Phone Tapping Case: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు మరో సంచలన ట్విస్టు తీసుకోబుతున్నట్టు తెలుస్తున్నది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా.. ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రత్యర్థుల వ్యూహాలను తెలుసుకోవడం, వారిపై నిఘా వేసి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడమనే ఆరోపణలు అటుంచితే.. ఈ కేసు దర్యాప్తులో మరింత విభ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లెక్కకు రాని కోట్ల రూపాయలు చేతులు మారిన వైనం బయటపడుతున్నది. వెరసి ఇది మనీలాండరింగ్ జరిగిందా? అనే అనుమానాలను లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై నజర్ వేస్తున్నట్టు తెలిసింది. ఈ కేసులో హవాలా ద్వారా డబ్బులు సరఫరా జరిగిందా? మనీలాండరింగ్ చోటుచేసుకుందా? అనే కోణంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం అందింది.
రాధాకిషన్ రావు సంచలన స్టేట్‌మెంత్‌తో చాలా మంది ఖంగుతిన్న సంగతి తెలిసిందే. కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో రాధాకిషన్ రావు వెల్లడించిన వివరాలతో ఈ కేసులో కొత్త అనుమానాలు వచ్చాయి. దుబ్బాక బైపోల్ సమయంలో ప్రత్యర్థి అభ్యర్థికి చెందినవిగా అనుమానిస్తున్న రూ. 1 కోటి, మునుగోడు బైపోల్ సమయంలో రూ. 3 కోట్ల డబ్బును సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. అలాగే.. బీఆర్ఎస్ డబ్బులను టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించినట్టు వెల్లడించారు. వాహనాల్లో ఎన్ని కోట్ల డబ్బులు తరలించారు? ఎవరి నుంచి ఈ డబ్బులు తీసుకుని.. ఎవరికి పంపించారనే ప్రశ్నలకు రాధాకిషన్ రావు సమాధానాలు చెప్పే ఆస్కారం ఉన్నది.
లెక్కలో లేని ఈ కోట్ల డబ్బులు ఎక్కడివి? ఎవరి నుంచి ఈ డబ్బులు పార్టీలకు అందాయి? వారికి ఆ డబ్బు ఎలా వచ్చాయి? ఈ మొత్తం వ్యవహారంలో హవాలా కోణం ఉన్నదా? మనీలాండరింగ్ ఏమైనా జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనే ఈడీ కూడా రంగంలోకి దూకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఈడీ ఆరా తీసినట్టూ వివరిస్తున్నారు. ఈడీ రంగంలోకి దిగితే ఆ సమయంలో కేసుతో ప్రమేయం ఉండే అధికారులందరికీ నోటీసులు పంపించే అవకాశాలు ఉంటాయి. అలాగే.. డబ్బులు ఇచ్చిన.. సహకరించినా.. నష్టపోయి బాధితులుగా మారినవారిని, అలాంటి వ్యాపారులనూ విచారించే ఆస్కారం ఉంది.