- బీఆర్ఎస్ ను వీడేందుకు మరో 20 మంది సిద్ధం
- పార్లమెంట్ ఫలితాల ఓటమి తర్వాత పార్టీలో జరగని సమీక్ష
- అజ్ణాతంలోకి వెళ్లిపోయిన కేసీఆర్, కేటీఆర్
- పార్టీని వీడబోం అన్న నేతలే కండువాలు మారుస్తున్న వైనం
- తాజాగా ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం
- పార్టీని వీడే ప్రసక్తే లేదని అంటున్న ఎర్రబెల్లి
- గతంలో కేకే, కడియం కూడా ఇదే తరహా స్టేట్ మెంట్లు
- తర్వాత బీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చిన నేతలు
- లోకల్ బాడీ ఎన్నికలలోనూ బీఆర్ఎస్ కు తప్పని ఎదురుదెబ్బలు
Day by day BRS failures party cadre complete in depression ready to resign:
వరుస ఓటమిలతో పూర్తిగా డీలాపడిన బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు పాట మాదిరిగా తయారయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో పూర్తిగా ఎదురుదెబ్బలు తిన్న కారు పార్టీకి కింది స్థాయి క్యాడర్ కూడా జారిపోతున్నట్లు సంకేతాలొస్తున్నాయి. భవిష్యత్ లేని పార్టీ లో ఉండేకన్నా అధికారంలో ఉండే ప్రభుత్వాలతో ఉంటే సొంత పనులన్నా పూర్తవుతాయనే భావనలో క్యాడర్ ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయి ఇన్ ఛార్జిలతో సహా అతని వెంట ఉండే క్యాడర్ తో కలిసి ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపో లేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపునకో వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు ఎన్నికలలోనూ ఘోరంగా విఫలమైన బీఆర్ఎస్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలోనూ చేతులెత్తేసే సూచనలు కనిపిస్తున్నాయి. అసలు కనీసం పోటీ చేసే అభ్యర్థులు కూడా ఉండరని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు.
ఓటమి నుంచి పాఠాలు నేర్వని బీఆర్ఎస్
కనీసం ఓటమి నుండి పాఠాలు నేర్చుకోని బీఆర్ఎస్ అగ్ర నేతలను బాహాటంగానే విమర్శిస్తున్నారు. కనీసం ఓటమి సమీక్ష సైతం చేసుకోలేని దైన్యస్థితిలో ఉండటం చూసి కార్యకర్తలు, జిల్లాల ఇన్ ఛార్జి నేతలు, పార్టీ క్యాడర్ పీకల్లోతు ఆగ్రహంతో ఉన్నారు. రాబోయే ఆరు నెలల కాలం ఇక స్థానిక ఎన్నికల సమరం జరగనుంది. పంచాయతీరాజ్, మున్సిపల్, గ్రేటర్ ఎన్నికలతో ఈ సంవత్సరమంతా బిజీగా మారిపోతున్నారు కాంగ్రెస్, బీజేపీలు. ఇప్పటినుంచే ఇందుకు సంబంధించిన వ్యూహరచనల్లో మునిగితేలుతున్నారు. ఇవేమీ పట్టనట్లు బీఆర్ఎస్ నేతలు కనీసం సెకండ్ గ్రేడ్ లీడర్లు, క్యాడర్ తో ఫోన్ల లో సైతం కాంటాక్ట్ చేయడం లేదని ..అసలు పార్టీ ఉంటుందా లేక ఏదైనా జాతీయ పార్టీలో కలిసిపోతుందా అని అనుమానిస్తున్నారంతా.
అగ్రనేతలతో ఒకలా..బయటకొచ్చి వేరేలా
కొందరు నేతలు మాత్రం తాము పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదంటూనే మర్నాడు కండువాలు మార్చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ లు కలినినప్పుడు ఒకలా..బయటకొచ్చి మరోలా ప్రవర్తిస్తున్నారు. మా పార్టీ బీఆరెస్ నేత కేసీఆర్ వెంటే ఉంటా… పార్టీ మారే ప్రసక్తేలేదు… ఆరునూరైనా బీఆరెస్ లోనే కొనసాగుతాను… నేను పార్టీ మారుతున్నానని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.. వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను…. కావాలని కొందరు చేస్తున్న దుష్ప్రచారం అంటూ ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీఆరెస్ నేత, కేసీఆర్ కు సన్నిహితునిగా చెప్పుకునే ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాంటి ప్రకటనే చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి పార్టీ మారుతున్నారనే ప్రచారం తిరిగి ప్రారంభం కావడంతో ఆయన పై విధంగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే ఎర్రబెల్లి పార్టీ మారుతున్నారనే ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ మారడంలేదని చెప్పారు. కేసీఆర్ ను ఎందుకు ఓడించామా అని ప్రజలు బాదపడుతున్నారు.. ప్రస్తుత పాలకుల అసమర్ధపాలనపై ఆగ్రహంగా ఉన్నారంటూ రేవంత్ పై విరుచుకపడ్డారు. ప్రజల పక్షాన నిలిచి బలమైన ప్రతిపక్షపాత్ర పోషిస్తాం.. తెలంగాణ ప్రజలకు మేలుజరిగేలా ఉద్యమిస్తామంటూ చెబుతూ వచ్చారు. తాజాగా మరోసారి ఇంత ఘాటుగా స్పందించకపోయినప్పటికీ పార్టీ మారేదిలేదని మాత్రం చెబుతూ వచ్చారు. అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాగానీ పార్టీ మారనంటూ చెప్పారు. కేకే, కడియం లాంటి సీనియర్లు కూడా ఒకప్పుడు ఇలానే చెబుతూ కేసీఆర్ కు అదును చూసి దెబ్బకొట్టారు.
20 మంది కీలక నేతలు రెడీ
పార్లమెంటు ఎన్నికల ఓటమి నేపథ్యంలో బీఆరెస్ నేతల స్వరంలో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది.పార్లమెంటు ఎన్నికలకు ముందు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సైతం తాను పార్టీ మారే ప్రసక్తేలేదంటూ ప్రకటించారు. ఇలాంటి స్టేట్ మెంట్లు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకు వచ్చాయి. తాజాగా పార్లమెంటు ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకు ఈ వివరణలు, స్టేట్ మెంట్లు ఇచ్చుకునే పరిస్థితి బీఆరెస్ పార్టీలో తిరిగి ప్రారంభమైంది. ఈ జాబితాలో మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలున్నారు. ఎవరు ఉంటారో? ఎవరు వీడుతారో? అనే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఓ 20 మంది కీలక నేతలు కండువాలు మార్చుకునే తరుణం కోసం ఎదురుచూస్తున్నారని రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది.