Editorial on Indian Politics : ఆదిమానవుడు అనంత కాల ప్రయాణంలో ప్రకృతి సృష్టించిన అనేక అవరోధాలను అధిగమించి, ఆధునిక మానవుడిగా పరిణామం చెందాడు. లక్షల సంవత్సరాల ఈ పరివర్తన ప్రయాణంలో మనిషి నాలుగు కాళ్ల జంతువు నుండి రెండు కాళ్ళ మనిషిగా మరాడు. దీనినే మానవపరిణామ సిద్ధాంతంగా డార్విన్ ప్రవచించాడు. తొలినాళ్లలో ఆదిమానవుడు కొండలు, కోనలు, చెట్లు, పుట్టలు, గుహలను తన ఆవాసాలుగా చేసుకున్నాడు. సమూహాలుగా జీవించే ఆ రోజుల్లోనే ఆహారం, ఆధిపత్యం, మహిళలను సొంతం చేసుకోవాలనే తపన.. మనిషిని పోరాటానికి పురికొల్పింది. ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు జరిగిన ఈ మలి ప్రయాణానికీ వేల ఏళ్లు పట్టింది. వావివరసలు లేని పశుత్వం నుండి ‘నేను, నా పిల్లలు, నా కుటుంబం’ అనే స్పష్టమైన అవగాహన కుటుంబ జీవన వ్యవస్థకు పునాదులు ఏర్పరచింది. ఆహార ఉత్పత్తి దశలో మిగులు ఆహారాన్ని ఎక్కడ దాచుకోవాలనే అతని ప్రశ్న ఆదిమానవుడిని కొండగుహల నుంచి నదీ తీరాలకు చేర్చింది. అక్కడ తాను ఏర్పరచుకున్న నివాసం తనకు మాత్రమే సొంతమనే భావన.. కాలక్రమంలో రాజ్యం అనే భావనకు దారి తీసింది. అలా పురుషాధిక్య సమాజంలో ఆస్తిగా భావించబడిన మహిళలు,పిల్లలతో సహా స్థిరచరాస్తులను కాపాడుకోవటానికి రాజ్యం అనేది ఏర్పడింది. దానితో బాటే నాయకత్వమూ అవసరమైంది. సమాజ అభివృద్ధిలో రాజ్యం ఏర్పడడానికి ఇవే ప్రధాన కారణాలని రాజ్యావతరణ సిద్ధాంతం చెబుతుంది.
రాజ్యం అవతరించిన తొలినాళ్లలో దానికి మూడే బాధ్యతలుండేవి. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయడమే ఆ మూడు బాధ్యతలు. మానవ సమూహాలు చిన్నచిన్న రాజ్యాలుగా, రాజ్యాలు సామ్రాజ్యాలుగా మారి స్త్రీల కోసం, ఆస్తుల కోసం, పాలనపై పెత్తనం కోసం అనేక యుద్ధాలు జరిగాయి. మన పురాణేతిహాసాలు ఇందుకు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఆధునిక రాజులలో అశోక చక్రవర్తి గురించి మనం చరిత్రలో చదువుకున్నాం. ‘అశోకుడు రోడ్లు వేయించెను, చెట్లు నాటించెను. ప్రయాణికుల మంచినీటి అవసరాల కోసం బావులు తవ్వించెను, సత్రములు కట్టించెను’ అనే మాటలు చదువుకున్నాం. కేవలం ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయడం మాత్రమే కాకుండా ప్రజల కనీస అవసరాలను తీర్చుతూ, వారి జీవన ప్రమాణాలను పెంచడానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించిన తొలి ఆధునిక పాలకుడిగా అశోకుడు చరిత్రలో నిలిచిపోయాడు. ఆ తర్వాత ఎందరో రాజులొచ్చినా, రాజ్యాలు ఏర్పడినా రాజ్యాధికారంలో ఉన్నవారి బాధ్యత మాత్రం మారలేదు. పైగా అది నానాటికీ దాని పరిధిని విస్తరించుకుంటూ పలు బాధ్యతలు పాలకులకు దఖలు పడ్డాయి. ఈ మొత్తం పరిణామాన్ని సరిగా అర్థం చేసుకుంటే, నేటి మన ప్రజాస్వామ్య యుగంలోనూ రాజ్యపు కర్తవ్యాన్ని నేటి ఆధునిక ప్రభుత్వాలు సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాయి.
నేటి రోజుల్లో నేతలు, పార్టీలు తమకు ప్రజలిచ్చిన అధికారం శాశ్వతం అనే భావనలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలోనే వారు శత్రుశేషం, రుణ శేషం వద్దనుకుంటున్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు తమకు తిరుగులేదని విర్రవీగుతున్నాను. వారే అధికారం కోల్పోగానే అకస్మాత్తుగా బేలగా మాట్లాడుతున్నారు. సర్వం కోల్పోయి ప్రజల ముందు చౌకబారు వేషాలకు దిగుతున్నారు. ‘అధికారాంతమునందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నట్లుగా తాము అధికారంలో ఉన్నప్పుడు తమంత వీరులు, శూరులు లేరని అడ్డూఅదుపూ లేకుండా ప్రవర్తించిన వారే అధికారం కోల్పోగానే తాము బాధితులమన్నట్లుగా ఆర్తనాదాలు చేస్తున్నారు. గురివింద గింజ సామెత లాగా తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించామనే విషయాన్ని మరచి, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారిని తమ లక్ష్యంగా చేసుకుని ఆరోపణలకు దిగుతున్నారు. అయితే, ఈ విషయంలో ప్రజలు కూడా అంతే తెలివిగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యం తమకిచ్చిన ‘ఓటు’ అనే ఆయుధాన్ని అవసరానికి తగ్గట్లుగా వాడుతూ, బాధ్యతారాహిత్యానికి దిగిన పాలకులను ఇంటిబాట పట్టిస్తున్నారు. ఒక్కోసారి నిన్నగాక మొన్న తాము ఎన్నుకున్న ప్రభుత్వాలనూ ‘దిగిపొండి’ అని నిర్మొహమాటంగా ప్రజలు చెప్పగలుగుతున్నారు. దీనిని ఇంగ్లిష్‌లో ‘ఓట్ అండ్ షౌట్’ అంటారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు రోజురోజుకు పెరగటమే దీనికి కారణం. ప్రజల్లో వచ్చిన ఈ ప్రతికూల ధోరణిని పెంచిపోషించింది కూడా రాజకీయ పార్టీలే. వ్యక్తిగత స్వార్థం పెరగటంతో, నేటి వర్తమాన పాలకులు తమ కర్తవ్యాలను మరచి మధ్యయుగాల నాటి ప్రతీకార రాజకీయానికి దిగుతున్నారు. ఈ విషయంలో దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ సంయమనం పాటించటం లేదు.
ఇక ప్రస్తుతానికి వస్తే దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. రెండు నెలల్లో ఎన్నికలు పూర్తికానున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సహజమే. కానీ ఎన్నికలు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. నేటి దేశ పరిణామాలు చూస్తుంటే మనదేశ ప్రజాస్వామ్యమూ ఎన్నికలే సర్వస్వం అనుకునే దేశాల సరసన చేరుతుందనిపిస్తోంది. ఎన్నికైన నాటి నుంచి మళ్లీ ఎన్నిక వచ్చే వరకు సమాజానికి ఏం చేయాలనే విషయాన్ని మరచిన రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఈ కాలాన్ని తమకు దక్కిన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు దుర్వినియోగం చేస్తున్నాయి. తామున్నది జనహితం కోసమనే ఎరుకను కోల్పోయి, చరిత్రలోని నియంత పాలకుల్లాగా ఎదురే లేకుండా పాలించాలనీ, తమ అధికార పరిధిని మరింత విస్తరించుకోవాలనే యావలో పడి పార్టీలు, నేతలు కొట్టుకుపోతున్నారు. పదేసి జిల్లాలకే పరిమితమైన పార్టీల నేతలూ ఢిల్లీ గద్దెనెక్కాలని తాపత్రయపడటం, ఈ క్రమంలో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవటం జరుగుతోంది. తమ పరిధిలోని రాజ్యాంగ వ్యవస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తూ, తమను నిలదీసిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేయటం, ఇదేంటని ప్రశ్నించిన రాజకీయ ప్రత్యర్థులను వేధించటం జరగుతోంది. ఇది నచ్చక జనం తిరిగి ఆ పార్టీని విపక్షానికే పరిమితం చేసిన రోజున.. గద్దెనెక్కిన కొత్త సర్కారూ ఆ వికృత క్రీడనే ఎంచుకొని కొనసాగించటం మన దురదృష్టం. గత ఐదేళ్లు తాము చేసిన పాపాలే నేడు ‘రివెంట్ పాలిటిక్స్’ రూపంలో తమకు శాపాలుగా మారుతుంటే.. తాము బాధితులమంటూ నేతలు శోకాలు పెట్టటం నేడు మనం చూస్తూనే ఉన్నాం.
దేశవ్యాప్తంగా ఎన్నికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ సంస్థలను తమ పెంపుడు చిలకలుగా మార్చుకుంటున్నాయి. విపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతూ ఆ పార్టీలను కుంగదీయటంతో బాటు పౌరుల నైతిక స్థైర్యాన్ని నేటి పాలకులు దెబ్బతీస్తున్నారు. ప్రశ్నించే పౌరులను రాజద్రోహం పేరుతో ఏళ్ల తరబడి జైళ్లలో కుక్కి పాశవిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కోర్టుల్లో ఇవన్నీ నిరాధారమని తేలినట్లు తీర్పులు వస్తే, ఏమీ జరగనట్లే నటిస్తూ తప్పుకుపోతున్నారు. నేడు దేశవ్యాప్తంగా సుమారు 50 మంది విపక్ష నేతలు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలను ఎదుర్కొంటున్నారు. నేతలను తమ దారికి తెచ్చుకునేందుకు సామ, దాన,భేద,దండోపాయాలను ప్రయోగిస్తూ, తమకు దాసులు కానివారిని చివరికి జైలుపాలు చేస్తున్నారు. కేసులకు భయపడి తమకు దాసోహం అన్న నేతలను తమ పార్టీలో చేర్చుకుని వారిని గంగాస్నానం చేసినంత పునీతులుగా ప్రకటించేస్తున్నారు. అప్పటిదాకా వారిపై పెట్టిన కేసులు, చేసిన ఆరోపణల గురించి అటు పాలకులు గానీ, దర్యాప్తు సంస్థలు గానీ ఏమీ మాట్లాడకపోవటాన్ని బట్టి తెరవెనక ఏం జరిగిందో సామాన్యుడికీ అర్థమవుతోంది. రేపో మాపో అరెస్ట్ అంటూ భయావహ వాతావరణం కల్పించి పార్టీలో చేర్చుకుని కండువా కప్పటం, తమ దారికి రానివారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపటం ఈ కథలో సాధారణంగా కనిపించే సన్నివేశాలు.
ఇక కొసమెరుపు ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మొదట అరెస్టైన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నుండి సీఎం కేజ్రీవాల్ వరకు ఇదే తంతు కొనసాగుతుంది. జార్ఖండ్ నేతల నుంచి తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరకు కేసుల మీద కేసులు పెట్టి జైలు నుండి బయటకు రాకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఆ పరంపరలోనే నేటి నడుస్తున్న చరిత్రలో భాగంగానే గత నెల 15న అరెస్టై, తీహారు జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితను నేడు సిబిఐ మరోసారి అరెస్టు చేసింది. కవితకు మద్యంతర బెయిల్ లేక రెగ్యులర్ బెయిల్ రాకముందే మరో కేసులో ఇరికిస్తే ఇప్పట్లో కవిత బయటికి రాదనే అంచనాతో సీబీఐ పేరుతో మరోసారి అరెస్టు చేశారు. ఇక్కడ కవితతో పాటు నిందితులెవరూ తప్పు చేయలేదని నేను చెప్పటం లేదు. నిందుతులకి తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే. కానీ తమ పార్టీలోని అవినీతి పరులను గాలికొదిలేసి, విపక్షంలోని నేతలనే టార్గెట్ చేసుకోవటం, ఈ అనైతిక వ్యవహారాలకు రాజ్యాంగాన్ని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయటమే పెద్ద అభ్యంతరం. గతంలో అన్ని కేంద్ర ప్రభుత్వాలూ ఏదో ఒక స్థాయిలో ఈ పనులు చేశాయి. ఒకనాడు సీబీఐని ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అని బీజేపీ ఎగతాళి చేయగా, సీబీఐతో బాటు సకల దర్యాప్తు వ్యవస్థలూ బీజేపీ పెంపుడు చిలకలని కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది. నాటి బాధితులు నేటి పాలకులుగా ఉండటం, నాటి పాలకులు నేడు బాధితులుగా మారటం విధివైచిత్రి. ఇక్కడ కేవలం పాత్రలు మారాయి తప్ప ప్రతీకార రాజకీయం మాత్రం అలాగే కొనసాగుతోంది. తమ తమ స్థానాలు తప్పితే, మిత్రులే శత్రువులు అవుతారన్న సుమతీ శతక కారుడి మాటను మన పాలకులు అర్థం చేసుకోగలిగితే వారెవరూ ఇలాంటి తప్పులు చెయ్యరు.
దేశవ్యాప్తంగా పార్టీలు, నేతలు శిబిరాలుగా విడిపోయి ఒకరినొకరు విమర్శించుకుంటూ ఎన్నికల యుద్ధం చేస్తున్నారు. ఎన్నికలంటే నేడు వన్‌డే క్రికెట్ మ్యాచ్ లాగా మారిపోయింది. డబ్బు, దస్కం, అర్థబలం, అంగబలం ఉన్నవారే నేటి రాజకీయాల్లో నిలబడగలుగుతున్నారు. సామాన్య ప్రజలు, నిబద్ధతగల నాయకులు మన దేశ రాజకీయాల్లో రోజురోజుకు కరువవుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల యుద్ధంలో అభ్యర్థులు తమ గెలుపుకై వీరోచితంగా పోరాడుతుంటే, మనమూ మనకు నచ్చిన ఎవరో ఒక అభ్యర్థికి జై కొడుతున్నాం. మనకు తెలియకుండానే ఈ మాయా యుద్ధాన్ని ఒక ప్రేక్షకుడిగా చూస్తూ చప్పట్లు కొడుతున్నాం. ఈ పోరాటంలో ఏ పులి గెలుస్తుందా అంటూ బెట్టింగులు కూడా కాస్తున్నాం. మన కష్టార్జితాన్ని ఎన్నికల వేళ పణంగా పెడుతున్నాం. ఈ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు పులులయితే వారికి వంత పాడే మనం మేకలం. పులుల పోరాటం మేకల కోసమే కదా! ఎవరు గెలిచినా చివరికి గెలిచిన పులి నోట మేకలు చిక్కాల్సిందే కదా!.
-బండారు రామ్మోహనరావు.
సెల్ నెంబర్:98660 74027.