– 14 సీట్లు లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు
– పట్టు సాధించేందుకు కమలనాథుల కుస్తీలు
– ఉనికి కోసం గులాబీ దళం పాట్లు
– వినూత్న ప్రచార వ్యూహాలతో పార్టీలు
– క్షేత్ర స్థాయి సమస్యలపై అభ్యర్థుల వాగ్దానాలు
Election Teenmaar in Telangana : తెలంగాణలో రానున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో 14 సీట్లు సాధించి, గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన అధికారాన్ని స్థిరీకరించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోండగా, గతంలో తాను గెలిచిన నాలుగు లోక్‌సభ స్థానాలను నిలుపుకుంటూనే ఒకటో అరా సీట్లు పెంచుకోగలిగితే, విపక్ష బీఆర్ఎస్ స్థానాన్ని తాను దక్కించుకోవటానికి మార్గం సుగమం అవుతుందని బీజేపీ అంచనాలు వేసుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత జరిగిన కవిత అరెస్టు, నేతల నిష్క్రమణల వంటి అనేక సమస్యలతో కుదేలవుతున్న బీఆర్ఎస్ మాత్రం గెలుపుపై పెద్ద అంచనాలు పెట్టుకోకపోయినా, క్షేత్రస్థాయిలో గౌరవప్రదమైన ఓటు బ్యాంకును నిలుపుకుని ఉనికిని చాటాలని పోరాటం చేస్తోంది. అనేక అంచనాలు, అలకలు, వలసల తర్వాత తెలంగాణలోని 17 స్థానాలకు బీజేపీ, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ఖరారు చేయగా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాలుగు సీట్లు మినహా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
రేసులో ముందున్న కాంగ్రెస్
అభ్యర్థుల ప్రకటనలో కాస్త వెనకబడినా, రానున్న ఎంపీ ఎన్నికల ఫలితాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండబోతోందనే వాతావరణం తెలంగాణలో నేడు కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ నుంచి 14 స్థానాలు గెలిచి అందజేద్దామని సీఎం రేవంత్ రెడ్డి యావత్ కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయటంతో బాటు ఏప్రిల్ 6 లేదా 7న తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ఆయన ప్రకటన చేశారు. సీటు దక్కని అభ్యర్థుల బుజ్జగింపులు, చేరికల నుంచి అన్ని బాధ్యతలనూ నేతలతో కలిసి సమన్వయం చేసుకుంటూ సీఎం సాగిపోతున్నారు. ఎంపీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రిఫరెండమేనని ప్రకటించి ఈ రేసులో తాము ముందున్నామనే సందేశాన్ని మిగిలిన పార్టీలకు పంపారు. అభయహస్తం పేరిట ఇచ్చిన హామీలు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ నేపథ్యం, సీఎం రేవంత్ ప్రజాదరణ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయతీరాలకు చేర్చనున్నాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మొత్తం 17 సీట్లకు మంత్రులు, సీనియర్ నేతలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించి, గ్రామ స్థాయి వరకు పార్టీ నేతలను ఒక్క తాటిపైకి తెచ్చేందుకు నియోజక వర్గాల వారీగా సమీక్షలకు సీఎం సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వపు వందరోజుల పాలన ఫలితాలను జనంలోకి తీసుకుపోవాలని, గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో మరింత ఓటుబ్యాంకును పెంచుకోవటం మీదా కాంగ్రెస్ దృష్టి సారిస్తోంది. పట్టణ, నగర ప్రాంతాల్లో అవిశ్వాసాల ద్వారా స్థానిక నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటూ తమ ఓటు బ్యాంకును నిలుపుకునేందుకు కాంగ్రెస్ దృష్టిపెట్టింది. అదే సమయంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంట నిలిచిన ముస్లిం మైనారిటీ, ఇతర వర్గాల ఓట్లను తనవైపు మళ్లించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కృష్టి చేస్తోంది.
కమలనాథుల విస్తరణ వ్యూహాలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 9 స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈ ఎన్నికల్లో సత్తాచాటి బీఆర్ఎస్‌కు తానే ప్రత్యామ్నాయం అని చాటుకోవాలని తపన పడుతోంది. ఈ నేపథ్యంలో 2019 నాటి 4 స్థానాలను నిలబెట్టుకుంటూనే, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, నాగర్ కర్నూల్, జహీరాబాద్ సీట్లను గెలుచుకోవాలనే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మల్కాజ్ గిరి రోడ్ షో, నాగర్ కర్నూల్, జగిత్యాల సభల ద్వారా ఇప్పటికే ప్రధాని ప్రచారాన్ని ప్రారంభించగా, ఎన్నికల నాటికి మరికొన్ని చోట్ల అమిత్ షా సభలను నిర్వహించటం ద్వారా సీట్లు, ఓట్లు పెంచుకోవాలని బీజేపీ రాష్ట్ర నేతలు, నియోజకవర్గస్థాయి నేతలు యోచిస్తున్నారు.
రాష్ట్రంలో కనీసంగా 8 సీట్లు గెలిచేందుకు గానూ మోదీ చరిష్మా, పదేళ్ల బీజేపీ పాలనలో తెచ్చిన మార్పులు, రామాలయ నిర్మాణం వంటి అంశాలను ఆ పార్టీ జనంలోకి తీసుకుపోతోంది.
పట్టు నిలుపుకునేందుకు కేసీఆర్ పాట్లు
గత శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవటంతో బాటు కవిత అరెస్టు, నేతల రాజీనామాలతో కుదేలవుతున్న బీఆర్ఎస్ పార్టీని తిరిగి గాడిన పెట్టేందుకు స్వయంగా కేసీఆర్ పూనుకున్నారు. పరాజయపు షాక్‌లో ఉన్న పార్టీ శ్రేణులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోవటం, ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవటంతో బాటు తెలంగాణ ఆకాంక్షలకు నిజమైన ప్రతినిధి తమ పార్టీయే అనే నినాదంతో ఈ ఎన్నికలను ఎదుర్కోవాలని కార్యకర్తలకు ధైర్యం నూరిపోస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకంటే ముందుగా అభ్యర్థులను ఖరారు చేయటంతో బాటు ప్రచార బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించారు. రోడ్‌షో, బహిరంగ సభల ద్వారా కాంగ్రెస్ హామీలను ఎండగడుతూ తిరిగి జనంలోకి వెళ్లేందుకు కేసీఆర్ ప్రచార ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.