– నిర్ధారించిన సీఎం రేవంత్ రెడ్డి
– శనివారం సీఎం నివాసంలో ఇరుపార్టీల చర్చలు
– అధిష్ఠానం అమోదం రాగానే అధికారిక ప్రకటన
– బీజేపీని ఓడించటానికేనన్న సీపీఐ(ఎం)నేత తమ్మినేని
హైదరాబాద్, స్వేచ్ఛ: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్లు ముగియటంతో పార్టీలన్నీ ఆయా స్థానాల్లోని ఇతర పోటీదారుల మీద దృష్టిసారించాయి. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీపీఐ(ఎం) రాష్ట్ర నేతలతో శనివారం తన నివాసంలో చర్చించారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గెలుపుకు సహకరించాలని ఈ సందర్భంగా సీఎం వారిని కోరినట్లు సమచారం. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్యలతో కూడిన ఈ బృందం ఎన్నికల వ్యూహాలపై గంటకు పైగా చర్చించింది. భువనగిరి లోక్ సభతో పాటు ఇతర స్థానాల్లో మద్దతుతో బాటు మరికొన్ని రాజకీయ ప్రతిపాదనలు సిపిఎం ముందుంచినట్లు సీఎం వెల్లడించారు. రాబోయే రోజుల్లో రెండు పార్టీలూ కలసి పనిచేయనున్నట్లు నేతలు భేటీ తర్వాత వెల్లడించారు.
దేశంలోనూ ఇండియా కూటమితో సీపీఐ(ఎం) పనిచేస్తోందని, ఒకట్రెండు విషయాల్లో సిపిఎంతో సందిగ్ధత ఉన్న కారణంగా ఆయా విషయాలను కాంగ్రెస్ అధిష్ఠానంతో మాట్లాడి రేపటిలోగా ఏకాభిప్రాయానికి వస్తామని సీఎం తెలిపారు. తమ మధ్య కుదిరిన అవగాహన కాంగ్రెస్ గెలుపుకు మరింత దోహదపడనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. అటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ.. తమ అభ్యర్థులను బరిలో నుంచి విరమించుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి కోరారని, బిజెపి, ఇతర శక్తులను అడ్డుకునేందుకు ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని తమ్మినేని తెలిపారు. దాదాపు గంటకుపైగా సాగిన ఈ భేటీలో , కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
Also Read: మోదీ మళ్లీ వస్తే.. అంతే..!
తొలుత తెలంగాణలోని అన్ని స్థానాల్లో ఒంటరిగా బరిలో నిలవాలని సీపీఐ(ఎం) భావించింది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి పట్టున్న భువనగిరి నుంచి ఎండి జహంగీర్ నామినేషన్ కూడా దాఖలు చేశారు. కానీ, తాజాగా సీపీఐ(ఎం) మనసుమార్చుకోవటంతో పలువురు కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేశారు. లౌకిక వాద పార్టీలన్నీ ఒక్కటై పోరాడితేనే నిరంకుశ విధానాలను అవలంబిస్తున్న బీజేపీని గద్దె దింపటం సాధ్యమని వారు అభిప్రాయపడ్డారు.