వాషింగ్టన్, స్వేచ్ఛ: అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి సోమవారం బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో అడుగుపెట్టిన తొలిరోజునే సంచలన నిర్ణయాలు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన హామీలకు అనుగుణంగా రికార్డ్ స్థాయిలో దాదాపు 80 ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను ఆయన జారీ చేశారు. సంచలనాత్మక రీతిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగేందుకు ఉద్దేశించిన ఆదేశాలపై ట్రంప్ సంతకం చేశారు. డబ్ల్యూహెచ్‌వోకు చైనా కంటే ఎక్కువ మొత్తంలో నిధులు చెల్లిస్తున్నామని, ఈ కారణంగా అమెరికాకు అన్యాయం జరుగుతోందంటూ ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాదు, పారిస్ ఒప్పందం నుంచి యూఎస్ నిష్క్రమిస్తుందని ప్రకటించారు. తన మొదటి దఫా పదవీకాలంలో తీసుకున్న నిర్ణయాన్నే పునరావృతం చేశారు. మరోవైపు, యూఎస్ ఫెడరల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్‌ను ట్రంప్ రద్దు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి ఆ సమయంలో ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్‌ను రద్దు చేస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అత్యంత కీలకమైన జన్మతః అమెరికా పౌరసత్వం విధానాన్ని కూడా ట్రంప్ రద్దు చేశారు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ, ఆ దేశంలో ఆశ్రయం విధానాలపై కూడా ఆయన నూతన ఆంక్షలు విధించారు. అమెరికా-మెక్సికో సరిహద్దులో సైన్యం మోహరింపు, దేశ దక్షిణ రాష్ట్రాల సరిహద్దుల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ట్రంప్ ప్రకటించారు. జన్మతః అమెరికా పౌరసత్వాన్ని కూడా రద్దు చేయడానికి ప్రయత్నిస్తానంటూ ప్రకటించారు. 2020 అమెరికా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ.. తనకు మద్దతుగా 2021న జనవరి 6న యూఎస్ కాపిటల్ భవనంపై జరిగిన దాడిలో పాల్గొన్న దాదాపు 1,500 మంది తన మద్దతుదారులకు ఆయన క్షమాభిక్ష పెట్టారు.
ఎల్‌జీబీటీక్యూ సమానత్వాన్ని ప్రోత్సహించే వివిధ కార్యనిర్వాహక ఉత్తర్వులను ట్రంప్ రద్దు చేశారు. అమెరికాలో ఇకపై కేవలం ఆడ, మగ అనే రెండు లింగాలు మాత్రమే ఉంటాయని తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ద్వారా స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఇంధన ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా డ్రిల్లింగ్ కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో ‘జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి’ని ప్రకటించే ఆర్డర్‌పై కూడా ఆయన సంతకం చేశారు.
టిక్‌టాక్‌పై నిషేధాన్ని 75 రోజులపాటు నిలుపుదల చేశారు. చైనాకు చెందిన యాప్ యాజమాన్యంతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని ఆలోచనలో ట్రంప్ సర్కార్ ఉంది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని ఇజ్రాయెల్ వాసులపై ఆంక్షలను ట్రంప్ ఉపసంహరించారు. మాజీ అధ్యక్షుడు జో బిడెన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన రద్దు చేశారు. అమెరికా రూపొందించిన టెర్రరిస్ట్ స్పాన్సర్డ్ దేశాల బ్లాక్ లిస్ట్ నుంచి క్యూబాను తొలగించారు.
ఇమ్మిగ్రేషన్ విధానాల్లో భారీ మార్పులు తీసుకొచ్చే కీలక నిర్ణయాలను ట్రంప్ ప్రకటించారు. ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను జారీ చేశారు. దాదాపు, 100 ఏళ్లుగా కొనసాగుతున్న ‘జన్మతః అమెరికా పౌరసత్వం’ విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విధానం రద్దు చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానంటూ అమెరికన్లకు తెలియజేస్తూ సోమవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు.
పిల్లల తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరికి అమెరికా పౌరసత్వం లేదా శాశ్వత నివాసం, గ్రీన్‌కార్డ్, యూఎస్ మిలిటరీ మెంబర్‌షిప్ తప్పనిసరిగా ఉండాలని, అలాంటి నివాసితుల పిల్లలకు మాత్రమే పుట్టుకతో దేశ పౌరసత్వం లభిస్తుందని ‘ప్రొటెక్టింగ్ ది మీనింగ్ అండ్ వ్యాల్యూ ఆఫ్ అమెరికన్ సిటిజెన్‌షిప్’ పేరిట జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో ట్రంప్ పేర్కొన్నారు. అక్రమంగా ప్రవేశించి నివాసం ఉంటున్నవారితో పాటు ఉన్నత విద్య కోసం వెళ్లిన స్టూడెంట్స్, పర్యాటకులు, తాత్కాలిక వర్క్ వీసాలపై పనిచేస్తున్న విదేశీయులకు జన్మించే పిల్లలకు ఇకపై అమెరికా పౌరసత్వం దక్కదని పేర్కొన్నారు.
భారతీయులపై ప్రభావం ఏ మేరకు?
డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాలో పెద్ద సంఖ్యలో నివసిస్తున్న భారతీయులు, అక్కడ నివసిస్తున్న భారతీయ కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. గ్రీన్‌కార్డ్ కోసం ఇప్పటికే లక్షలాది మంది ఎదురుచూస్తున్న వేళ ట్రంప్ ప్రకటించిన ఈ నిర్ణయం మరో ఎదురుదెబ్బ అని అభిప్రాయపడుతున్నారు. తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం కోసం ‘బర్త్ టూరిజం’ విధానాన్ని అనుసరిస్తున్న భారతీయ కుటుంబాలపై తాజా నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ‘బర్త్ టూరిజం’ కింద మెక్సికో, భారత్ దేశానికి చెందినవారు ప్రసవం కోసం అమెరికాకు వెళ్తుంటారు. అక్కడ జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్‌గా పౌరసత్వం లభిస్తుంది కాబట్టి ఈ విధానాన్ని ఎంచుకుంటున్నారు. కాగా, 2024 నాటికి అమెరికాలో దాదాపు 54 లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్నారు. అమెరికా జనాభాలో 1.47 శాతానికి సమానంగా ఉన్నారు. కాబట్టి, ట్రంప్ తీసుకున్న నిర్ణయం తీవ్ర ప్రభావం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
కోర్టు చిక్కులు తప్పవా?
యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించినవారికి ఆటోమేటిక్‌గా అమెరికా పౌరసత్వం లభిస్తుందని అమెరికా 14వ రాజ్యాంగ సవరణ చెబుతోంది. దాదాపు 100 ఏళ్లకుపైగా కొనసాగుతున్న ఈ విధానాన్ని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసిన డొనాల్డ్ ట్రంప్‌కు న్యాయస్థానాల్లో చిక్కులు ఎదురుకావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగ సవరణను మరోసారి మార్చాల్సి ఉంటుందని, ఇది సాధ్యమయ్యే పనేనా అని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని సోమవారం ఓ మీడియా ప్రతినిధి ట్రంప్‌ను ప్రశ్నించిగా, ఎదుర్కొనే ఆధారాలు తమవద్ద ఉన్నాయని ఆయన బదులిచ్చారు. ఈ విధానానికి ముగింపు పలకాలని అమెరికన్లు కొన్ని దశాబ్దాలుగా కోరుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 30 రోజుల్లో అమల్లోకి అమల్లోకి రావాల్సి ఉంటుంది. అయితే, కోర్టులు ఎలా స్పందిస్తాయో వేచిచూడాలని న్యాయనిపుణులు అంటున్నారు.