– మేడిగడ్డకు కేంద్ర నిపుణుల బృందం
– కుంగిపోయిన పిల్లర్ల పరిశీలన
– ఇవాళ ఇరిగేషన్ శాఖ అధికారులతో భేటీ
– కాళేశ్వరంపై వివరాల సేకరణ
– ఇప్పటికే మొదలైన తాత్కాలిక మరమ్మతు పనులు
– గేట్లు ఎత్తే పనులు చేయిస్తున్న అధికారులు
CWPRS Team: కేసీఆర్ హయాంలో ఎంతో ఆర్భాటంగా నిర్మాణం జరుపుకుంది కాళేశ్వరం. కానీ, ప్రారంభమైన కొన్నేళ్లకే ఎన్నో లోపాలు బయటపడ్డాయి. అయితే, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో ప్రాజెక్టే ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాళేశ్వరంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ కొనసాగుతోంది. ప్రాజెక్ట్ మరమ్మతుల అంశంపై అన్ని వివరాలు సేకరిస్తోంది. ఇదే సమయంలో సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం బుధవారం మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించింది.
మహారాష్ట్రలోని పూణె నుంచి మేడిగడ్డకు చేరుకున్న ఈ టెక్నికల్ నిపుణుల బృందం బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కుంగిన వంతెనపై కాలి నడకన వెళ్తూ క్షుణ్ణంగా పరిశీలించింది. ఎడవ బ్లాక్‌లో దెబ్బతిన్న 15 నుంచి 21వ పియర్లను పరిశీలించి చూసింది. ఈ పియర్ల కుంగుబాటుకు గల కారణాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంది. గేట్ల వద్ద ఇసుక మేటలనూ పరిశీలన చేసింది. బ్యారేజీలో అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్‌లలో తిరుగుతూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు జేఎస్ ఎడ్లబడ్కర్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ సైంటిస్ట్ డాక్టర్ ధనుంజయ నాయుడు, ఎన్‌డీటీ స్టడీస్ సైంటిస్ట్ డాక్టర్ ప్రకాశ్ పాలే ఈ నిపుణుల బృందంలో ఉన్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని జలసౌధలో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రెటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇరిగేషన్ సెక్రెటరీ, ఈఎన్‌సీలతో నిపుణుల బృందం సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై చర్చించనుంది.
మరోవైపు, మేడిగడ్డలో తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి. ఏడో బ్లాక్‌లో 11 గేట్లు ఉండగా, 8 మూసివేసి ఉన్నాయి. వాటిలో ఒకటి ఎత్తగా, మిగిలినవి ఎత్తడానికి పనులు చేస్తున్నారు. గేట్ల మధ్యలో ఇరుక్కుని ఉన్న చెత్తా చెదారం, మట్టిని తీయిస్తున్నారు అధికారులు. వర్షాకాలంలో వరదను తట్టుకునేలా ఏడో బ్లాక్ ప్రాంతంలో షీట్ ఫైల్స్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.