Ex minister JC Diwakarreddy complaint about his signature
మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తనకు సంబంధించిన ఇంటిని ఖాళీ చేయకుండా వేధించడంతో పాటు తన సంతకాలను సైతం ఫోర్జరీ చేశారంటూ ఆయన జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీ దివాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సాహితీ నిర్మాణ సంస్థ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన ప్రకారం… జూబ్లీహిల్స్ రోడ్ నంబరు-10లో నివసిస్తున్న జేసీ దివాకర్‌రెడ్డికి జూబ్లీహిల్స్ రోడ్ నంబరు-62లో ఇల్లు ఉంది. దాన్ని తమ వ్యాపార నిమిత్తం కావాలని సాహితీ నిర్మాణ సంస్థ నిర్వాహకుడు బూదాటి లక్ష్మీనారాయణ కోరడంతో జేసీ మూడేళ్ల ఒప్పందంతో 2020 జూన్‌లో అద్దెకు ఇచ్చారు.
కోర్టును ఆశ్రయించిన జేసీ
ఒప్పంద గడువు 2023 మేతో ముగియడంతో ఇంటిని ఖాళీ చేయాలని జేసీ పలుమార్లు కోరినా… స్పందించకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. దాంతో బూదాటి లక్ష్మీనారాయణ, అతని కుమారుడు సాత్విక్‌లు తమకు లీజు గడువు ఇంకా ఉన్నట్లు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయడంతో జేసీకి కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. లక్ష్మీనారాయణ, అతని న్యాయవాది కోర్టులో దాఖలు చేసిన పత్రాలను గమనించిన జేసీ… తన సంతకం ఫోర్జరీ జరిగిందని, ఒప్పందం తేదీని 2021 మే నెలగా చూపినట్లు గుర్తించారు. దీంతో ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో బూదాటి లక్ష్మీనారాయణ, సాత్విక్, వారి న్యాయవాది మహమ్మద్ షాజుద్దీన్‌లు కోర్టును తప్పుదోవ పట్టించారని జేసీ సోమవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.