– బాసర టెంపుల్ అధికారుల చేతివాటం
– మార్కెట్ రేటు కంటే ఎక్కువకు కొనుగోళ్లు
– దేవాదాయ శాఖలో తిష్టవేసిన బడా వ్యాపారి
– అన్ని ప్రధాన ఆలయాలకూ ఆయనే సరుకు సప్లై
– వ్యాపారి కనుసన్నల్లోనే అధికారులు
Daily Food donate Gol Mall In Nirmal Basara Temple: బాసరలో జ్ఞానసరస్వతి ఆలయంలో అక్రమాల అవినీతి కంపుకొడుతోంది. అయితే.. దేవాదాయ శాఖ అధికారుల అండతో ఏళ్ల తరబడి సాగుతున్న ఈ అవినీతి వ్యవహారం ఎట్టకేలకు బయటికొస్తోంది. దేవస్థానంలో జరిగే నిత్యాన్నదానం మొదలు అమ్మవారికి నివేదించే ప్రసాదాల తయారీకి అవసరమైన సరకులన్నీ దశాబ్దాలుగా ఒకే బడా వ్యాపారి కొనుగోలు చేయటం, తెలంగాణలోని అన్ని ప్రధాన దేవాలయాలకు ఆయనే సరకు సరఫరాదారు కావటం గమనార్హం. రిటైల్ రేటుకంటే అధికంగా ధరలతో అతడిచ్చే నాశిరకం సరుకులతోనే అమ్మవారికి నివేదనలు చేయటంపై గతంలో అనేక పర్యాయాలు భక్తులు మండిపడినా ఈ వ్యాపారి మీద ఏ చర్యలూ లేకపోవటం గమనార్హం.
సాధారణంగా వాడే సన్ ఫ్లవర్ వంటనూనె బహిరంగ మార్కెట్‌లో రూ.120 నుంచి లభిస్తుండగా, బాసర దేవాలయ అధికారులు మాత్రం రూ.223కు కొంటున్నారు. కిలో నాణ్యమైన పల్లీలు మహా అయితే రూ.130కు వస్తుండగా, బాసరలో వీటి ధర రూ.173. ఇలా నిత్య అన్నదానం, ప్రసాదాల తయారీ సహా గుడిలో వాడే ప్రతి నిత్యావసర వస్తువుకూ మార్కెట్ ధర కంటే ఎన్నో రెట్లు అధిక ధరకు బాసర ఆలయ అధికారులు కొనుగోలు చేస్తున్నారు. ఏటా అమ్మవారి దేవస్థానంలో సరకుల కొనుగోలుకు వచ్చే కాంట్రాక్టును ఇతడికున్న అనేక సంస్థల పేర్లతో టెండర్లు వేయించి, అంతిమంగా అది తనకే వచ్చేలా చేసుకుంటూ రావటమే దీనికి కారణం. కిరాణా సామగ్రితో పాటు చీపుర్లు, ప్లాస్టిక్ డబ్బాలు వంటి వస్తువుల వరకు ఇతడే అందించటంతో బాసరలోని చిన్న వ్యాపారులకు సరకులు అందించే అవకాశమే లేకుండా పోతోంది. అత్యంత నాశిరకం సరకు సరఫరా చేస్తున్నా నేటివరకు దేవాదాయ శాఖ విజిలెన్స్ వారు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవటం విశేషం.
Read Also: ట్యాపింగ్ కేసులో కొత్త కోణాలు..!
హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి మూడు సంస్థల పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల టెండర్లలో పాల్గొంటూ.. కాంట్రాక్టు దక్కంచుకోవటమే గాక ఏ సరకు ఎంతకు కొనాలో కూడా ఆయనే నిర్ణయించటం గమనార్హం. ప్రస్తుతం వస్తువులను సరఫరా చేస్తున్న టెండరు అగ్రిమెంటు 2023 ఏప్రిల్ 1న కుదిరింది. ఈ ఏడాది కాలంలో ఆయా వస్తువుల ధరల్లో వచ్చిన మార్పుల కంటే ఎక్కువకు వాటిని కొనుగోలు చేయటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆలయ అధికారులను ప్రశ్నించగా, నిబంధనల ప్రకారమే టెండరు నిర్వహించి సరుకులను కొంటున్నట్లు తెలిపారు. టెండర్‌లో కోట్ చేసిన ధరలకే తీసుకుంటున్నామనీ, ఎవరు తక్కువ ధరకు టెండర్ వేస్తే వారికే సరుకు అందించే అవకాశం వస్తుందని తెలిపారు.