Plight Of Muslims : దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెభ్భై ఐదేళ్లయినా, అనేక పోరాటాల ఫలితంగా 2014లో తెలంగాణ కల సాకారమైన తర్వాత కూడా అభివృద్ధి ఫలాలు ఇంకా కొన్ని వర్గాలకు అందని ద్రాక్షలాగే మిగిలిపోయాయి. ఈ జాబితాలో ముస్లిం సమాజం ముందు వరసలో ఉంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో వచ్చిన జస్టిస్ సచార్ నివేదిక, ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నియమించిన సుధీర్ కమిషన్‌లు ముస్లింలు ఎంతటి దురవస్థలో జీవిస్తున్నారో వెల్లడించాయి. అసలు ముస్లింల సమస్యలను అర్థం చేసుకోవటంలోనే ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఎంతకాదన్నప్పటికీ రాజకీయ పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంకుగా భావించటం వల్లనే ముస్లిం సముదాయం పేదరికంలో కునారిల్లిపోతుందనేది కాదని లేని వాస్తవంగా నేడు మన కళ్లముందు కనబడుతోంది.
ఇక ఒకసారి గతంలోకి వెళితే, తెలంగాణ వచ్చాక ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు ముస్లింల వెనకబాటును అధ్యయనం చేసేందుకు 2016లో రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బి. సుధీర్ కుమార్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోని ముస్లిం సముదాయాల పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించి సమగ్రమైన నివేదికను అందించింది. అందులో తట్టలు, బుట్టలు అల్లుకునే ముస్లిం సముదాయంలోని వారిని ఎస్సీల జాబితాలో చేర్చాలని, సెట్విన్‌ను తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించాలని, టీఎస్ఐఐసీ ద్వారా 12శాతం పారిశ్రామిక ప్రాంతాలను ముస్లిం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించాలనీ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వం ఇచ్చే ఇళ్లలో 12శాతం, గ్రామాల్లో 7శాతం ఇళ్లను ముస్లింలకు కేటాయించాలనీ కమిషన్ తన సూచనల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న ముస్లిం ఉద్యోగులకు పదోన్నతి కల్పించి, ఆలిండియా సర్వీసు అధికారులుగా ప్రమోట్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లిం మహిళలకు 33 శాతం కోటా ఇవ్వాలని, పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్, వసతి వంటివి ఏర్పాటు చేయాలని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని కమిషన్ రికమండ్ చేసింది.
Read More: లోక్ సభ ఎన్నికలలో ఎవర్ని గెలిపిద్దాం..?
ఉపాధి కోసం ‘ఓన్ యువర్ ఆటో’ వంటి పథకాలను తీసుకురావటం, మైనారిటీ గురుకులాల సంఖ్యను పెంచటం, స్టేట్ సర్వీసుల నుంచి ముస్లింలకు పదోన్నతులు కల్పించి అఖిల భారత సర్వీసుల్లో వారి సంఖ్యను పెంచాలి. పోటీ పరీక్షలకు కోచింగ్ ఇవ్వాలని, . ప్రభుత్వ ఉద్యోగాల్లో 33శాతం ముస్లిం మహిళలకు అవకాశం ఇవ్వాలనీ కమిషన్ అభిప్రాయ పడింది. 30 ఏళ్ల లోపు ముస్లింలలో అసలు బడి ముఖం చూడని వారు 13శాతంగా ఉండగా, స్కూళ్లలో ముస్లిం విద్యార్థుల నమోదు శాతం కేవలం 11.5 శాతంగా ఉందని తేల్చింది. పదో తరగతి తర్వాత ఇంటర్, డిగ్రీ వరకు వెళ్లే కొద్దీ చదువును కొనసాగిస్తు్న్న ముస్లిం విద్యార్థుల శాతం కేవలం 10.85 శాతం మాత్రమేనని కమిషన్ లెక్క తేల్చింది. ఉర్దూ బోధనా భాషగా ఉన్న స్కూళ్లలో ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్టుగా పెట్టాలని కూడా కమిషన్ సూచించింది. నేటికీ ముస్లింలు భూమిలేని వారిలో ముస్లింలు ముందు వరుసలో ఉన్నారనీ, దీంతో వీరు పల్లెలను వదిలి పట్టణాలకు చేరి, రోడ్ల వెంట పండ్లు అమ్ముకోవటం, మెకానిక్ షాపుల్లో, బేకరీల్లో, టైలరింగ్ షాపుల్లో, హోటళ్లలో పనిచేయటం వంటి పనులతో, చాలీచాలని ఆదాయంతో బతుకు బండిని ఈడ్చుకొస్తున్నారని కమిషన్ వెల్లడించింది. ప్రతి 100 మంది ముస్లిం కార్మికుల్లో 32 శాతం ఈ కేటగిరీలోనే ఉన్నారని తెలిపింది. తెలంగాణలోని సగం ముస్లిం కుటుంబాల నెలవారీ ఆదాయం పదివేల రూపాయల లోపే ఉందని, బ్యాంకు లావాదేవీలున్న ముస్లింల జనాభా మిగిలిన సముదాయాల కంటే తక్కువని పేర్కొంది.
తెలంగాణ వచ్చాక తమ జీవితం మెరుగుపడుతుందని భావించిన ముస్లింలకు కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో తీయని మాటలే తప్ప ఒరిగిందేమీ లేకుండా పోయింది. ఆయన పాలనలో మైనారిటీ రుణాలకు దిక్కేలేకుండా పోయింది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులు సగం మురిగిపోయాయి. ఆ మిగిలినవి ఆయన అనుయాయులకే తప్ప నిజమైన ముస్లింల ఇంటికి రూపాయి చేరలేదు. షాదీ ముబారక్ పేరుతో ఆడపిల్లల సాయానికీ పదుల సార్లు తిరిగి, మద్యవర్తులకు లంచాలు ముట్టజెప్పాల్సి వచ్చింది. ‘ఉపాధి కల్పించండి బాబోయ్’ అని మొత్తుకుంటున్న ముస్లిం యువతను వక్ఫ్ నిధులతో ఇఫ్తార్ విందులిస్తూ తొమ్మిదేళ్ల కాలం గడిపేశారు. ఇక.. ఇమాం, మౌజన్‌లకు దక్కినదీ వక్ఫ్ బోర్డ్ ఫండే తప్ప మరొకటి కాదు. నాలుగు నెలల్లోనే 12% రిజర్వేషన్ ఇస్తానన్న ఆయన హామీ మొక్కుబడి తీర్మానానికే పరిమితమై పోయింది. ఉర్దూను రెండవ అధికార భాషగా అమలు చేస్తామన్న హామీ కాగితాలకే పరిమితమైంది. ఈ హామీ గురించి గతంలో ఒక ముస్లిం బహిరంగ సభలో కేసీఆర్‌కు గుర్తు చేయగా, నాటి సీఎం గారు ‘ఎవడ్రా.. నోర్మూసుకుని కూర్చో… నీ అయ్యకూ జవాబు చెప్పగలను జాగ్రత్త’ అంటూ మండిపడ్డారు.
Read More: ఏది.. ఆచరణ సాధ్యం..?
ఇలాంటి దుస్థితిలో ఉన్న ముస్లింలలో చాలామంది ఈ మోసాన్ని గమనించి గత శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు, నిరుద్యోగ ముస్లిం యువతకు స్వయం ఉపాధి పథకాల ద్వారా రుణాలు, రాయితీలు, ముస్లిం రిజర్వేషన్లు అమలు వంటి అంశాలతో కూడిన మైనారిటీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించి, నిరాశలో ఉన్న ముస్లిం యువతకు కొత్త జీవం పోసింది. తెలంగాణలోని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశం మీద దృష్టి సారించాలని, డిక్లరేషన్ అమలు కోసం ఆచరణాత్మకమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, ముస్లిం సమాజపు పురోగతికి అండగా నిలవాలని తెలంగాణలోని యావత్ ముస్లిం యువతీయువకులు ఆకాంక్షిస్తున్నారు.
– షేక్ అబ్దుల్ సమ్మద్ (పాత్రికేయుడు)