– ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలి
– రైతులెవరూ తక్కువ ధరలకు బయట అమ్ముకోవద్దు
– 6,919 కేంద్రాల్లో ధాన్యం సేకరణ
– అంతా సక్రమంగానే ఉందన్న డీఎస్ చౌహాన్
– బయట నుంచి వచ్చే ధాన్యంపై 56 చెక్ పోస్టులతో నిఘా
హైదరాబాద్, స్వేచ్ఛ: ధాన్యం కొనుగోళ్లపై రకరకాల ప్రచారాల నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ మీడియా ముందుకొచ్చారు. ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తిట్టిపోస్తున్న నేపథ్యంలో చౌహాన్ వ్యాఖ్యలు వారి నోటికి తాళం వేసినట్టయింది. రాష్ట్రంలో సజావుగా ధాన్యం సేకరణ జరుగుతోందని అన్నారు చౌహాన్. రాష్ట్రంవ్యాప్తంగా 7,149 కొనుకోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, వాటిలో 6,919 కేంద్రాల నుంచి ధాన్యం సేకరిస్తున్నట్టు వివరించారు. పల్లెల్లో దళారులకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు అమ్ముకోవాలని సూచించారు. 17 శాతం తేమ ఉన్న వడ్లను కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ యార్డులకు తీసుకెళ్లాలని తెలిపారు. ‘‘మామూలుగా ఏప్రిల్ 1 నుండి సేకరణ ప్రారంభించాలి. ముందుగానే రైతులు మార్కెట్‌కు తీసుకొని రావటం వల్ల మార్చి 25 నుండి ధాన్యం సేకరణ మొదలు పెట్టాం. కొన్ని జిల్లాల్లో తొందరగా కొన్ని చోట్ల లేట్‌గా ఉంటుంది. మొత్తం ధ్యానం ప్రభుత్వం కొంటుంది. ఇప్పటిదాకా 27 వేల మంది రైతుల వద్ద నుంచి 1.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. కొన్ని చోట్ల ప్రభుత్వ ఎంఎస్పీ కంటే ఎక్కువ రేటు వస్తోంది. పంట కోత సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలి. ధాన్యం తేమ లేకుండా ఉండేలా చూడాలి’’ అని సూచించారు చౌహాన్. బయట రాష్ట్రాల నుండి వచ్చే ధాన్యానికి అనుమతి లేదన్న ఆయన, దీనికి అడ్డుకట్ట వేసేందుకు 56 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. జూన్ 30 వరకు సేకరణ జరుగుతుంది కాబట్టి ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. బ్యాంకుల ద్వారా రైతులకు డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. దళారీ వ్యవస్థ, అక్రమాలను కట్టడి చేయడానికి కలెక్టర్లు ఏ సమయంలో అయినా కొనుగోలు కేంద్రాలను తనిఖీ నిర్వహిస్తారని స్పష్టం చేశారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్.