Dubai Airport Closed After Desert City Hit By Heaviest Rainfall In 75 Years: భారీ వర్షాలతో ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అల్లాడిపోయింది. ఏడాది మొత్తంలో కురవాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతో దుబాయ్ నగరమంతా చిగురుటాకులా వణికిపోయింది. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో కురిసిన భారీ వర్షం కారణంగా దుబాయ్‌లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కుండపోత వర్షాల కారణంగా ప్రపంచంలోకెల్లా అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్టుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన దుబాయ్ విమానాశ్రయానికి వచ్చే విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకూ దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే విమానాలను దారి మళ్లిస్తున్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. అయితే దుబాయ్ నుంచి బయల్దేరే విమానాలు మాత్రం యథావిధిగా బయల్దేరుతాయని ఎయిర్‌పోర్ట్ వర్గాలు వెల్లడించాయి.
నీటితో నిండిపోయిన దుబాయ్ ఎయిర్‌పోర్టును చూస్తే.. వర్షాకాలంలో తరచుగా నీటమునిగే చెన్నై ఎయిర్‌పోర్ట్ గుర్తుకొచ్చింది. భారీ వర్షాల కారణంగా యూఏఈ వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల కారణంగా వరద నీరు రోడ్లను ముంచెత్తడంతో దుబాయ్‌లోని జాతీయ రహదారులు, రోడ్లపై వాహనాలు నీట మునిగాయి. రాత్రంతా ఎడతెరిపి లేకుండా వర్షం కారణంగా వీధులన్నీ చెరువులను తలపించాయి. దీంతో కొందరు వీధుల్లో సరదాగా పడవల్లో తిరిగారని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఎడారి ప్రాంతమైన దుబాయ్‌లో సగటు వార్షిక వర్షపాతం 100 మిల్లీమీటర్లకు కాస్త ఎక్కువ కాగా.. మంగళవారం సాయంత్రానికి దుబాయ్‌లో 120 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఏడాదిలో కురవాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతో దుబాయ్ నగరం అతలాకుతలమైంది.
Also Read:ఇజ్రాయెల్ కీలక ప్రకటన, రంగంలోకి భారతీయ విదేశాంగ శాఖ
వర్షాలు కొనసాగుతాయనే హెచ్చరికలు దుబాయ్ ప్రజల ఆందోళనను మరింత పెంచాయి. భారీ వర్షాల కారణంగా యూఏఈ వ్యాప్తంగా పాఠశాలలు మూతపడగా.. ప్రభుత్వ ఉద్యోగులు ఇంట్లో నుంచి పని చేశారు. కొద్ది మంది ఉద్యోగులు బయటకు వెళ్లినప్పటికీ.. వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో.. అధికారులు రంగంలోకి దిగి నీటిని బయటకు తోడారు. అరేబియా ద్వీపకల్పంలో భాగమైన యూఏఈలో వర్షం కురవడం అనేది అరుదైన విషయం. కానీ శీతాకాలంలో మాత్రం అడపాదడపా అక్కడ వర్షాలు కురుస్తుంటాయి. కానీ ఈసారి భారీ వర్షాలు ముంచెత్తడంతో డ్రైనేజీ వ్యవస్థలు సరిగా పని చేయక.. రోడ్లన్నీ నీటమునిగాయి.యూఏఈ పొరుగున ఉన్న ఒమన్‌లోనూ భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా ఇటీవల ఒమన్‌లో పది మంది స్కూల్ విద్యార్థులు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
This was a pretty intense sight watching the storm over Dubai today. pic.twitter.com/QdDSp9pKhU
— Gary Gensler (Parody) (@GaryGenslerMeme) April 17, 2024
📍Dubai Airport after today's rain pic.twitter.com/PkQl7ib2xa
— Mister J. – مسٹر جے (@Angryman_J) April 16, 2024