నాయి. ఇందులో కీలకంగా వ్యవహరించిన కెడియా మాదాపూర్‌లోని కాకతీయ హిల్స్‌లో ప్రైవేట్ ఫైనాన్స్ లోన్స్ కింద ఆస్తులను మార్టిగేజ్ చేయించుకున్నాడు. ఆశలపై అంతస్తులు కట్టేసిన ఈ కెడియా వివాదాస్పద భూముల్లో ఎన్నో పెట్టుబడులు పెట్టాడు. పైకి అంతా రిజిస్టర్డ్ మాదిరి కనిపించినా, లోపల అంతా అగ్రిమెంట్ల వ్యవహారమే. పోలీస్ అధికారుల లాలూచీల తతంగమే. పోలీసులను మేనేజ్ చేస్తూ ఇష్యూని సైడ్ చేయడంలో ఇతను దిట్ట అనే ప్రచారం ఉంది. తాజాగా సాహితీ స్కాంకు సంబంధించి ఓ కొత్త కేసు నమోదైంది. ఇందులో తప్పంతా మార్కెటింగ్ వాళ్లదే అన్నట్టు వ్యవహారం నడిపిస్తోంది ఇతనే అనే చర్చ జరుగుతోంది. దీనికోసం పోలీసులను బాగా వాడుకున్నట్టు బాధితులు చెబుతున్నారు.
రోడ్డెక్కిన సాహితీ బాధితులు
కస్టమర్ల నుంచి డబ్బులు తీసుకున్న లక్ష్మి నారాయణ దర్జాగా తిరుగుతున్నాడు. అతని నుంచి డబ్బులు తీసుకున్న కెడియా కూడా హ్యాపీగా ఉన్నాడు. కానీ, సొంతింటి కోసం డబ్బులు ఇచ్చిన బాధితులు మాత్రం రోడ్డెక్కారు. తాజాగా బషీర్ బాగ్‌లో సాహితీ ఇన్ఫ్రా కంపెనీ బాధితులు ఆందోళన చేపట్టారు. అమీన్ పూర్‌లో సాహితీ శర్వాణి ఎలైట్ పేరుతో 25 ఎకరాల్లో 32 అంతస్తులతో 10 టవర్లు నిర్మిస్తామంటూ సుమారు 15 వందల కోట్ల మోసానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ విషయంలో డీసీపీ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఇస్తే కలిసి తమ బాధను చెప్పుకుంటామని విన్నవించుకున్నారు.
భారతీ బిల్డర్స్ స్కాంలో కథంతా నడిపిస్తున్న సునీల్ అహుజా
భారతీ బిల్డర్స్ వ్యవహారంలో స్థలాలు ఫైనాన్సర్ సునీల్ అహుజా పేరు మీద ఉన్నాయి. బాధితులు ఎవరైనా అతనితో మాట్లాడితే, తాను కూడా చాలా ఇబ్బందులు పడుతున్నానని చెబుతున్నాడు. బయ్యర్లు తెచ్చుకోవాలని కస్టమర్లకు చెబుతూ, డబ్బుల విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. దీనికి సంబంధించిన ఆడియో ఒకటి కలకలం రేపుతోంది. దానిపై ఫుల్ డీటెయిల్స్ తర్వాతి కథనంలో చూద్దాం.