BRS: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఒంటిగా పోటీ చేయడం పరోక్షంగా బీజేపీకి కలిసి వచ్చిందని అన్నారు. గులాబీ పార్టీ ఇతర చిన్న పార్టీలను కలుపుకుని బరిలోకి దిగితే గట్టి పోటీ ఇచ్చేదని అన్నారు. ఇలా చేయకపోవడం వల్ల బీజేపీకి పరోక్షంగా బీఆర్ఎస్ సానుకూల అవకాశం ఇచ్చినట్టయిందని విశ్లేషించారు. హైదరాబాద్‌లో ఎంఐఎం కోసం బీజేపీ నాయకులు కూడా పని చేశారని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ స్థానంలో పని చేయలేదని వివరించారు.
కేంద్రంలోని మోదీ పాలనపై విమర్శలు సంధిస్తూ.. కాంగ్రెస్ పార్టీ బలపడితే.. అధికారంలోకి వస్తే దేవాలయాలపై దాడులు చేస్తుందని, బుల్డోజర్లను తెస్తుందని మోదీ అంటున్నారని, అవి అవాస్తవాలని కొట్టిపారేశారు. కానీ, మోదీ మాత్రం రాజ్యాంగంపై బుల్డోజర్లతో దాడి చేస్తారని అన్నారు. మోదీ ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా ఎన్నికల సంఘం ప్రేక్షకపాత్ర వహిస్తున్నదని, మోదీ వ్యాఖ్యలపై ఈసీ మెతకవైఖరి పనికి రాదని ఆగ్రహించారు. దేశమంతా ఎన్నికల ప్రచారం చేసి చివరిలో తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకునేలా ఎన్నికల తేదీలు ఖరారయ్యాయని గుర్తు చేశారు.
ప్రధాని మోదీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చూసి భయపడుతున్నారని, ఒక శిఖండి విధంగా మహిళను ఉపయోగించి కేజ్రీవాల్‌ను బ్లేమ్ చేయాలని చూస్తున్నారని నారాయణ మండిపడ్డారు. తనను వ్యతిరేకించేవారిపై కక్షపూరితంగా, అప్రజాస్వామికంగా మోదీ వ్యవహిరస్తున్నారని అన్నారు. నడమంత్రపు స్వర్గాన్ని సృష్టించి తనకు 400 సీట్లు వస్తాయని అంటున్నారని, దక్షిణ భారతంలో పార్టీ ఎక్కడుందని, ఎక్కడి నుంచి ఈ సీట్లు వస్తాయని ప్రశ్నించారు. దేశంలో మోదీ వేవ్ కాదు, మోదీని గద్దె దించాలనే వేవ్ బలంగా ఉన్నదని వివరించారు.
ఏపీ ఎన్నికలపై మాట్లాడుతూ.. ఈసీ కేవలం పైస్థాయి అధికారులను మార్చిందని, కానిస్టేబుల్, తదితర కింది ర్యాంకు సిబ్బందిది వైసీపీ సామ్రాజ్యమే అని నారాయణ ఆరోపణలు చేశారు. ఫుటేజీ బయటపడితేగానీ మాచర్ల ఘటన వెలుగులోకి రాలేదని, బాధ్యతాయుతమైన సీఎం, ప్రతిపక్ష నాయకుడు ఎన్నికలవ్వగానే విదేశాలకు పారిపోయారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న హింసను అడ్డుకోవడంలో వారి బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ఫలితాలు ఎలా ఉన్నా సీఎంను నిర్ణయించేది మోదీనే అని ప్రస్తావించి అసలు మోదీకే టికానా లేదు కాబట్టి ఏపీలో ఏం జరుగుతుందో చూడాలని అన్నారు.