Wednesday, October 9, 2024

Exclusive

ఎన్నికల ప్రచారంలో ఎన్నెన్ని సిత్రాలో..

India Politics : ‘ప్రజాస్వామ్యంలో ఒక ఓటరు అజ్ఞానం.. మిగిలిన వారందరి భద్రతనూ ప్రమాదంలో పడేస్తుంది’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌. కెన్నెడీ ఆనాడు హెచ్చరించారు. ఆయన ఆనాటి మాటకు నేటి లోక్‌సభ ఎన్నికల వేళ కూడా గొప్ప ప్రాసంగికత ఉందంటే.. ఏడున్నర దశాబ్దాల ప్రజాస్వామ్యం తర్వాత కూడా ఓటరు చైతన్యంలో పెద్ద మార్పులేమీ రాలేదని అర్థమవుతోంది. తెలంగాణలో జోరుగా సాగుతున్న ఎన్నికల ప్రచారం సందర్భంగా.. గత ఐదేండ్లుగా ప్రజలను కన్నెత్తి చూడని నేతల గణాలంతా ఎంతో పరిచయమున్న వ్యక్తుల్లా ఎన్నికల ప్రచారం పేరుతో ఓటర్లను కలిసి, ఓటేయాలని కోరుతున్నారు. ఇంకొందరు దోసెలు వేస్తూ, బట్టలు ఉతుకుతూ, ఇస్త్రీ చేస్తూ, చంటి పిల్లలకు సాన్నాలు చేయిస్తూ ఓటర్ల మనసులో తమ పట్ల ఉన్న అసంతృప్తిని తగ్గించుకునే విన్యాసాలూ చేస్తున్నారు. మరోవైపు నేతలంతా ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చాలా సౌకర్యంగా చేరిపోతున్నారు. 1967లో హర్యానాలో ప్రారంభమైన ‘ఆయారామ్‌ గయారమ్‌’ సంస్కృతి నేడు మన తెలంగాణలోనూ ఈ ఎన్నికల వేళ ఆరు పువ్వులు పన్నెండు కాయలుగా వర్థిల్లుతోంది. గతంలో ఒక పార్టీ విధానం, సిద్దాంతాన్ని అమలు చేయటంలో అక్కడి పార్టీ పెద్దల నిర్లక్ష్యాన్ని భరించలేక.. నాయకులు పార్టీలు మారేవారు. ఇప్పడు కేవలం తనకు సీటివ్వకపోతే చాలు.. రెండవ ఆలోచన లేకుండా ఎగిరి నచ్చిన చెట్టుమీద వాలిపోతున్నారు. ఇప్పటిదాకా తామున్న పార్టీ ఇచ్చిన వాగ్దానాలపై విమర్శలు గుప్పిస్తూ.. ఇప్పుడు తాము చేరిన కొంగొత్త పార్టీల హామీలపై ప్రశంసలు కురిపిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఈసారి తెలంగాణలో 17 సీట్లకు గానూ 525 మంది బరిలో నిలిచారు. ఇప్పటికే రాష్ట్రం లౌడ్‌స్పీకర్లు, మైకుల శబ్దాలతో రాష్ట్రమంతా హోరెత్తుతోంది. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ తరపున వందలమంది స్టార్‌ క్యాంపెయినర్లు తమ ప్రసంగాలతో ఊదరగొడుతున్నారు. ఏ గ్రామం చూసినా, ఏ జిల్లాను పరిశీలించినా, ఏ టీవీ ఛానెల్‌ పెట్టినా, ఏ పత్రిక చదివినా అంతా ఎన్నికల గోలనే. సభలు, సమావేశాలు, కార్నర్‌ మీటింగ్‌లు, ఆత్మీయసమ్మేళనాల జోరే ఎక్కువ. ఈ ఊపును మరో వారం కొనసాగించేందుకు సాయంత్రం ఇచ్చే మందు, విందు అదనపు ఆకర్షణగా ఉంటోంది. మరోవైపు ప్రజాసమస్యలు మరుగునపడేలా నేతలు వ్యక్తి గత దూషణలు, తిట్లపురాణాలు. ఓటును మార్కెట్లో సరుకుగా మార్చేసి, సిద్ధాంతాలకు, వ్యవస్థలకు తిలోదకాలిచ్చిన ప్రధాన నేతల చుట్టూనే ప్రచారం అంతా కేంద్రీకృతమవుతున్న వాతావరణం కళ్లముందు కనిపిస్తోంది. ఎన్నికల కోడ్ అమలు కారణంగా ఎన్నికల సంఘం, పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్న సొమ్ము రోజురోజుకు పెరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచి ఇప్పటికే రూ. 202 కోట్ల విలువైన సొత్తు బయటపడగా, ఇందులో నగదు రూ. 77 కోట్లు. ఇది గాక రూ. 44 కోట్ల విలువైన 15.7 లక్షల లీటర్ల మద్యం పట్టుబడింది. నగదు, మద్యంతో బాటు డ్రగ్స్‌, విలువైన లోహాలు దొరకడం చూస్తే రాష్ట్రంలో ధన ప్రభావం విపరీతంగా ఉన్నట్టే. దిగజారిన రాజకీయ విలువలకు ఈ లెక్కలన్నీ దర్పణంగా నిలుస్తున్నాయి.

పాతిక ముఫ్ఫై ఏళ్ల క్రితం ఎన్నికల వేళ.. ఫలానా పార్టీకే ఓట్లేస్తామని ఓటర్ల చేత అభ్యర్థులు ఒట్టు వేయించుకునే పద్ధతి కనిపించేది. తర్వాత ఇది కుటుంబాల పరిధి నుంచి కుల సంఘాలకు విస్తరించింది. మరో దశాబ్దం నాటికి ఉద్యోగులు, న్యాయవాదులు, టీచర్, అంగన్ వాడీ, పోలీసు.. ఇలా సంఘటితమైన సమూహాలకు పాకింది. అయితే, కొన్నాళ్లుగా తెలంగాణలో కొత్త ట్రెండు ప్రారంభమైంది. పార్టీల అభ్యర్థులు తమ నియోజక వర్గాల్లోని గ్రామాలకు గ్రామాలను గంపగుత్తగా కొని, హోల్‌సేల్‌గా ఒట్లు వేయించుకుంటున్నారు. ముందస్తు ఒప్పందం ప్రకారం.. ఆ గ్రామంలోని అందరూ అనుకున్నట్లుగా ఓటేస్తే, ఒక నిర్దిష్ట భారీ మొత్తం ఆ గ్రామానికి సదరు అభ్యర్థి ముట్టజెప్తాడన్న మాట. ఎన్నికలైన తర్వాత అనుకున్న మొత్తం ఇస్తానని సదరు అభ్యర్థులు ఓట్టేస్తారు కాబోలు. దేవాలయాల నిర్మాణాల మొదలు నగరాల్లో అపార్టుమెంటుకు రంగులు వేసుకోవటానికయ్యే ఖర్చును ఇవ్వటానికీ అభ్యర్థులు పూచీ పడుతున్నారు. ఇవిగాక పోలింగ్ తేదీ వరకు ఆ ప్రాంతంలోని ఓటర్లుకు సాయంత్రపు కాలక్షేపాల బాధ్యతా అభ్యర్థులే తీసుకుంటున్నారు. దీనిని సమర్థింపుగా.. ఫలానా గ్రామం/ కాలనీ ఫలానా పార్టీకే ఓటేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసిందనే అందమైన కవరింగ్ వార్తలూ కనబడేలా చేయటానికి అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇదంతా చూశాక ఈ కలియుగంలోనూ ఇంకా.. మాట తప్పని లక్షలమంది సత్యహరిశ్చంద్రులు మన మధ్య ఉన్నందుకు సంతోషించాలా? లేక టోకుగా జనం అమ్ముడుపోతున్నందుకు బాధ పడాలో తెలియని దుస్థితి.

ఇక తెలంగాణలో ఎన్నికల ప్రచార సరళిని గమనిస్తే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో తానిచ్చిన 6 ప్రధాన హామీలను గట్టిగా ప్రచారం చేసుకుంటోంది. దీనికి తోడు 2004 నుంచి 2014 మధ్యకాలంలో కాంగ్రెస్ హయాంలో ఈ ప్రాంతానికి చేకూరిన మేలును గణాంకాలతో జనం ముందు చర్చకు పెడుతోంది. ఇవిగాక.. కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం జాతీయ స్థాయిలో రూపొందించిన మ్యానిఫెస్టోకు తోడు మరో 23 అంశాలను ఓడించి తెలంగాణలో ప్రచారం చేస్తోంది. మరోవైపు బీజేపీకి ఏనాడూ ఇక్కడ అధికారంలో ఉన్న చరిత్ర లేదు గనుక కేంద్రంలో తాము సాధించిన విజయాలు, గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు, జాతీయ స్థాయిలో తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని కమలనాథులు ప్రచారం చేస్తున్నారు. ఇక.. మిగిలిన మూడవ పార్టీ అయిన విపక్ష బీఆర్ఎస్ మాత్రం ఎన్నడూ లేనంతగా ఈ ఎన్నికల వేళ తడబాటులకు లోనవుతోంది. తాను అమలు చేసిన రైతు బంధు, రైతు బీమా పథకాలతో రైతుల జీవితాల్లో కొత్త వెలుగు వచ్చిందని చెబుతున్న కేసీఆర్.. తాను నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారే జీకి వచ్చిన ప్రమాదం గురించి మాట్లాడలేకపోతున్నారు. మేడిగడ్డతో బాటు అన్నారం బ్యారేజీని సైతం పూర్తిగా తీసేసి తిరిగి నిర్మించాలంటూ కేంద్ర బృందం తేల్చటమే దీనికి ప్రధాన కారణం కావచ్చు. వేల కోట్లు పోసి నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇప్పటివరకూ ఒక్క చుక్క సాగునీరు అందించలేకపోవటం, అసలు సంబంధిత కాల్వలే నిర్మించకపోవటం విస్మయం కలిగించే అంశాలుగా నిలుస్తున్నాయి. దీనికి తోడు కుమార్తె అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు గులాబీ పార్టీ అధినేతను కుంగదీస్తున్నాయి. తరచూ ప్రత్యర్థుల మీద ప్రదర్శిస్తున్న అసహనానికి ఇదే కారణమనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఇలా.. మన ఎన్నికల తంతు గురించి ఎన్ని విమర్శలున్నప్పటికీ, మనదేశంలో ప్రజాస్వామ్యమనేది ప్రజలందరికీ ప్రత్యక్షంగా అనుభవంలోకొచ్చేది మాత్రం ఎన్నికల సమయంలోనే అనే మాటనూ కొట్టిపారేయలేము. అయితే, ఓటును స్వేచ్ఛగా స్వతంత్రంగా వినియోగించుకోలేని దుస్థితిలో ఓటర్లున్న అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమూ మనదే. ఈ ఎన్నికల్లో కొన్ని నియోజక వర్గాల్లోని అభ్యర్థులను చూస్తే.. అక్కడ ఆటగాళ్లు మారారు తప్ప ఆటనియమాలేమీ మారలేదని ఓటరు నిరాశపడుతున్నాడు. కనీసం వారి పార్టీ ఎందుకు మారారో, ఎప్పుడు మారారో కూడా తెలియని పరిస్థితి. మరి.. ఇలాంటి చోట ప్రధాన పోటీదారులంతా ప్రజా వ్యతిరేకులే అయితే ఓటరు ఏం చేయాలి? ఎవరికి ఓటేయాలి? ఏ రాయి అయి తేనేం పళ్లూడగొట్టుకోవటానికి అన్నట్లు ఉన్నవాళ్లలోనే ఎవరో ఒకరికి ఓటేయాల్సి వస్తోంది. ఇదే సమయంలో కరెన్సీ కట్టలు, మద్యం, కులం, మతం వంటి అంశాలు ఊపిరిసలపనంతగా ఓటరు మనసును గందరగోళానికి గురిచేస్తుంటే.. ఆ ఓటరు ఎంపికలో నాణ్యతను ఆశించటం ఎలా సాధ్యమనేదీ మరో జవాబు లేని ప్రశ్న. ఇక్కడ చెప్పుకు తీరాల్సిన మరో బాధాకరమైన విషయం ఏమిటంటే.. నిజాయితీగా ప్రజలకోసం బరిలో నిలిచే నేతలెవరూ ఈ ప్రచార హోరులో జనాల ముందుకే రాలేకపోతున్నారు. ప్రజల పట్ల నిబద్దతతో, ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తామని చెబుతున్న ఈ ప్రగతి శీల నాయకుల మాటలు ఓటరు ముంగిటికి వెళ్లే అవకాశమూ కనుచూపుమేర కనిపించటం లేదు.

ఎన్నికలు, ఓట్లు, చట్టసభలనేవి ఒకరిద్దరు వ్యక్తుల కోసమో లేక ఒకట్రెండు పార్టీల ప్రయోజనాల కోసమో కాదనీ, విశాల ప్రజా ప్రయోజనాల కోసం ఉన్నాయనే వాస్తవాన్ని ఈ ఎన్నికల వేళ ఓటరు మనసుకు పట్టేలా చేయాల్సిన బాధ్యత ఇప్పుడు తెలంగాణలోని యువతదే. ఎన్నిలనేవి ఐదేండ్లకోసారి వచ్చే పండుగ కాదనీ, తమ జీవితాలను మలుపుతిప్పే మార్గాలని యువత గుర్తెరిగిన నాడు ప్రజాసంక్షేమానికి పాటు పడని నేతలను తమ ఓటుతో ప్రజలు ధైర్యంగా ఓడించగలుగుతారు. తమకున్న చైతన్యాన్ని తమ చుట్టూ ఉన్న పది మందికీ పంచగలుగుతారు. అంతిమంగా తమకు కావలసిన వారిని ఎన్నుకోగలుగుతారు. తెలంగాణలో మే 13న జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో యువత ఇదే స్ఫూర్తితో తమ ఓటు హక్కును వినియోగించగలరని నమ్ముదాం.

గోరంట్ల శివరామకృష్ణ
సీనియర్ జర్నలిస్ట్

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Plastic: ప్లాస్టిక్‌పై పోరాటం, నేటి అవసరం..

Fight Against Plastic, todays Need:పర్యావరణాన్ని కోలుకోని రీతిలో దెబ్బతీస్తున్న ప్రమాదకరమైన అంశాల్లో ప్లాస్టిక్ వినియోగం ఒకటి. గతంలో పట్టణాలకే పరిమితమైన ప్లాస్టిక్‌ వినియోగం నేడు పల్లెలకూ పాకింది. టీ షాపులు, పండ్ల...

TS Governance: పాలనపై ముద్రకు రేవంత్ ముందడుగు

CM Revanth Steps Forward To Impress Upon The Regime: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించి రేపటికి నిండా ఏడు నెలలు పూర్తవుతాయి. ప్రభుత్వం ఏర్పడి, మంత్రులంతా...

Fuel Sources: ప్రత్యామ్నాయ ఇంధన వనరులే శరణ్యం

Alternative Energy Sources Are The Refuge: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పారిశ్రామికీకరణ, ఆధునిక జీవన విధానం కారణంగా మానవుని ఇంధన అవసరాలు నానాటికీ పెరుగుతున్నాయి. అయితే, అవసరాలే ప్రాతిపదికగా యథేచ్ఛగా ఇంధన వనరులను...