Election Commission: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. కీలక సమయంలో కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించింది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి రెండు రోజులపాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సిరిసిల్లలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ అభ్యంతరం తెలిపింది. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ అసహనం వ్యక్తం చేసింది.
ఏప్రిల్ 5వ తేదీన సిరిసిల్లలో కేసీఆర్ ఓ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్ అయింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు విచారించిన ఈసీ.. కేసీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు నిర్దారణకు వచ్చింది. దీంతో కేసీఆర్ పై యాక్షన్ తీసుకుంది. మే 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి రెండు రోజులపాటు కేసీఆర్ ప్రచారం నిర్వహించడానికి వీల్లేదని పేర్కొంది.
Also Read: నా చావుకు సీఐ, ఎస్‌ఐలే కారణం.. సూసైడ్ నోట్ రాసి..!
బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు ఎన్నికలకు సంబంధించి బహిరంగ సభలు, బహిరంగ ఊరేగింపులు, బహిరంగ ర్యాలీలు, ప్రదర్శనలు, ఎలక్ట్రానిక్ లేదా ప్రింట్ లేదా సోషల్ మీడియాలోనూ ఎలాంటి షోస్, ఇంటర్వ్యూలు, ప్రజా బాహుళ్యంపై ప్రసంగాలుగానీ కేసీఆర్ చేయడానికి వీల్లేదని ఈసీ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
తెలంగాణలో మే 13వ తేదీన లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రచారానికి మరో పది రోజులు మాత్రమే గడువు ఉన్నది. ఇందులో రెండు రోజులపాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధం పడటం బీఆర్ఎస్‌కు నష్టాన్ని కలిగిస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ బస్సు యాత్ర చేపడుతున్నారు. ముందస్తుగా షెడ్యూల్ చేసుకుని పలు నియోజకవర్గాల్లో ఆయన బస్సు యాత్ర చేస్తున్నారు. ఈసీ ఆదేశాలతో రెండు రోజులపాటు యాత్రకు కూడా బ్రేక్ పడనుంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కేసీఆర్ టూర్ పై పెట్టుకున్న ఆశలు గల్లంతు కానున్నాయి.
మోడీ వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా?
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. ఇదెక్కడి అరాచకం అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ గళమైన కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? అని ప్రశ్నించారు. మోడీ చేసే విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించడం లేదా? అని అడిగారు. మోడీ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని ట్వీట్ చేశారు. కేసీఆర్ పోరుబాటతో ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. వీరికి తెలంగాణ ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని ట్వీట్ చేశారు.