- నేటి సాయంత్రంతో ముగియనున్న పట్టభద్రుల ఎన్నికల ప్రచారం
- వినూత్న శైలిలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం
- ఓటర్లకు పదేపదే బోర్ కొట్టిస్తున్న సెల్ ఫోన్ ప్రచారం
- కొత్త నెంబర్లు ఎత్తాలంటే భయపడిపోతున్న ఓటర్లు
- మూడు నిమిషాల నిడివితో రికార్డు చేసిన ఆడియో
- పదే పదే ఫోన్లతో విసిగిపోతున్న ఓటర్లు
- 4.61 లక్షల మంది పట్టభద్రుల ఓటర్ల ఫోన్ నెంబర్ల సేకరణ
- రోజుకు 10 నుంచి 12 కాల్స్ పంపుతున్న అభ్యర్థులు
Election of Graduates telangana campaign with cell phone recorded calls:
లోక్ సభ ఎన్నికల సందడి ముగిసింది. తెలంగాణలో ఇప్పుడు మరో ఎన్నికల సందడి జరుగుతోంది. ఈ నెల 27న జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార ఘట్టం చివరి దశకు చేరుకుంది. నేటి సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. అయితే ఈ మూడు నియోజకవర్గాలలో ప్రచారం తీరు వినూత్నంగా సాగుతోంది. అభ్యర్థులు ఈ సారి అన్ని నియోజకవర్గాల వారికి అందుబాటులోకి రాలేక సమయాభావం వలన ఫోన్ కాల్స్ లో తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గాలలో ఓటర్లు కొత్త నెంబర్ల తో వచ్చిన కాల్స్ ఎత్తాలంటే హడలిపోతున్నారు. ఫోన్ ఎత్తగానే ‘హలో..నేను మీ ఎమ్మెల్సీ అభ్యర్థిని అంటూ పరిచయం చేసుకుని నిమిషం నుంచి మూడు నిమిషాల సమయం దాకా అభ్యర్థులు తమ బయోడేటా, తాము వస్తే ఏం చేయబోతున్నాం, పట్టభద్రుల తరపున చట్ట సభలలో ఏ రకంగా మాట్లాడతారో వివరిస్తూ రికార్డు చేసిన వాయిస్ ని వినిపిస్తున్నారు. ఇక ఒకళ్లను చూసి మరొకరు అన్నట్లు గా పోటీపోటీగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు తమ సెల్ అస్త్రాలను సంధిస్తున్నారు.
నేటితో ప్రచారానికి తెర
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచార ఘట్టం చివరి అంకానికి చేరుకుంది. దీంత ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో క్షేత్రస్థాయి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అన్ని పార్టీలకు చెందిన రాష్ట్రస్థాయి నేతలంతా ఈ ఉమ్మడి జిల్లాలలో సుడిగాలి పర్యటనలు చేశారు. అభ్యర్థుల ప్రచార శైలితో పట్టభద్రుల ఓటర్లు మాత్రం హడలిపోతున్నారు. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అధికార కాంగ్రెస్ ఈ స్థానంలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తోంది. బీజేపీ కూడా ఇక్కడ తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని చూస్తోంది. గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలుచుని రెండో స్థానం దక్కంచుకున్నారు తీన్ మార్ మల్లన్న. అయితే ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేస్తున్నారు. ప్రచారంలో అందరికన్నా మిన్నగా మల్లన్న దూసుకుపోతున్నారు. ఈ ఉమ్మడి జిల్లాలలో మొత్తం పట్టభద్రుల ఓటర్లు 4.61 లక్షల మంది దాకా ఉన్నారు. అభ్యర్థులు వీరి ఫోన్ నంబర్లను సేకరించి పట్టభద్రులకు కాల్స్ చేస్తున్నారు అభ్యర్థులు. ప్రచార గడువు చివరి దశకు చేరుకోవడంతో తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఓటర్లను చేరుకునేలా వివిధ పార్టీల అభ్యర్థులు ప్లాన్ చేస్తున్నారు. నేరుగా ఓటర్లకు ఫోన్లు చేయిస్తున్నారు. అభ్యర్థులు రోజులో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది నుంచి పన్నెండు ఫోన్ కాల్స్ చేస్తూ ఓటర్లను విసిగెత్తిస్తున్నారు. హలో.. నేను మీ పట్టభద్రుల ఉప ఎన్నిక అభ్యర్థిని.. అంటూ ఎన్నికల ప్రచారంతో ఫోన్స్ లో పట్టభద్రులను ఊదరగొడుతున్నారు.
రికార్డెడ్ కాల్స్ తో మోత మోగిస్తున్నారు
సాధారణ ప్రచారంలో భాగంగా అభ్యర్థులు పట్టభద్రులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బయట హంగామా ప్రచారాలు లేకున్నా సెల్‌ఫోన్లతో అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా కొందరు రికార్డింగ్ కాల్స్ చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువమంది ఓటర్లను కలిసేందుకు అభ్యర్థులు ఈ తరహ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఒక్కో అభ్యర్థి మూడు, నాలుగు రకాలుగా ప్రచార కాల్స్ చేస్తున్నారు. తమ పనుల్లో నిమగ్నమైన సమయాల్లో ఈ ఫోన్ కాల్స్ ఓటర్లను విసిగిస్తున్నాయి. కొన్ని కాల్స్ నిమిషం నిడివి ఉన్నవి కాగా, మరికొన్ని 30 నుంచి 40 సెకండ్ల నిడివిగల రికార్డెడ్ కాల్స్ చేస్తున్నారు. మరికొందరైతే నేరుగా కాన్ఫరెన్స్ కాల్స్ చేసి ఓటెయ్యమని అభ్యర్థిస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు నేరుగా తమని తాము పరిచయం చేసుకుంటూ ఇతర పార్టీలను విమర్శిస్తూ 3 నుంచి 4 నిమిషాల రికార్డెడ్ కాల్స్ చేస్తున్నారు. మరికొందరు రాష్ట్రస్థాయిలో, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మాజీ మంత్రులు, సెలబ్రెటీలతోనూ తమకు ఓటు వేయాలని చెప్పించుకునే వీడియోలు వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తం మీద ఈ ఫోన్ కాల్స్‌తో విసిగిపోతున్న పట్టభద్రులు.. నేటి సాయంత్రంతో ప్రచారానికి తెరపడటంతో ఊపిరిపీల్చుకోనున్నారు.