– ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం
– పోలీస్ కస్టడీని హైకోర్టులో సవాల్ చేసిన ప్రణీత్
– ఇరు తరఫు వాదనలు విన్న న్యాయస్థానం
– పీపీ వాదనతో ఏకీభవిస్తూ తీర్పు
– ప్రణీత్ పిటిషన్ కొట్టివేత
– కిందిస్థాయి కోర్టు తీర్పును సమర్ధించిన హైకోర్టు
Ex-DSP Praneeth Rao Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్నాడు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు, ఇతర వీఐపీల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ల కాల్స్‌ను చాటుగా విన్నట్టు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారిన సమయంలో వాటికి సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసినట్టుగా కేసు ఫైల్ అయింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడ్ని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, తనను కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రణీత్ రావు అభ్యంతరం తెలిపాడు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించడం లేదంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు తరఫు వాదనలు విన్నది. ప్రణీత్ తరఫున సీనియర్ లాయర్ మోహన్ రావు వాదనలు వినిపించారు. ప్రణీత్‌ను పోలీసులు 24 గంటలూ విచారిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం ఆదేశాల ప్రకారం ఎవరినైనా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపే విచారించాలని వివరించారు. కానీ, ఈ కేసులో పోలీసులు అలా చేయడం లేదని, పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. పైగా విచారణపై మీడియాకు లీకులిస్తూ, ప్రణీత్ పరువుకు నష్టం వాటిల్లేలా చేస్తున్నారని అన్నారు.
దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వర్ రావు అభ్యంతరం తెలిపారు. అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం పద్దతి ప్రకారమే ముందుకెళ్తోందని వాదించారు. ప్రతిపక్ష పార్టీల ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పారు. కేసు సీరియస్ నెస్‌ని అర్థం చేసుకోవాలని చెప్పారు. పీపీ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ప్రణీత్ రావు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. ఈ సందర్భంగా కిందిస్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది.
ఎస్ఐబీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అడ్డాగా ప్రణీత్ రావు అండ్ టీమ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారు. ఈ కేసులో విచారణ జరిపేకొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం ప్రణీత్ రావు కస్టడీ విచారణ పొడిగించే నిర్ణయంలో ఉన్నట్టు సమాచారం.