Congress: సీపీఐ నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సీపీఐ అంగీకరించింది. బీజేపీని నిలువరించే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూమ్ భవన్‌లో ఈ సమావేశం జరిగింది. అనంతరం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశ భవిష్యత్, అభివృద్ధి, రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఇండియా కూటమి ఏర్పడిందని, ఈ కూటమి ఒక వైపు ఉంటే భారత రాజ్యాంగాన్ని విధ్వంసం చేయడమే లక్ష్యంగా, దేశ వనరులను ఆశ్రిత పెట్టుబడిదారులకు ధారాదత్తం చేస్తున్న బీజేపీ మరోవైపు ఉన్నదని భట్టి విక్రమార్క అన్నారు. ఈ విషయాన్ని తెలంగాణ, దేశ ప్రజలు ఆలోచన చేయాలని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని సీపీఐ నాయకులు చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారని పేర్కొన్నారు.
పార్లమెంటు ఎణ్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు కావాలని కోరారని కూనంనేని చెప్పారు. తాము ఒక స్థానంలో పోటీ చేయాలని అనుకున్నామని, కానీ, బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా ఇండియా కూటమి బలపరిచే విధంగా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని నిర్ణయానికి వచ్చామని వివరించారు. భువనగిరిలో తాము సీపీఎంకు మద్దతు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ పార్టీకే తమ మద్దతు ఉంటుందని తెలిపారు.