ED Arrested MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ అప్డేట్. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను విచారించిన ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. సుమారు 4 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ మేరకు కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు కవిత ఇంటి దగ్గరకు భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. ఈడీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ డౌన్ డౌన్ అంటూ హోరెత్తించారు. మాజీ మంత్రి కేటీఆర్ అధికారుల తీరుపై మండిపడ్డారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ లెక్కలు తేల్చే పనిలో పడ్డాయి సెంట్రల్ ఏజెన్సీలు. ఈడీ, సీబీఐ చార్జీషీట్లలో నిందుతురాలిగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత ఇల్లు, ఫాంహౌజ్ కార్యాలయాల్లో శుక్రవారం ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలకు దిగారు. విచారణకు హాజరు కాకుండా మెండికేస్తున్న కవిత ఇంట్లో సడెన్‌గా అధికారులు ప్రత్యక్ష్యం కావడంతో బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ పుట్టించింది. సుప్రీంలో విచారణ ఉన్నందున రాలేనని ఈమధ్య సీబీఐకి కవిత తెల్చి చెప్పడంతో అధికారులే సాక్ష్యాల కోసం తనిఖీలకు దిగారు. సీబీఐ చార్జిషీట్లలో నిందుతురాలిగా లేనప్పుడు మూడు సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు కవిత. కానీ, ఒక్కో నిందితుడు అప్రూవర్‌గా మారుతుండటంతో సీబీఐకి క్రేజీవాల్, కవిత మోస్ట్ వాంటెడ్‌గా మారారు. విచారణకు రాకుండా ఏదో ఒక కారణం చెప్పడంతో నేరుగా రంగంలోకి దిగింది ఈడీ. తనిఖీల సమయంలో కవిత, ఆమె భర్త ఇంట్లోనే ఉన్నారు. మీడియాలో వార్తలతో కవిత లీగల్ టీమ్ ఇంటి దగ్గరకు వచ్చింది. కానీ, ఈడీ అధికారులు లోపలికి అనుమతించ లేదు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కవిత నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Read More:పొడుస్తున్న పొద్దు… నడుస్తున్న చరిత్ర!
గతంలో ఢిల్లీలో మూడు రోజుల్లో 30 గంటల పాటు కవితను ఈడీ సుదీర్ఘంగా విచారించింది. ఆమె వాడిన 10 ఫోన్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థలు మహిళలను వారి కార్యాలయనికి కాకుండా ఇంటికే వచ్చి విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని కవిత సుప్రీంను ఆశ్రయించారు. అప్పటి వరకు తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఈడీకి అదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. కవిత పిటిషన్‌పై తాజాగా విచారించిన సుప్రీంకోర్టు విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. అయితే కేసు విచారణ దశలోనే ఉండగా కవిత నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టడం, ఆ వెంటనే అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
హైదరాబాద్‌లో మోడీ పర్యటన ఉన్న రోజే లిక్కర్ కేసులో కవిత అరెస్ట్‌తో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. 2021 మార్చి 19, 20 తేదీల్లో విజయ్ నాయర్‌ను కవిత కలిశారనేది ఈడీ ఆరోపణ. ఇండో స్పిరిట్‌లో కవితకు 32.5 శాతం వాటా ఉందని, మొత్తం రూ.292 కోట్లు ముట్టినట్లు చెబుతోంది. ఇండో స్పిరిట్స్ లాభం ద్వారా రూ.192 కోట్లు దక్కించుకోగా, పలు ఛార్జిషీట్లలో కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. ఈ కేసులో మాగుంట రాఘవ అప్రూవర్‌గా మారాడు. అలాగే, అశోక్ కౌశిక్ వాంగ్మూలాల ఆధారంగా నోటీసులు జారీ అయ్యాయి. కవిత ఇంట్లోనే అభిషేక్ తనకు పరిచయమయ్యాడని కౌశిక్ చెప్పినట్టు అధికారులు అంటున్నారు. అభిషేక్ ఆదేశాలతోనే క్యాష్ డీల్ చేసినట్లు అంగీకారించాడు.
Read More:ఎవరు మీరు..? మాజీ కలెక్టర్‌కి షాకిచ్చిన బినామీ సంస్థ
దీంతో 161 కింద నోటీసులు ఇచ్చి విచారించింది సీబీఐ. తర్వాత న్యాయనిపుణలుతో పలుమార్లు చర్చించారు కవిత. ఈ క్రమంలోనే ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నవంబర్ 20 దాకా సమన్లు వద్దని సుప్రీం చెప్పగా, కేంద్రంపై కవిత ఫైరయ్యారు. ఇవి ఈడీ నోటీసులు కావు మోడీ నోటీసులని మండిపడ్డారు. రాజకీయ కక్షతో కుట్ర చేస్తున్నారని అన్నారు. అయితే, కవిత బినామీగా భావిస్తున్న రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారడంతో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలాగే, ఆడిటర్ బుచ్చిబాబును కూడా విచారించారు అధికారులు. ఇదే కేసులో మనీశ్ సిసోడియా, శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో కవిత అరెస్ట్ కావడంతో కేసులో కీలక పురోగతి సాధించినట్టయింది.