– ప్రభుత్వం మారినా మారని కొందరు ఉద్యోగులు
– కొన్ని శాఖల్లో ఇంకా పాత వాసనే
– గులాబీ నేతల కనుసన్నల్లోనే
– తప్పని తెలుసు.. అయినా మారని తీరు
– ఏరికోరి చిక్కుల వైపు పయనం
– అన్నీ గమనిస్తున్న ప్రభుత్వం
EC Suspends 106 Govt Employees : ఉద్యోగులు ప్రభుత్వం మాట వినడం కామన్. కానీ, గవర్నమెంట్ మారాక కూడా గతం తాలూకు వాసనను పోగొట్టుకోకపోతే చిక్కులు తప్పవు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అయినా, కొందరు ఉద్యోగుల్లో మార్పు రావడం లేదు. చివరకు సస్పెన్షన్ వేటుకు గురవుతున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థితో భేటీ.. 106 మందిపై వేటు
ఎన్నో సమావేశాలు, మరెన్నో చర్చల తర్వాత మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిని ఎంపిక చేశారు గులాబీ బాస్ కేసీఆర్. గతంలో ఈయన సిద్దిపేట కలెక్టర్‌గా పని చేశారు. ఉమ్మడి జిల్లా ఉద్యోగులతో మంచి రాపో ఉంది. దీన్ని ఈసారి ఎన్నికల్లో క్యాష్ చేసుకోవాలని ఆయన ప్లాన్ చేసుకున్నారు. సైలెంట్‌గా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే సెర్ఫ్, ఈజీఎస్ ఉద్యోగులతో ఓ ఫంక్షన్ హాల్‌లో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని పసిగట్టిన కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ఫంక్షన్ హాల్‌కు తాళం వేసి పోలీసులకు కబురుపెట్టారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఉద్యోగులు అతిగా ప్రవర్తించారని 106 మందిపై వేటు వేశారు కలెక్టర్ మను చౌదరి. సస్పెండ్ అయిన వారిలో 38 మంది సెర్ఫ్ ఉద్యోగులు ఉండగా, వారిలో ఏపీఎంలు 14, సీసీలు 18, వీవోలు నలుగురు, ఓ సీఓ, ఓ సీబీ ఆడిటర్స్ ఉన్నారు. అలాగే, 68 మంది ఈజీఎస్ ఉద్యోగులపైనా సస్పెన్షన్ వేటు పడింది.
మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి కేసులోనూ అంతే!
బీఆర్ఎస్ నేత షకీల్ కుమారుడు రాహిల్ పేరు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వినిపిస్తూనే ఉంటుంది. బీఆర్ఎస్ పాలనలో ఓ యాక్సిడెంట్ కేసులో అతని పాత్ర ఉందన్న అనుమానాలున్నాయి. రాష్ డ్రైవింగ్ కారణంగా ఓ చిన్నారిని బలి తీసుకున్నాడన్న ఆరోపణలున్నాయి. అప్పుడున్నది తమ ప్రభుత్వం కావడంతో పోలీసులను మ్యానేజ్ చేశారనే విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే, ప్రభుత్వం మారాక కూడా షకీల్ పోలీసులను గట్టిగా వాడేసుకున్నారు. ప్రజా భవన్ దగ్గర రాహిల్ కారు బారికేడ్లను ఢీకొట్టగా పోలీసులు అతడ్ని పీఎస్‌కు తరలించారు. అయితే, అతని బదులు డ్రైవర్‌ను పంపి రాహిల్ దుబాయ్ చెక్కేశాడు. ఈ వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు కీలకంగా వ్యవహరించారు. షకీల్‌తో ఉన్న సత్సంబంధాలు, ఇతర కారణాలతో రాహిల్‌ను సైడ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఇన్స్పెక్టర్ దుర్గారావు సహా మరో ఇద్దరు ఆఫీసర్స్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే, హోంగార్డుల నుంచి ఇన్స్పెక్టర్ల దాకా ఒకే దఫాలో 86 మందిని పంజాగుట్ట పీఎస్ నుంచి బదిలీ చేశారు. గులాబీ పెద్దలకు సహకారం అందిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సీపీ ఇలా స్టేషన్ మొత్తాన్ని ప్రక్షాళన చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు సరేసరి!
కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. ఇప్పుడది సంచలనంగా మారింది. ప్రణీత్ రావు ఇందులో కీలక పాత్రధారిగా కనిపిస్తున్నాడు. అతని నుంచి కూపీ లాగగా, రాధా కిషన్ రావు, ప్రభాకర్ రావు, ఇలా మరికొంత మంది రావుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ కేసుపై ప్రత్యేక బృందం దర్యాప్తు కొనసాగిస్తోంది. మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలతో అంటకాగిన ప్రభుత్వ ఉద్యోగులకు చెక్ పడుతోంది. వరుసగా ఒక్కొక్కరు సస్పెండ్ అవ్వడమో, కేసు తీవ్రతను బట్టి కటకటాల పాలవ్వడమో జరుగుతోంది. ఇప్పటికైనా అధికారుల్లో మార్పు వస్తే మంచిదనే సూచనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.