– అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా కేసీఆర్‌కు బుద్ధి రాలేదు
– బీజేపీతో కలిసిపోయి కుట్రలు చేస్తున్నారు
– రాష్ట్రంలో కరెంట్ లేదని డ్రామాలు ఆడుతున్నారు
– కేసీఆర్‌పై భట్టి ఫైర్
Bhatti Vikramarka: పదేళ్లు పాలించిన కేసీఆర్ అబద్ధాలకు అడ్డూ అదుపు ఉండడం లేదని అన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. కూసుమంచిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ళు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒక్క హామీని కూడా అమలు చేయని కేసీఆర్, నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రెండు వందల ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, ఐదు వందలకే గ్యాస్ పథకాలు అమలు చేశామన్నారు. రైతులపై కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉందని, తాము వచ్చిన మూడు నెలల్లోనే ఇన్సూరెన్స్ చేయించామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల మెస్ బిల్లులు కట్టకపోతే తాము వచ్చాక కట్టామని తెలిపారు భట్టి. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు ఇస్తున్నామని, పైగా, సిగ్గులేకుండా కరెంటు పోతోందని మాజీ ముఖ్యమంత్రి తన స్థాయిని మర్చిపోయి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను బండకేసి బాది ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి 5 వేల ఇళ్ళు ఇస్తామని చెప్పారు విక్రమార్క. ఇక, బీజేపీ గురించి మాట్లాడుతూ, దేశ సంపదను వారికి అనుకూలంగా ఉన్న వారికి మోదీ దోచిపెడుతున్నారని ఆరోపించారు. బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి రఘురాం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.