– కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
– షరతులతో కూడిన అనుమతి
– ఉమ్మడి రాజధాని, రుణమాఫీ అంశాలపై చర్చ వాయిదా వేయాలని కండిషన్
– తక్షణం అమలు చేయాల్సిన అంశాలపైనే నిర్ణయాలు ఉండాలని స్పష్టం
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశానికి ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రి వర్గ సమావేశానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో అత్యవసర విషయాలు, తక్షణం అమలు చేయాల్సిన అంశాలు మాత్రమే ఎజెండాలో ఉండాలని స్పష్టం చేసింది. జూన్ 4వ తేదీలోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలు, అప్పటి వరకు వేచి చూడటానికి వీలు లేని వాటిపై మాత్రమే కేబినెట్‌లో చర్చించాలని సూచించింది. అలాగే, లోక్ సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని చెప్పింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు కేబినెట్ సమావేశానికి హాజరు కావొద్దని షరతు విధించింది ఈసీ.
రేపు కేబినెట్ భేటీ
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. రేపు మధ్యాహ్నం సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సీఎం, మంత్రులు, సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.
షెడ్యూల్ ప్రకారం శనివారం కేబినెట్ భేటీ కోసం రేవంత్ ప్రభుత్వం ప్రయత్నించింది. సమావేశానికి అనుమతి ఇవ్వాలని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఎన్నికల అధికారిని కోరగా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఎన్నికల కోడ్ ఇంకా అమల్లో ఉన్నందున రాష్ట్ర కేబినెట్ సమావేశానికి అనుమతి ఇవ్వలేమని ఈసీ బ్రేకులు వేసింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి ఈసీఐ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
Also Read: విశ్వనగరం.. వానొస్తే నరకం
లోక్ సభ ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహిస్తున్నది ఈసీ. ఇప్పటికే నాలుగు విడతల పోలింగ్ ముగిసింది. చివరి విడత పోలింగ్ జూన్ 1వ తేదీన జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కోడ్ అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం నిర్వహించడంపై తొలుత రాష్ట్ర ఎన్నికల అధికారులు అభ్యంతరం తెలిపారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.