KCR: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణనే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనాన్ని రేపింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రణీత్ రావు, భుజంగరావు వంటి అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ వ్యవహారంలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సూత్రధారిగా భావిస్తున్నారు. ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించి ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడ్డారనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. గులాబీ బాస్ సూచనలతోనే ఈ వ్యవహారం నడిచిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ మరోసారి ఫోన్ ట్యాపింగ్ కేసు పై స్పందించారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విలేకరుల సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పేరు ప్రస్తావించగా.. ఆయన ఎవరు? హూ ఈజ్ హీ అంటూ కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. ‘అంతలా మాట్లాడుతున్నారు, మీకు తెలుసా ప్రభాకర్ రావు? మీకు తెలుసేమో నాకు తెలియదు. నేను సీఎంగా ఉన్నప్పుడు వందల మంది డీసీపీలు పని చేశారు. అందులో ప్రభాకర్ రావు ఎవరో నాకు తెలియదు’ అని కేసీఆర్ ఫైర్ అయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ చాలా కామన్ అన్నట్టుగా కేసీఆర్ కామెంట్ చేశారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదా? అని ప్రశ్నించారు. ‘గూఢచర్యం ప్రతి ప్రభుత్వంలో ఉంటుంది. ప్రతి రోజు ఉదయం ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి సీఎంకు బ్రీఫ్ ఇస్తారు. ప్రమాదాలు, పేలుళ్లు, కొన్ని సార్లు విచిత్రమైన దొంగలు వస్తుంటారు, కల్తీ విత్తనాలు ఇలా చాలా విషయాలపై వారు సీఎంకు సమాచారం ఇస్తారు. వాటిని ఎదుర్కోవడంపై చర్చిస్తారు. అంతేకానీ, ఫోన్ ట్యాపింగ్‌లో సీఎం ప్రమేయం నేరుగా ఉండదు. సీఎంకు కేవలం రిపోర్ట్‌లు ఇస్తారు. ఆ ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు అనేది సీఎంకు సంబంధం లేని విషయం. వాళ్లు ఎలా ట్యాప్ చేస్తారనేది మాకు తెలియదు.’ అని కేసీఆర్ వివరించారు.
Also Read: మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీని నమ్మొద్దు: సీఎం రేవంత్
అసలు 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం హోం సెక్రెటరీ అనుమతి తీసుకుని ఇంటెలిజెన్స్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అనుమతులతోనే బాజాప్తా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ట్యాప్ చేసిన డేటాను నిర్మూలించే అధికారం కూడా ఈ చట్టం కింద ఆ అధికారులకు సంక్రమిస్తుంది’ అని వివరించారు.
ప్రభాకర్ రావు ఎవరో తనకు తెలియదని ఒక వైపు కేసీఆర్ చెబుతుండగా.. తానూ కేసీఆర్ బాధితుడినేనని ప్రభాకర్ రియాక్ట్ కావడం గమనార్హం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తొలిసారి స్పందించారు. ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే విషయమై కోర్టులో వాదనలు జరుగుతుండగా ప్రభాకర్ రావు తన వాదనను అఫిడవిట్ రూపంలో అందించారు. ఇందులో తాను ఏ తప్పూ చేయలేదని, ఉన్నత అధికారుల పర్యవేక్షణలో పని చేశానని, అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌ల పర్యవేక్షణలోనే పని చేశానని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటికి రావడానికి ముందు ఆయన అమెరికాకు వెళ్లారు. అమెరికాకు బయల్దేరేటప్పుడు తాను రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేశానని, తనకు చికిత్స పూర్తి అయ్యాక తిరిగి ఇండియాకు వచ్చి విచారణకు సహకరిస్తానని కోర్టుకు తెలిపారు. అంతేకాదు, తాను నల్లగొండ ఎస్పీగా పని చేస్తున్నప్పుడు ప్రతిపక్ష నేతలకు సహకరిస్తున్నట్టు ఆ జిల్లా నేతలు చెప్పడంతో తనను బదిలీ చేశారని పేర్కొన్నారు. చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారని, ప్రమోషన్ విషయంలోనూ ఇబ్బందిపెట్టారని ఆరోపించారు. తనది, కేసీఆర్ సామాజికవర్గం ఒకటి కావడం వల్లే అనుమానిస్తున్నారని, వాస్తవానికి తాను కూడా కేసీఆర్ బాధితుడేనని తెలిపారు.