– భద్రాద్రి రాముడి సాక్షిగా ఇది నా మాట
– వచ్చే పసలు పంటకు రూ. 500 బోనస్
– బిడ్డ కోసం మోడీతో కేసీఆర్ చీకటి ఒప్పందం
– ఐదు స్థానాల్లో బీజేపీకి గెలుపునకు బీఆర్ఎస్ ప్రయత్నం
– వాళ్లు ఇచ్చిన హామీల సంగతేంటీ?
– భారీ మెజార్టీతో బలరాం నాయక్‌ను గెలిపించండి
– మహబూబాబాద్ జనజారత సభలో సీఎం రేవంత్ రెడ్డి
మహబూబాబాద్‌లో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త తెలిపారు. తాము ప్రకటించిన గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలు చేశామని గుర్తు చేసిన సీఎం.. ఎన్నికల కోడ్ కారణంగా మిగిలినవాటిపై నిర్ణయం తీసుకోలేకపోయామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ముగిశాక పంద్రాగస్టులోపు రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రూ. 2 లక్షల సాగు రుణాన్ని మాఫీ చేస్తామని, ఇది సోనియమ్మ మాటగా, భద్రాద్రి రాముడి సాక్షిగా చెబుతున్నానని హామీ ఇచ్చారు. వచ్చే పసలు పంటను రూ. 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామనీ తెలిపారు. మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గం బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జనజాతర బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క సహా పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు.
తెలంగాణ ద్రోహులు
తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోడీ పదేళ్లు అధికారంలో ఉన్నారని, వారు తెలంగాణ ప్రజలు హక్కులు కాలరాసి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఒకరికొకరు లోపాయికారిగా మద్దతు ఇచ్చుకున్నారని ఆరోపించారు. ఇక్కడ కేసీఆర్ అవినీతికి పాల్పడినా.. కాళేశ్వరంతో దోచుకున్నా.. కమీషన్లు తీసుకుని మోడీ ప్రభుత్వం మిన్నకుండిందని ఆరోపణలు చేశారు. ఒక దొంగను బండకేసి కొట్టిన ప్రజలు రెండో దొంగను వదిలిపెడతారా? అని అడిగారు. ‘పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారా? బయ్యారం ఉక్కు కర్మాగారంతో ఆదివాసీ, లంబాడాలకు ఉద్యోగాలు వస్తాయని సోనియమ్మ మంజూరు చేస్తే పడావు పెట్టారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కట్టాలని సోనియమ్మ మంజూరు చేస్తే మోడీ దాన్ని లాతూరుకు తన్నుకుపోయారు. సోనియమ్మ ములుగులో గిరిజన యూనివర్సిటీని ఇస్తే పది సంవత్సరాలు జాప్యం చేశారు. మేం కొట్లాడితే ఇప్పుడు పని మొదలుపెట్టారు. ఇలా ఏదైనా రాష్ట్ర ప్రజలకు ఇటు కేసీఆర్, అటు మోడీ తీరని అన్యాయం చేశారు’ ఆగ్రహించారు.
‘పార్లమెంటులో నేను ప్రత్యక్ష సాక్షిని. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిర్రు అని మోడీ తప్పు పట్టారు. తెలంగాణ ప్రజలను అవమానించారు. పార్లమెంటులో అక్రమంగా బిల్లులు పెట్టి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ పాస్ చేయించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వద్దన్న మీరు.. తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించిన మీరు ఏ మొహం పెట్టుకుని ఇక్కడ ఓట్లు, సీట్లు అడుగుతారు?’ అని రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. ఉత్తర భారతంలో కుంభమేళా, గంగా నది పరిశుద్ధికి వేల కోట్లు ఖర్చు పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల మేడారం జాతరకు ఏం ఇచ్చింది? ముష్టి మూడు కోట్లు ఇచ్చింది. వాటిని కాదని మన ప్రభుత్వం మేడారం జాతరకు ఖర్చు పెట్టుకుంది’ అని వివరించారు.
బీజేపీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బిడ్డను బయటికి తీసుకురావడానికి కేసీఆర్.. మోడీతో రహస్య ఒప్పందం చేసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కేసీఆర్, మోడీ ఒక్కటయ్యారని అన్నారు. బిడ్డను బయటికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రజలను కేసీఆర్ బలిపెడుతున్నారని ఆగ్రహించారు. మహబూబ్‌నగర్, జహీరాబాద్.. సహా ఐదు లోక్ సభ స్థానాల్లో బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ పని చేస్తున్నదని అన్నారు. కాబట్టి, తెలంగాణ ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలని కోరారు. రాజకీయంగా నష్టపోయే అవకాశాలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజలు, యువత బలిదానాలను ఆపాలని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని వివరించారు. కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసే బాధ్యత మనపై ఉన్నదని వివరించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఢిల్లీలో మూడు రంగుల జెండా ఎగురుతుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇక్కడి నుంచి 14 మంది కాంగ్రెస్ ఎంపీతో వెళ్లాలని అన్నారు.
బలరాం నాయక్‌ను ఒక్కసారి ఎంపీగా చేస్తేనే 2009లో సోనియా గాంధీ ఆమెను కేంద్రంలో మంత్రిని చేసిందని, మరోసారి ఎంపీగా చేస్తే ఎలా ఉంటుందో ప్రజలే ఆలోచించుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు.
వామపక్షాల మద్దతు:
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, సీపీఐ పొత్తు పెట్టుకున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో వామపక్షాలు, కోదండరాం, ఇతర ప్రజా సంఘాల మద్దతు పై సంప్రదింపులు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని వివరించారు.