Revanth Reddy Cabinet: రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో వడ్ల కొనుగోలుపై ఎంఎస్పీపై అదనంగా రూ. 500 బోనస్ ఇవ్వాలనే నిర్ణయం జరిగింది. ఇదే విషయాన్ని మంత్రులు మీడియాకు చెప్పారు. వడ్ల కొనుగోలుపై రూ. 500 బోనస్ అంశంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని, తమది ప్రజా పాలన అని స్ఫష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ సన్న వడ్లకు మాత్రమే రూ. 500 బోనస్ అని ప్రకటించలేదని చెప్పారు. సన్న వడ్లతో బోనస్ ఇచ్చే ప్రక్రియను మొదలు పెడుతామని, అంతేకానీ, కేవలం సన్నవడ్లకే రూ. 500 బోనస్ ఇస్తామని తాము ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేదని, ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. అన్ని రకాల వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పారు. కాబట్టి, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి వడ్లు కొనుగోలు జరుగుతున్నది. దీంతో గత ప్రభుత్వ పని తీరును, ఈ ప్రభుత్వ పని తీరును బేరీజు వేయడం సహజంగానే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. ప్రభుత్వం వడ్ల కొనుగోలులో జాప్యం వహిస్తున్నదని, అందుకే వడ్లు కళ్లాల్లోనే వర్షాలకు తడిచిపోతున్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తగిన సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వం కంటే కూడా ముందుగానే వడ్ల కొనుగోలు ప్రక్రియను తమ ప్రభుత్వం ప్రారంభించిందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. గతంలో కంటే 15 రోజులు ముందుగానే కొనుగోళ్లు ప్రారంభించామని వివరించారు. అంతేకాదు, కొనుగోలు కేంద్రాలనూ పెంచామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కంటే కూడా ఎక్కువ కొనుగోలు కేంద్రాల్లో (7245) ధాన్యాన్ని కొంటున్నామని తెలిపారు.
ధాన్యం తడిసినా, మొలకెత్తినా కనీస మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అన్నదాతలు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనతో రైతుల్లో హస్తం పార్టీకి మద్దతు పెరుగుతున్నదని, ఇది ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఫైర్ అయ్యారు. అందుకే పనిగట్టుకుని బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, అలాగే రైతులనూ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. కేవలం సన్నవడ్లకే రూ. 500 బోనస్ ఇస్తుందన్న వాదనలు అర్థరహితం, అవాస్తవం అని కొట్టిపారేశారు. సన్నవడ్లతో రూ. 500 బోనస్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు.