BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితతోపాటు మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ ఐదుగురు నిందితుల పాత్రపై ఆధారాలతో సహా వివరాలను చార్జిషీట్‌లో పొందుపరిచినట్టు కోర్టుకు ఈడీ న్యాయవాది తెలిపారు. కవిత, దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్‌లపై ఆరో సప్లిమెంటరీ చార్జిషీట్‌ను దాఖలు చేశామని, దీనిని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని ఈడీ కోరింది.
ఈ చార్జిషీట్‌పై వాదనలు వినిపిస్తూ తొలుత కవిత పాత్ర గురించి వివరించడానికి ఈడీ సిద్ధం కాగా, ఆమె పాత్ర మినహా మిగతా నలుగురు నిందితుల గురించి వివరించాలని న్యాయమూర్తి కావేరి బవేజా సూచించారు. దీంతో ఈడీ ఆ నలుగురి గురించి వివరించింది. ప్రిన్స్ కుమార్ చారిట్ మీడియా సంస్థలో ఉద్యోగిగా పని చేశారని, రూ.100 కోట్ల అక్రమ మళ్లింపులో కీలక పాత్ర పోషించారని ఆరోపించింది. హవాలా ఆపరేటర్ ఆర్ కాంతి కుమార్ ద్వారా సుమారు రూ.16 లక్షల రూపాయలు ప్రిన్స్ కుమార్‌కు అందాయని తెలిపింది. 3 కరెన్సీ నోట్ల సీరియల్ నెంబర్లను టోకెన్ నెంబర్‌గా వాడి హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నాడని ఈడీ పేర్కొంది. అందుకు సంబంధించిన కాల్ రికార్డింగ్, కాల్ డేటా ఇతర ఆధారాలను సేకరించినట్టు వివరించింది. హవాలా చెల్లింపుల కోసం ప్రిన్స్ కుమార్ మూడు నెంబర్లు వాడారని తెలుపగా ఆ నెంబర్లు ఎవరి పేరు మీద ఉన్నాయని కోర్టు అడిగింది. వాటి వివరణలు ఇవ్వాలని ఈడీకి కోర్టు సూచించింది.
ఇక మరో నిందితుడు అరవింద్ సింగ్ డబ్బులు గోవాకు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించాడని ఈడీ తెలిపింది. కవిత కస్టడీ పొడిగించాలని చేసిన ఈడీ వాదనలను కౌంటర్ చేస్తూ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని ఆమె తరఫు న్యాయవాది నితీశ్ రాణా వాదించారు. కవిత రిమాండ్‌ను పొడిగించిన కోర్టు ఈడీ చార్జిషీట్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది.