Bodhan Ex MLA: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాహిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో రాహిల్‌ను అరెస్టు చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే రాహిల్ తన స్థానంలో మరో డ్రైవర్‌ను కూర్చోబెట్టి ప్రమాద స్థలం నుంచి పారిపోయాడు. ఆ తర్వాత దుబాయ్‌కు వెళ్లాడు. రాహిల్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా, రాహిల్ ఇండియాకు తిరిగి రాగానే రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నేడు రాహిల్‌ను రిమాండ్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నది.
ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాహిల్ నిందితుడిగా ఉన్నారు. 2022 మార్చి 17వ తేదీన జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45లో జరిగిన ప్రమాదం కేసు కూడా ఆయనపై ఉన్నది. బెలూన్లు అమ్ముకుంటున్న కుటుంబం రోడ్డు దాటుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మరణించాడు.
Also Read: కవితకు కోర్టులో చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత
ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి షకీల్ సూచనల మేరకు రాహిల్ తమ డ్రైవర్‌ను ఆయన ప్లేస్‌లో ఉంచి దుబాయ్‌కు పారిపోయాడు. రాహిల్ కాకుండా వారి డ్రైవర్‌ను పట్టుకున్న ఘటనలో పంజాగుట్ట సీఐపైనా అప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేశారు. దుబాయ్ పారిపోయిన రాహిల్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవలే రాహిల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై జారీ చేసిన లుకౌట్ నోటీసులు ఎత్తేయాలని కోరాడు. ఇక్కడికి వచ్చి దర్యాప్తులో పోలీసులకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఈ తరుణంలోనే రాహిల్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగాడు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాహిల్‌ను కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నది.
రాహిల్ ఎలా తప్పించుకున్నాడు?
గతేడాది డిసెంబర్ 23వ తేదీన బేగంపేట్‌లోని ప్రజాభవన్ వద్ద యాక్సిడెంట్ జరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ప్రధాన నిందితుడు. అయితే.. రాహిల్‌ను తప్పించి ఆయన డ్రైవర్‌ను నిందితుడిగా చూపించే ప్రయత్నం జరిగింది. కానీ, సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ప్లాన్‌ను అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.
Also Read: పోసాని, అలీ ఎక్కడా? జగన్ మర్చిపోయారా?
ప్రమాదం జరిగిన రోజు రాత్రి ఘటనా స్థలం నుంచి రాహిల్‌ను సీఐ దుర్గారావు పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. బ్రీత్ అనలైజర్ టెస్టు కోసం రాహిల్‌ను మరో కానిస్టేబుల్‌కు ఇచ్చి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అప్పుడు కానిస్టేబుల్ నుంచి రాహిల్ తప్పించుకుని ఆయన కోసం సిద్ధంగా ఉన్న కారులో ఎక్కి పారిపోయాడు. తన డ్రైవర్‌ను నిందితుడిగా పంపించాడు. యాక్సిడెంట్ చేసింది తానే అని ఆ డ్రైవర్ అంగీకరించాడు కూడా. కానీ, సోషల్ మీడియాలో యాక్సిడెంట్ చేసింది రాహిల్ అని బయటపడింది. ఈ విషయాలను సీఐ దుర్గారావు ఉన్నతాధికారులకు చెప్పకుండా దాచినట్టు అప్పుడు కథనాలు వచ్చాయి.
రాహిల్ అక్కడి నుంచి ముంబయి నగరం, అక్కడి నుంచి దుబాయ్‌కు పారిపోయినట్టు తెలిసింది. రాహిల్ పారిపోవడంలో దుర్గారావు సహకరించాడని, కేసు పక్కదారి పట్టించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించాడనే అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు రావడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.