Asifabad: రెండు మూడు రోజులుగా ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు కలకలం రేపుతున్నది. గజరాజు సంచారంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. 24 గంటల్లోనే ఇద్దరు రైతులను పొట్టనబెట్టుకున్న ఈ ఏనుగు అధికారులకూ ముచ్చెమటలు పట్టిస్తున్నది. మళ్లీ దాన్ని అడవిలోకి పంపడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏనుగు బీభత్సానికి మరింత మంది ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్తలు సూచిస్తున్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని, ముఖ్యంగా గ్రామ శివారులకు, పంట పొలాలకు వెళ్లరాదని చెప్పారు. పెంచికలపేట, బెజ్జూరు, చింతలమానేపల్లి, కౌటలా మండలాల్లో ఏకంగా 144 సెక్షన్ విధించారు. కొండపల్లి వైపుగా వెళ్లరాదని, దాని చుట్టుపక్కల మండలాల ప్రజలకు పంటపొలాలకూ వెళ్లవద్దని డీఎస్పీ కే సురేష్ సూచించారు.
పులలకూ భయపడని గ్రామస్తులు ఏనుగు కనిపిస్తే పరుగు లంఘించుకోవాల్సి వస్తున్నది. రైతులంగా గుమిగూడి పెద్ద అరుపులు చేస్తూ బెదిరిస్తే పులులు పారిపోతాయని, కానీ, ఏనుగు అలా కాదని వారు చెబుతున్నారు. ఏనుగు దేనికీ భయపడదు కాబట్టి, దాన్ని దారి మళ్లించడం చాలా కష్టమవుతున్నదని అంటున్నారు. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కాగజ్ నగర్ నుంచి బెజ్జూరుకు వెళ్లుతున్న ఆర్టీసీ బస్సుకు ఏనుగు ఎదురువచ్చి అడ్డంగా నిలబడిందని స్థానికులు చెప్పారు. దీంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కొంత సమయం రోడ్డుపైనున్న ఏనుగు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.
రెండు నెలల క్రితం 60 నుంచి 70 ఏనుగులు, రెండు రోజుల క్రితం 20 నుంచి 30 ఏనుగులు ఛత్తీస్‌గడ్ నుంచి మహారాష్ట్రలోకి ప్రవేశించినట్టు అటవీశాఖ అధికారులు చెప్పారు. ఆ గుంపు నుంచి ఒక ఏనుగు తప్పిపోయి ఆహారాన్ని వెతుకుతూ ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిందని వివరించారు. ఏనుగుకు ఎలాంటి హానీ తలపెట్టకుంటే అది అక్కడి నుంచి వెళ్లిపోతుందని వారు సూచనలు చేశారు.
ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరెపల్లిలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న శంకర్ అనే రైతుపై ఈ ఏనుగు బుధవారం దాడి చేసి చంపేసింది. మరుసటి రోజు పెంచికలపేట మండలం కొండపల్లి గ్రామంలో కారు పోషన్న అనే రైతునూ ఉదయం 5 గంటల ప్రాంతంలో తొక్కి చంపింది.