– లక్షకు పైగా మెజారిటీ లెక్కల్లో కాంగ్రెస్
– ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన విపక్షాలు
– అసెంబ్లీ ఎన్నికల ఊపును కొనసాగించిన హస్తం
Khammam: తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో ఖమ్మం సీటుకు ఎంతో చరిత్ర ఉంది. ఇప్పటి వరకు ఈ స్థానానికి 17 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఇక్కడ 11 సార్లు కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. స్థానికుల కంటే స్థానికేతర అభ్యర్థులే ఇక్కడ గెలవటం ఈ సీటుకున్న మరో ప్రత్యేకత. ఇక.. మాజీ ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, నాదెండ్ల భాస్కరరావు మొదలు కేంద్ర మంత్రులుగా పనిచేసిన రంగయ్య నాయుడు, రేణుకా చౌదరి వంటివారంతా ఇక్కడి నుంచి గెలిచినవారే. ఎందరో వలస నేతలను ఆదరించి, అందలం ఎక్కించిన ఖమ్మం సీటు నుంచి 2024లో ఎవరు గెలుస్తారోననే చర్చ ఇప్పుడు అక్కడ జోరుగా సాగుతోంది.
గతానికి భిన్నంగా ఈసారి ఖమ్మం సీటు నుంచి పోటీచేసిన వారంతా జిల్లా వాసులే. కాంగ్రెస్ నుంచి చాలా పేర్లు వినిపించినప్పటికీ చివరికి పార్టీ టికెట్ కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడైన రఘురాం రెడ్డికి దక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గంలోని భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో బాటు రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి వర్గాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయటం, జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు, పార్టీ కేడర్ ఉండటం, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు పరిధిలోని 7 సీట్లలో ఆరింట కాంగ్రెస్, ఏడవ స్థానంలో మిత్రపక్షమైన సీపీఐ గెలవటం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశాలు. ఇవిగాక, కాంగ్రెస్ పథకాలు, సీఎం రేవంత్ రెడ్డి చరిష్మా అదనపు ఆకర్షణగా నిలిచాయి. అటు.. అభ్యర్థి రఘురాంరెడ్డి కూడా తాను కూసుమంచి మండలం చేగొమ్మకు చెందిన కాంగ్రెస్ కుటుంబానికి చెందిన వాడినంటూ జనంతో మమేకమయ్యారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బలంగా ఉన్న వామపక్షాల మద్దతూ కాంగ్రెస్ పార్టీకే ఉండటం మరో ప్లస్‌గా మారింది.
Also Read: పోలీసుల తీరుపై మల్లారెడ్డి ఫైర్
అటు.. బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేతగా ఉన్న నామా నాగేశ్వరరావు బరిలో నిలిచారు. ఇప్పటికి ఈ స్థానం నుంచి నాలుగుసార్లు పోటీచేసి రెండుసార్లు గెలిచిన నామా, మరోసారి బరిలో నిలిచారు. కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ తుడిచి పెట్టుకుపోవటం, కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తర్వాత వచ్చిన ఈ ఎన్నికల్లో ఎన్నడూ ఎరగని ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గతంలో ఆయన వెంట నడిచిన సొంత సామాజిక వర్గం ఆయనకు దూరం కాగా, పార్టీ కేడర్ అంతా కాంగ్రెస్ రాకతో నిర్వీర్యం అయింది. దీనికి తోడు నామా నాగేశ్వరరావు బీజేపీలో చేరుతున్నారనే వార్తలు ముందునుంచీ రావటం, ఏ మాత్రం ఇష్టం లేకున్నా కేసీఆర్ మాట కాదనలేక బరిలో నిలిచారనే ప్రచారం ఆయన ఓటమిని ముందే ఖాయం చేసినట్లయింది. ఖమ్మంలో నామమాత్రంగా ఉన్న బీజేపీ తరపున తాండ్ర వినోద్ రావు అభ్యర్థిగా నిలిచారు. ఈయన తరపున కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేసినా, ఏ దశలోనూ ఈ ప్రచారం ఓట్లుగా మారినట్లు కనిపించలేదు.
ఖమ్మం పార్లమెంట్ సీటు పరిధిలో మొత్తం 16,31,039 మంది ఓటర్లుండగా, వీరిలో 12, 41, 135 ఓట్లు పోలయ్యాయి. అంటే 76 .09 శాతం పోలింగ్ జరిగింది. గత ఎంపీ ఎన్నికల కంటే ఈసారి 0 .79 శాతం ఎక్కువ ఓటింగ్ జరిగింది. అయితే ఈసారి అర్బన్ ప్రాంతాలైన ఖమ్మం, కొత్తగూడెంలలో ఓటింగ్ శాతం బాగా తగ్గింది. ఖమ్మంలో కేవలం 62 .97 శాతం, కొత్తగూడెంలో 69.47 శాతం పోలింగ్ జరిగింది. పాలేరులో అత్యధికంగా 83.7 శాతం పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లకూ కలిపి 2.5 లక్షల ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి లభించగా, ఈసారి ఈ మెజారిటీ లక్షకు దగ్గరగా ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈసారి ఈ సీటు పరిధిలోని కమ్మ సామాజిక వర్గం ఓట్లలో మెజారిటీ హస్తానికే దక్కాయనీ, అతికొద్ది ఓట్లు మాత్రమే నామా నాగేశ్వరరావు చీల్చగలిగారని కూడా స్థానిక నేతలు చెబుతున్నారు.