– తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెర
– అమల్లోకి వచ్చిన 144 సెక్షన్
– నలుగురి కంటే ఎక్కువ మంది కలిసుంటే చర్యలు
– జూన్ 1 సా.6.30 గంటల వరకు ఆంక్షలు
– పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
– వివరాలు వెల్లడించిన సీఈఓ వికాస్ రాజ్
Political Parties: పార్లమెంట్ సమరం తుది దశకు చేరుకుంది. శనివారంతో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. పార్టీల మైకులన్నీ బంద్ అయ్యాయి. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీఈఓ వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల బందోబస్తు, ఇప్పటిదాకా పట్టుబడిన డబ్బు, నమోదైన కేసుల వివరాలు వెల్లడించారు. జూన్ 1 సాయంత్రం 6.30 గంటల వరకు నలుగురి కంటే ఎక్కువ మంది కలిసి తిరగడానికి వీలులేదని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి ప్రచారం ఉండకూడదన్నారు.
కొన్ని సంస్థలు 13వ తేదీన సెలవు ఇవ్వడం లేదని, అలా చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇవాళ, రేపు పేపర్లలో ప్రకటనల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. 160 కేంద్ర కంపెనీల బలగాలు రాష్ట్రంలో ఇప్పటికే మొహరించాయని, ఇతర రాష్ట్రాల నుంచి 20వేల పోలీస్ బలగాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్‌లో రెండేసి బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని చెప్పారు వికాస్ రాజ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో 232 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఈవీఎం తరలించే వాహనాలకు జీపీఎస్ ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు సీఈఓ ఆఫీస్ మానిటరింగ్ చేస్తుందని తెలిపారు.
Also Read: మీడియా స్వేచ్ఛ మేడిపండు కానుందా..?
ఇప్పటివరకు రూ.320 కోట్ల నగదును సీజ్ చేసినట్టు చెప్పారు. అలాగే, 8600 ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్టు వివరించారు. లక్షా 90వేల సిబ్బంది పోలింగ్ విధుల్లో డైరెక్ట్‌గా పాల్గొంటున్నారని, మొత్తం 3లక్షల మంది ఉన్నారని తెలిపారు. ‘‘రానున్న 48 గంటల పాటు వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయి. బ్యాలెట్ ఓట్లు లక్షా 88 వేల వరకు పోల్ అయ్యాయి. 21,680 మంది ఓటర్లు హోం ఓటింగ్ వేసుకున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో 328 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం, అత్యల్పంగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు మూడు మాత్రమే’’ అని తెలిపారు వికాస్ రాజ్.