– ఆలయ భూమిని గజం కూడా వదిలిపెట్టం
– ఆక్రమిత భూముల వెనుక ఎవరున్నా విడిచిపెట్టం
– ఇప్పటికే పలువురికి నోటీసు ఇచ్చాం
– ఎన్నికల తరువాత పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు
– దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత స్పష్టం
– ‘స్వేచ్ఛ’ కథనంపై సర్వత్రా ప్రశంసలు
గ్రేటర్ వరంగల్ పరిధిలో పలు ఆలయాల భూములు కబ్జాకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో “రూ.400 కోట్ల దేవుని భూమి హాంఫట్” అనే శీర్షికతో ‘స్వేచ్ఛ’ డిజిటల్ డైలీ ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది. దీనిపై దేవాదాయ శాఖలో పెద్దఎత్తున చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ‘స్వేచ్ఛ’ కథనంపై అధికారులు స్పందించారు.
వరంగల్ దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత మాట్లాడుతూ, చారిత్రాత్మక వరంగల్ లోని ఆలయాల భూముల ఆక్రమణకు అడ్డుకట్ట వేస్తామన్నారు. గజం జాగా కూడా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. దేవాలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగకుండా చూడాలని స్థానిక ఆలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
ఏమైనా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ‘స్వేచ్ఛ’ ప్రతినిధితో మాట్లాడిన ఆమె, ఇప్పటికే పలు ఆలయాలకు చెందిన 21 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్టు నివేదికను గౌరవ లోకాయుక్త కోర్టుకు నివేదించామని తెలిపారు. భూమి ఆక్రమణలో ఉన్న వారికి నోటీసులు కూడా ఇచ్చామని చెప్పారు. పలువురిపై కేసులు కూడా పెట్టామని, ఎన్నికల నేపథ్యంలో పలు శాఖల అధికారులు ఆ విధుల్లో భాగం అయ్యారన్నారు. ఎన్నికల అనంతరం దేవాలయ భూముల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు సునీత.