MLA Gudem Mahipal Reddy
Politics

Illegal Mining: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్.. బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ

Gudem Mahipal Reddy: అక్రమ మైనింగ్ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్నది. గత నెల 20వ తేదీన మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిల నివాసాలు, కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ తనిఖీలు చేసింది. ఆ తర్వాత మహిపాల్ రెడ్డిని ఢిల్లీలోని కార్యాలయంలో విచారించింది. తాజాగా ఈడీ మహిపాల్ రెడ్డికి సంబంధించిన బ్యాంక్ లాకర్లను తెరించింది. అందులో నుంచి 1.2 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుంది. అలాగే.. విలువైన డాక్యుమెంట్లనూ సేకరించింది. పటాన్‌చెరులోని ఎస్‌బీఐ బ్యాంక్‌లోని మహిపాల్ రెడ్డి లాకర్లను ఈడీ ఓపెన్ చేసింది. ఎస్‌బీఐ లాకర్‌లో 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ బంగారం విలువ దాదాపు రూ. 1 కోటి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బంగారు బిస్కెట్లకు రసీదులు, డాక్యుమెంటేషన్లు లేవని ఈడీ గుర్తించింది. దేశీయ మార్కెట్ నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోలేదని ఈడీ భావిస్తున్నది.

ఎమ్మెల్యే, ఆయన కుమారుడు విక్రమ్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి బినామీ కంపెనీలకు చెందిన 100 రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఫోరెన్సిక్ పరీక్ష కోసం ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఇద్దరి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. పటాన్‌చెరు పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా వీరు సుమారు రూ. 300 కోట్ల విలువైన మైనింగ్‌ అక్రమంగా దోపిడీ చేశారంటూ గుర్తించింది.

బీఆర్ఎస్‌కు చెందిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి మైనింగ్ వ్యవహారంలో అక్రమ మార్గం పట్టారని ఈడీ ఆరోపించింది. అక్రమ మైనింగ్ ద్వారా వీరు సుమారు రూ. 300 కోట్ల వరకు కూడబెట్టుకున్నారని, రాయల్టీ రూపంలో ప్రభుత్వాన్ని చెల్లించే రూ. 39 కోట్లు కూడా ఎగవేసినట్టు ఈడీ గుర్తించింది. ఇలా అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బులను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించింది.

ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్యే, ఆయన సోదరుడిని ఈడీ విచారించింది. గురు, శుక్రవారాల్లో కూడా మరికొందరిని విచారించనుంది.