– కాంగ్రెస్‌లోకి వలసల జోరు
– ఖాళీ అవుతున్న గులాబీ పార్టీ
– త్వరలో కుత్బుల్లాపూర్ నేతల చేరిక
– అక్రమార్కులకు చోటివ్వొద్దంటున్న కాంగ్రెస్ క్యాడర్
– గత పదేళ్లలో పడిన కేసులు, కష్టాలపై అధిష్టానానికి వివరణ
– ఇన్నాళ్లూ వేధించిన వారినే చేర్చుకుంటే నష్టపోతామని సూచన
– నియోజకవర్గంలో నిరసనల జోరు
– క్లీన్ ఇమేజ్ ఉన్నవారికే పార్టీలో ప్రయారిటీ అంటూ తీర్మానం
తెలంగాణలో ప్రస్తుతం వలసల కాలం నడుస్తోంది. ఓవైపు ఎండలు ఎంత హీట్ పుట్టిస్తున్నాయో, రాజకీయంగా జంపింగ్ జపాంగ్‌లు సైతం పార్టీల్లో సెగలు రేపుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేదు. లీడర్లు అందరూ హస్తం గూటికి చేరుతున్నారు. అయితే, కొన్నిచోట్ల చేరికలపై అసంతృప్తులు కొనసాగుతున్నాయి. అధికారం ఉన్నన్నాళ్లూ హింసించి, కేసులు పెట్టి వేధించిన బీఆర్ఎస్ లీడర్లను చేర్చుకుని ప్రయారిటీ ఇవ్వొద్దని నిరసనలకు దిగుతోంది క్యాడర్.
నిజాంపేట్‌లో రచ్చ మొదలు
నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్ నీల భర్త గోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈయనతోపాటు ఓ ఎమ్మెల్సీ కూడా జాయిన్ అవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీరి చేరికను స్థానిక కాంగ్రెస్ క్యాడర్ వ్యతిరేకిస్తోంది. గోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని దిష్టిబొమ్మ దహనం చేశారు కార్యకర్తలు. నిజాంపేట్ హనుమాన్ ఆలయం కూడలిలో ధర్నా చేసిన క్యాడర్, మేయర్ దిష్టి బొమ్మ దహనం చేశారు.
అధికారంలో ఉన్నన్నాళ్లూ వేధింపులు
తెలంగాణను పదేళ్లు పాలించింది బీఆర్ఎస్. ఆ సమయంలో గులాబీ నేతల ఆగడాలు అన్నీ ఇన్నీ కావనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను వేధించారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో వాళ్లు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని, ఇది ఆందోళన చెందాల్సిన విషయమని హస్తం క్యాడర్ అంటోంది. నిజాంపేట్ పరిధిలో తమను వేధింపులకు గురి చేసిన నేతల్ని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి చేర్చుకోవద్దని తీర్మానం కూడా చేశారు.
ఫోన్ ట్యాపింగ్ లింక్స్
ఒకనాడు డ్రైవర్‌గా జీవితం ప్రారంభించిన నేత, బీఆర్ఎస్‌లో వందల కోట్ల దందాకు పాల్పడి, ఇప్పుడు అధికార కాంగ్రెస్ గూటికి చేరుతుండడంపై కిందిస్థాయి లీడర్లు ఆందోళన చెందుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్, కవిత అండతో కుత్బుల్లాపూర్ లోనే కాకుండా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూ దందా చేసిన ఆయన, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనూ ఉన్నారని అంటున్నారు. కేటీఆర్ అండతో ఆయన పీఏ చేత కాంగ్రెస్ నేతల ఫోన్లను ఎప్పటికప్పుడు ట్యాపింగ్ చేసి బెదిరింపులు చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడని అంటున్నారు. ఇలాంటి నేతలు కాంగ్రెస్‌కు అవసరమా అని ప్రశ్నించారు.
కోట్ల రూపాయల దోపిడీ
నిజాంపేట్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి మేయర్ టికెట్ పొందారు నీలా గోపాల్ రెడ్డి. తన భార్యకు 32 కోట్లతో ఆ పదవిని కొనుగోలు చేశానని గోపాల్ రెడ్డి బహిరంగంగానే ఆరోపించారని, గత నాలుగు సంవత్సరాలలో టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ శాఖ కాంట్రాక్టర్లు, రెవెన్యూ, శానిటేషన్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ నుండి తన మనుషుల చేత వసూళ్లు చేయించి సుమారు 200 కోట్లు కొల్లగొట్టారని అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ముఖ్యంగా అక్రమ నిర్మాణాల వద్ద ఒక్కో బిల్డింగ్‌కు 5 మార్లు వసూళ్లు చేయించిన ఘనత మేయర్ భర్త గోపాల్ రెడ్డికే దక్కుతుందంటున్నారు. ప్రభుత్వ భూములపై కన్నేసి అసైన్డ్, లావుని భూములను 59 జీవో కింద చక్రం తిప్పి రిజిస్ట్రేషన్ చేయించి సుమారు వెయ్యి కోట్లు కొల్లగొట్టారని గోపాల్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నేతలను కాంగ్రెస్‌లోకి ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోరాదని ఆపార్టీ నేతలు తేల్చి చెప్పారు.
పట్నం పేరుతో ఎమ్మెల్సీ డ్రామాలు
గోపాల్ రెడ్డితో పాటు పార్టీ మారాలని చూస్తున్న ఓ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి పేరును బద్నాం చేయాలని చూస్తున్నారని అంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. పార్టీలోకి రావాలని స్వయంగా పట్నం, తన గెస్ట్ హౌస్‌కు వచ్చి ఆహ్వానించారని చెప్పుకుని తిరుగుతున్నట్లు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ కోసం కష్ట కాలంలో పనిచేసి పార్టీ ఉన్నతికి కృషి చేసిన వారికి మాత్రమే గుర్తింపు ఇవ్వాలని, అదే తరుణంలో నియోజకవర్గంలో ఇతర పార్టీలనుండి వచ్చే అక్రమార్కులు వారు ఎంతటి పెద్ద వారైనా చేర్చుకోవద్దని స్పష్టం చేస్తున్నాయి.