– ఎంఐఎంతో పొత్తు ఉండొచ్చన్న ఫిరోజ్‌ఖాన్
– ఒవైసీని ఆపటం తనకే సాధ్యమన్న నేత
– అధిష్ఠానం మాటే శిరోధార్యమన్న నేత
– ఎంఐఎంతో పోరు కొనసాగుతుందని స్పష్టం
Feroz Khan Sensational Comments On Asaduddin And Revanth: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీకి చెక్ పెట్టగల ఏకైక అభ్యర్థిని తానేనని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఒక మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ, హైదరాబాద్ సీటుకు కాంగ్రెస్ పార్టీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదనీ, కానీ పరిస్థితులను బట్టి చూస్తుంటే కాంగ్రెస్ – ఎంఐఎం మధ్య పొత్తు కుదురుతుందేమో అనిపిస్తోందన్నారు. అయితే, పొత్తుపై కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు.
ఒకవేళ పొత్తు కుదిరి, ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ గెలుపుకు పనిచేయమని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే, చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. అయితే, ఎన్నికల వరకే ఆ సహకారం పరిమితమవుతుందని, ఆ తర్వాత యధావిధిగా ఎంఐఎం మీద తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పొత్తుపై ఇంకా తమ పార్టీ అధిష్ఠానం ఒక నిర్ణయానికి రాలేదని వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్ అంతం చేయటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలతో ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్‌కు బైబై చెప్పి కాంగ్రెస్ పార్టీతో కొత్త ప్రయాణం మొదలుపెట్టనుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు.. హైదరాబాద్ సీటును ఎట్టి పరిస్థితిలోనూ ఈసారి కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఆ స్థానంలో హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు మాధవీలతను అభ్యర్థిగా బరిలో దించిన బీజేపీ, ఈ సీటు గురించి జాతీయ మీడియాలోనూ హైలెట్ చేస్తోంది. తాజాగా వచ్చిన సర్వేల్లోనూ ఈ స్థానంలో కమలానికి మద్దతు పెరుగుతోందనే విషయం వెల్లడవుతోంది. బీఆర్ఎస్ పూర్తిగా నిరాశలో ఉండటం, బీజేపీ పుంజుకోవటం మింగుడుపడని ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని, కొత్త ప్రయాణానికి సిద్ధమవుతోందన్న నేపథ్యంలో ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.