Allola Indrakaran Reddy
Politics

BRS Party: కేసీఆర్‌కు వరుస షాక్‌లు.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి

Allola Indrakaran Reddy: ఎన్నికలు సమీపించిన వేళ.. కీలక సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. అలా ఈసీ ఆయన ప్రచారంపై నిషేధం విధించిందో లేదో.. కీలక నేత షాక్ ఇచ్చారు. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు. అనంతరం, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీ కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన హస్తం గూటిలో చేరారు. దీపాదాస్ మున్షి ఇంద్రకరణ్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గత కొంత కాలంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇది వరకే ఆయన తన అనుచరులు, శ్రేయోభిలాషులతో ఈ మేరకు సమావేశం నిర్వహించారు. కానీ, ఆయన డెసిషన్ మాత్రం పెండింగ్‌లో పెడుతూ వచ్చారు. ఎట్టకేలకు తాజాగా నిర్ణయం తీసేసుకున్నారు. వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Also Read: కేసీఆర్‌కు ఎన్నికల కమిషన్ ఝలక్

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత సీనియర్ల ఒక్కొక్కరుగా హస్తం పార్టీలో చేరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్లు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇది వరకే సిర్పూర్, ముథోల్ మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిర్మల్, ముథోల్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ పార్టీ వర్కర్లు హస్తం గూటికి చేరారు. నిర్మల్ జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్ చారీ, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.