Mulugu: తెలంగాణ సరిహద్దులో చాలా రోజుల తర్వాత మళ్లీ తుపాకి తూటాల చప్పుడు వినిపించింది. ములుగు జిల్లా సరిహద్దులోని కర్రిగుట్టల వద్ద శనివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.
ములుగు జిల్లా కర్రిగుట్టలు, ఛత్తీస్‌గడ్‌లోని కాంకేడ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నారు. ఈ అటవీలో పోలీసులు ముందుకు కదులుతుండగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. వెంటనే ఉభయవర్గాలు పరస్పరం తుపాకులు ఎక్కుపెట్టుకున్నారు. భద్రతా బలగాల నుంచి తప్పించుకనే క్రమంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులూ ప్రతిదాడులకు దిగారు. ఈ దాడుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్టు అధికారులు వెల్లడించారు.
ఘటన జరిగిన ప్రాంతంలో ఏకే 47, ఇతర తుపాకులు, పేలుడు పదార్థాలు లభించినట్టు అధికారులు తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందలేదు.
Also Read: పాక్ టెర్రరిస్టులకు అర్థమయ్యే భాషలోనే..! భారత్ వ్యతిరేక ఆలోచన పుడితే చాలు.. !!
ఇదిలా ఉండగా.. సోమవారమే ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్‌లో భీకర ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మరణించారు. గంగులూరు పోలీసు స్టేషన్ పరిధిలోని కోల్చోరి అడవిలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం అందగా బీజాపూర్ డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్, కోబ్రా బృందాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య సుమారు ఎనిమిది గంటలపాటు ఎన్‌కౌంటర్ జరిగినట్టు తెలిసింది. మరణించిన 13 మంది మావోయిస్టుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.