– 8 రాష్ట్రాలు.. 49 లోక్ సభ స్థానాలు
– రేపు ఐదో విడత పోలింగ్
– భారీ బందోబస్తు ఏర్పాటు
– సముద్ర, వాయు మార్గాల్లోనూ నిఘా
Fifth Phase Polling: లోక్ సభ ఎన్నికల్లో ఐదో విడతకు సంబంధించి పోలింగ్ రేపు జరగనుంది. ఐదో విడతలో 8 రాష్ట్రాలు/ యూటీలలో 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 8.95 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈ విడతలో ఉపయోగించుకోనున్నారు. ఐదో విడత పోలింగ్ కోసం ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. మొదటి నాలుగు దశల్లో దాదాపు 45.1 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బిహార్, జమ్ము కశ్మీర్, లడఖ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని 49 పార్లమెంటు స్థానాలకు ఐదో విడతలో భాగంగా పోలింగ్ జరగనుంది. 39 జనరల్, మూడు ఎస్టీ, ఏడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. మే 20వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగుతుంది. ఈ విడతలో మొత్తం 8.95 కోట్ల మంది ఓటర్లలో 4.69 కోట్ల మంది పురుషులు, 4.26 కోట్లు స్త్రీలు, 5409 థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. వందేళ్లుపైబడిన ఓటర్లు 24792 మంది ఉన్నారు. 7.81 లక్షల మంది 85 ఏళ్లకు పైబడిన ఓటర్లు ఉన్నారు. కాగా, 7.03 లక్షల మంది దివ్యాంగుల ఓటర్లు ఈ విడతలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
చివరి విడత జూన్ 1వ తేదీన జరగనుండగా.. అన్ని విడతల పోలింగ్ ఫలితాలు జూన్ 4న వెలువడుతాయి.
పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బందికి 17 ప్రత్యేక రైళ్లు, 508 హెలికాప్టర్లను ఏర్పాటు చేశారు. ఈ విడత కోసం 153 మంది పరిశీలకులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. 55 సాధారణ పరిశీలకులు, 30 పోలీసు పరిశీలకులు, 68 వ్యయ పరిశీలకులు ఇప్పటికే పోలింగ్ జరగనున్న నియోజకవర్గాలకు చేరుకున్నారు. మొత్తం 2000 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 2105 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, 881 వీడియో సర్వైలెన్స్ బృందాలు, 502 వీడియో వీక్షణ బృందాలు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నాయి.
మొత్తం 2016 అంతర్జాతీయ సరిహద్దు చెక్ పోస్టులు, 565 అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు మద్యం, డ్రగ్స్, నగదు అక్రమ ప్రవాహాలపై ఈసీ గట్టి నిఘా ఉంచింది. సముద్ర, వాయు మార్గాల్లో గట్టి నిఘా పెట్టింది. ఓటర్ల కోసం నీరు, షెడ్, టాయిలెట్లు, ర్యాంప్‌లు, వాలంటీర్ల వంటి కనీస సౌకర్యాలు, వీల్ చైర్లు, విద్యుత్ సహా అన్ని సౌకర్యాలు ఉండేలా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.