Dhoni Is A Player Who Wants To Play Another Season: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్, టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో సీజన్ ఆడాలని ఆ జట్టు మాజీ క్రికెటర్, తెలుగుతేజం అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌ను తాను ఒప్పుకోనని, అతను ఇలా వెనుదిరగడం తనకు అస్సలు నచ్చడం లేదని చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో సీఎస్‌కే 27 పరుగుల తేడాతో ఓటమిపాలై ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఈ మ్యాచ్‌లో సీఎస్‌కేను ప్లే ఆఫ్స్ చేర్చేందుకు ధోనీ ఆఖరి వరకు కష్టపడ్డాడు. యశ్ దయాల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది ఆశలు రేకెత్తించాడు. కానీ ఆ మరుసటి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.ఈ మ్యాచ్ అనంతరం ధోనీ.. ప్రత్యర్థి ఆటగాళ్లకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్‌లోకి పరుగెత్తాడు. ఓటమి బాధను తట్టుకోలేకనే ధోనీ అలా చేశాడనే అభిప్రాయం చాలామందిలో వ్యక్తమైంది.ఈ సీజన్‌లో చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా జరిగే ఫైనల్లో ఆడి ఘనంగా ఆటకు వీడ్కోలు పలకాలని ధోనీ భావించాడు. కానీ ఆర్‌సీబీ అతని ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. సీఎస్‌కే పరాజయంతో తీవ్ర భావోద్వేగానికి గురైన అంబటి, ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. చేతులు అడ్డు పెట్టుకొని ముఖం దాచుకున్నాడు.
Also Read:కాకా నువ్వు రీ ఎంట్రీ ఇవ్వు చాలు..!
అనంతరం స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన రాయుడు ధోనీ మరో సీజన్ ఆడాలని రెక్వెస్ట్ చేస్తూ పలు సూచనలు చేశాడు. ధోనీ మరో సీజన్ ఆడాలి. ఇది ఏ మాత్రం అతని చివరి మ్యాచ్ కాకూడదు. ఇలా అతను ఆటకు వీడ్కోలు పలకడం బాలేదు. వచ్చే సీజన్ ఆడి ఐపీఎల్ టైటిల్ గెలవాలి. ధోనీలాంటి ఆటగాడు, మనిషి.. తరానికి ఒక్కరు ఉంటారని రాయుడు తన మనసులోని మాటను ఇలా చెప్పుకొచ్చాడు. మరి రాయుడు మాటలు విని ధోనీ ఆడుతాడా లేక ఇంతటితో బ్రేక్ ఇచ్చి సైలెంట్‌గా వెళ్లిపోతాడా అనేది చూడాలి.