Saturday, May 18, 2024

Exclusive

Delhi CM : కేజ్రీ.. ఎటు నుంచి ఎటు వైపు..!

Delhi CM Kejriwal From Where To Where : చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది కేవలం చెప్పుకోవటానికేనని, కొందరు అవినీతిపరులకు చట్టం చుట్టంగా మారుతోందని ఆరోపిస్తూ 2011లో అన్నా హజారే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో వందలాది మంది మద్దతుదారులతో నిరాహార దీక్షకు దిగారు. అవినీతికి వ్యతిరేకంగా కఠినమైన చట్టం(జన లోక్‌పాల్) కావాలని, అందుకు తక్షణం మన్మోహన్ సింగ్ సర్కారు పూనుకోవాలని నాడు అన్నా చేసిన పోరాటానికి వేలాది మంది మద్దతుగా నిలిచారు. సరిగ్గా ఆ సమయంలోనే ‘నేనూ అన్నా’ అనే క్యాప్ ధరించి ఓ బక్క పలచని మనిషి హజారేకి గట్టి మద్దతుదారుగా నిలిచాడు. ‘అవినీతి పరులకు వ్యతిరేకంగా దేశం ఒక్కటి కావాలి’ అంటూ నినదించాడు. దీంతో అన్నా హజారే 13 రోజుల దీక్ష ముగిశాక దేశమంతా ఆ పేరు మోగిపోయింది. అతడే అరవింద్ కేజ్రీవాల్.

హర్యానాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన కేజ్రీవాల్, ఖరగ్‌పూర్‌ ఐఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. కొంత కాలం టాటా స్టీల్స్‌‌లో ఉద్యోగిగా పనిచేసి, 1993లో సివిల్స్‌లో నెగ్గి ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌లో చేరారు. అక్కడే పరిచయమైన తన తోటి ఐఆర్‌ఎస్‌ అధికారిణి సునీతను పెళ్లాడారు. స.హ చట్టం అండతో నకిలీ రేషన్‌ కార్డుల కుంభకోణాన్ని బయటపెట్టేందుకు 1999లో ‘పరివర్తన్‌’ ఉద్యమాన్ని చేపట్టి జనం కంట్లో పడ్డారు. ఐటీ, విద్యుత్తు, ఆహార కల్తీ, రేషన్‌ పదార్థాల వంటి పేద, మధ్యతరగతి అంశాల మీద పోరాటాలు చేసి ఢిల్లీ ప్రజల మనసుకు దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే సర్కారీ కొలువుకు రాజీనామా చేసి 2006లో ‘పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్’ స్థాపించి జనంలోనే ఉంటూ వచ్చారు. 2006లో ఆయన చేస్తున్న అవినీతి వ్యతిరేక పోరాటానికి గుర్తింపుగా ‘రామన్ మెగసెసే అవార్డు’ కూడా గెలుచుకున్నారు. 2010లో అన్నాహజారేతో కలిసి జన్‌లోక్‌పాల్‌ బిల్లుకై జరిగిన పోరాటంతో కేజ్రీవాల్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. దేశ ప్రజాస్వామ్యం, అవినీతి అంశాలపై తన ఆలోచనలు, అభిప్రాయాలను తెలియచేస్తూ ‘స్వరాజ్‌’ అనే పుస్తకాన్ని కూడా రాశారు కేజ్రీవాల్‌ అదే ఊపులో రాజకీయాల మీద దృష్టి సారించారు.

‘అవినీతి’ అనే బురదను అసహ్యించుకుంటే కుదరదని, మనమే బురదలో దిగి దానిని ప్రక్షాళన చేయాలనే వాదనను మందుకు తెస్తూ, స్వచ్ఛ రాజకీయాలకు చిరునామాగా నిలిచే రాజకీయ పార్టీని పెడతానని కేజ్రీవాల్ ప్రకటించారు. ఆచరణలో అది సాధ్యం కాదని, నైతిక విలువలు గల బలమైన పౌర సమాజం, అది కలిగించే నిరంతర ఒత్తిడితోనే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను కదిలించగలమనే గురువు అన్నా హజారే మాటను పక్కనబెట్టి 2012, నవంబరు 26న ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి, ‘చీపురు’ గుర్తును ఏరికోరి ఎంచుకున్నారు. ‘నేను భిన్నమైన వాడిని. నా చుట్టూ పోలీసులుండరు. ఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకోను. గెలిచినా నేను, నా మంత్రులు బుగ్గ కార్లు వాడం. లగ్జరీ లైఫ్‌స్టైల్‌కి దూరంగా ఉంటాం. ఒక కుటుంబం నుంచి ఇద్దరికి ఛాన్సే లేదు’ అంటూ ఆయన చెప్పిన మాటలకు యువత వెర్రిగా ఆరాధించారు. అలా.. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగి 70కి 28 సీట్లను గెలుచుకున్నారు. ఆ సమయంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో కాంగ్రెస్ మద్దతుతో సర్కారు ఏర్పాటు చేసి, తొలిసారి ఢిల్లీ సీఎం అయ్యారు. కానీ, జనలోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందకపోవటానికి కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ సర్కారును దోషిగా చూపుతూ 49 రోజులకే తన పదవికి రాజీనామా చేయటంతో రాష్ట్రపతి పాలన వచ్చింది. పదవి పోయినా.. నమ్మిన మాటకు కట్టుబడ్డారంటూ జనం ఆయన్ను హీరోలా చూశారు.

Reda Also : స్వేచ్ఛ ఎఫెక్ట్.. వేర్ హౌజింగ్ టెండర్ల స్కాంపై మంత్రి ఆరా

అదే సమయంలో వచ్చిన 16వ లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోడీపై పోటీచేసి ఓటమి పాలైనా, 2015 నాటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 గెల్చుకుని తానేంటో నిరూపించి రెండో సారి సీఎం పీఠమెక్కారు. 2020 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 70కి 62 సీట్లు గెలిచి ముచ్చటగా మూడోసారి సీఎం అయ్యారు. ఢిల్లీలో అధికారాన్ని స్థిరం చేసుకున్న తర్వాత తన పార్టీ ఉనికిని పలు రాష్ట్రాల్లో విస్తరించారు. పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిన ఆప్, గోవా, గుజరాత్‌ అసెంబ్లీల్లోనూ, రాజ్యసభలోనూ కాలుమోపింది. ఈ క్రమంలో ఏప్రిల్ 10, 2023న జాతీయ పార్టీ హోదాను కూడా పొందింది. దేశంలోనే రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలిగి ఉన్న మూడవ పార్టీగా నిలిచింది.

అయితే.. ఈ పుష్కర కాలపు ప్రయాణంలో సంప్రదాయ రాజకీయ పార్టీల వాసనల నుంచి ఆప్ బయటపడలేకపోయింది. ప్రజాస్వామ్యానికి పారదర్శకతే ప్రాణమని చెబుతూ, ఎలక్టోరల్ బాండ్లను వ్యతిరేకించిన కేజ్రీవాల్, అందరిలాగే వాటినీ అందుకున్నారు. ఆయన మంత్రివర్గ సహచరుడైన సత్యేంద్ర జైన్ అవినీతి కేసులో జైలు పాలై, కారాగారంలో రాజభోగాలను అనుభవించటం జైలు వీడియోలో చూసి దేశమంతా నివ్వెరబోయింది. గోవాలో ఎన్నికల నిధుల కోసం కేజ్రీవాల్ ప్రభుత్వంలో నంబరు 2గా ఉన్న మనీష్ సిసోడియా మద్యం పాలసీని మార్చి జైలు పాలవటం, ఈ కేసు అనేక మలుపులు తిరిగి, నిన్నటిదాకా తెలంగాణను ఏలిన బీఆర్‌ఎస్ కీలక నేత కవిత అరెస్టుకూ దారి తీయటం, ఏపీలోని ఒంగోలు వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడూ భాగస్వామిగా ఉండి, అప్రూవర్‌గా మారటం, ఈ క్రమంలోనే కేజ్రీవాల్ అరెస్టు కావటం దేశవ్యాప్తంగా సంచనలనానికి కారణమైంది. ఇక, 2024 పార్లమెంటు ఎన్నికల వేళ కవిత, కేజ్రీవాల్ వరుసగా అరెస్టు కావటంతో ఈ రెండు పార్టీలూ ఎన్నడూ లేనంతగా ఆత్మరక్షణలో పడిపోయాయి. ‘తాను చేసిన దానికే కేజ్రీవాల్ అరెస్టయ్యాడు తప్ప ఇందులో కేంద్ర రాజకీయ కక్షసాధింపు ఏముంది?’ అంటూ ఆయన అరెస్టు మీద అన్నా హజారే వ్యాఖ్యానించటం కేసులో బలముందనే పరోక్ష సందేశాన్ని జనంలోకి పంపేందుకు దోహదపడుతోంది.

కేజ్రీవాల్ ఒక భిన్నమైన రాజకీయ వేత్తగా కనిపిస్తారనేది ఎంత నిజమో, పలు సందర్భాల్లో ఆయన కూడా ఆ నేతల్లాగే వ్యవహరించారనేదీ అంతే నిజం. రాబర్ట్ వాద్రా, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ములాయం సింగ్, లాలూ యాదవ్, మమత, బాదల్ వంటి నాయకుల అవినీతి మీద ఆయన ఎన్నోసార్లు నిప్పులు చెరిగారు. వారి కేసుల్లో ఆధారాలు లేకున్నా, ఆ కేసులు కోర్టు విచారణలో ఉండగానే, ఆ నేతలను దోషులుగా చిత్రీకరించి, ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ లబ్దిని పొందేందుకు ఫక్తు రాజకీయవేత్తగానే కేజ్రీ వ్యవహరించారు. ఉచితాలు ప్రకటించి అధికారమే లక్ష్యంగా పార్టీలు నడిపారు. గత పన్నెండేళ్లుగా ఒక రకంగా ఆయన అద్దాల మేడలో ఉండి అందరి మీదా రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు. తానే అవినీతి పరుడినైతే, ఇక ఈ భూమ్మీద నిజాయితీపరులే ఉండబోరనీ గొప్పగా చెప్పుకొచ్చారు. కానీ, తన పార్టీకి చెందిన మనీస్ సిసోడియా, సత్యేంద్ర జైన్ అరెస్టు, చివరగా తన అరెస్టు వరకు వచ్చేసరికి మాత్రం గతాన్నంతా మరచి, అందరిలాగా ‘ఆధారాలేవీ’ అంటూ మాట్లాడటాన్ని బట్టి ఆయన కూడా మిగిలిన నేతల వంటివారే అనే అభిప్రాయం కలగకమానదు.

Reda Also : గ్యారెంటీలతో కాంగ్రెస్ గెలుపు ధీమా..!

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, అవినీతి అనేవి కవల పిల్లలుగా చెప్పుకొనే రోజులివి. మనకంటే చిన్న దేశాల్లోనూ లంచగొండి నేతలు జైలు పాలైన సందర్భాలూ ఉన్నాయి. 1997 నుంచి ఐదేళ్ల పాటు నికరాగువా అధ్యక్షుడిగా ఉన్న ఆర్నాల్డోపై వచ్చిన అవినీతి కేసు రుజువై రెండు దశాబ్దాలు జైలు పాలయ్యాడు. యుగోస్లావియా అధ్యక్షుడిగా పనిచేసి జనం సొమ్ము దిగమింగిన మిలోసెవిక్, 1990 నుంచి పెరూ దేశాన్ని ఏలిన ఫ్యుజిమోరి, ఇలా ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేకపోయారు. కేవలం 78 ఏళ్ల స్వాతంత్ర చరిత్ర గల మన దేశం పరిణితి చెందిన ప్రజాస్వామ్య దేశంగా స్థిరపడలేదనే మాట నిజమే అయినా, ఆ పరిణతిని సాధించే క్రమంలో తన వ్యవస్థలను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ క్రమంలో నేడు మనం చూస్తున్న కేజ్రీవాల్ అరెస్టు వంటి అనేక ఊహించని పరిణామాలను ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశపు ప్రజలుగా ఆహ్వానించాలా లేదా అనేది మనమే నిర్ణయించుకోవాలి.

  • సదాశివరావు ఇక్కుర్తి, సీనియర్ జర్నలిస్ట్‌ 

Publisher : Swetcha Daily

Latest

Hyderabad:ఆ.. త (అ)ప్పు చేయొద్దు

రుణాల రీస్ట్రక్చరింగ్ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు మార్కెట్లో తక్కువ...

Hyderabad: జూన్ లో పదవుల జాతర

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ మంత్రి వర్గ...

Hyderabad: కేబినెట్ భేటీకి కోడ్ ఆటంకం!

no permission election commission conducting Telangana cabinet meeting: తెలంగాణలో నేడు...

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

Don't miss

Hyderabad:ఆ.. త (అ)ప్పు చేయొద్దు

రుణాల రీస్ట్రక్చరింగ్ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు మార్కెట్లో తక్కువ...

Hyderabad: జూన్ లో పదవుల జాతర

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ మంత్రి వర్గ...

Hyderabad: కేబినెట్ భేటీకి కోడ్ ఆటంకం!

no permission election commission conducting Telangana cabinet meeting: తెలంగాణలో నేడు...

Medak: బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్‌క్వాలిఫై చేయాలి: సీఈవోకు రఘునందన్ రావు ఫిర్యాదు

Raghunandan Rao: మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్...

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TTDevasthanam: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల...

పౌర సమాజ చైతన్యమే తెలంగాణకు రక్ష..

మరో పక్షం రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి కావస్తోంది. అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఈ పదేళ్ల కాలంలో చెప్పుకోదగ్గ విజయాలను సాధించిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం....

Israel: ఈ భీకర యుద్ధం ఆగేదెప్పుడో…?

Israel Hamas War Palestine Conflict Gaza Air Strikes Bombings Land Operations: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య మొదలైన యుద్ధం బుధవారం నాటికి 222 రోజులకు చేరింది. ఈ ఏడున్నర...

Democracy : మీడియాతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం..!

Democracy Can Be Preserved Only Through Media: నేటి పత్రికలన్నీ పెట్టుబడిదారుల విష పుత్రికలే నంటూ అపుడెప్పుడో దశాబ్దాల క్రితమే మహాకవి శ్రీశ్రీ అన్నారు. నేటి సమాజంలో మెజారిటీ పత్రికలకు అక్షరాలా...