– గాంధీ ఆస్పత్రి వీడియోపై వివాదం
– బీఆర్ఎస్ ట్వీట్‌పై కాంగ్రెస్ ఫైర్
– కేసీఆర్ హయాంలో జరిగిన వీడియోను ఇప్పుడు జరిగినట్టు చూపించడంపై అభ్యంతరం
– బీఆర్ఎస్‌పై సామా రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం
BRS Social Media: లోక్ సభ ఎన్నికల పోలింగ్ తెలంగాణలో ముగిసినప్పటికీ ప్రధాన పార్టీల మధ్య రాజకీయ పోరు తీవ్రత తగ్గడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం హాట్ హాట్ కామెంట్లు చేసుకుంటున్నాయి. తాజాగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫైట్ సోషల్ మీడియాకు ఎక్కింది. బీఆర్ఎస్ పోస్టు చేసిన ఓ వీడియోపై కాంగ్రెస్ ఒంటికాలిపై లేచింది. బీఆర్ఎస్ అబద్ధాలను వండివార్చుతోందని మండిపడింది. బీఆర్ఎస్ పార్టీ అనుకూల సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఓ వీడియోను పోస్టు చేసింది. గాంధీ హాస్పిటల్‌లో కరెంట్ కోతల కారణంగా పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని, సరైన చికిత్స పొందలేకపోతున్నారని ఆరోపించింది. తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేస్తూ పెట్టిన ఈ పోస్టులో సీఎం రేవంత్‌ను టార్గెట్ చేస్తూ మార్పు అంటే ఇదేనా? అని ప్రశ్నించింది.
ఈ పోస్టుపై తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ రియాక్ట్ అయింది. ఈ ఘటన బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని ప్రూవ్ చేసింది. దీంతో ఆ వీడియోలు సదరు హ్యాండిల్స్ నుంచి తొలగించబడ్డాయి. 2016 జులై 23వ తేదీన కేసీఆర్ హయాంలో జరిగిన ఈ ఘటనను కాంగ్రెస్ పాలనలో చోటుచేసుకున్నట్టు బీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నదని తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ హ్యాండిల్‌లో వాళ్ల బండారం బయటపెట్టింది. అసలు బీఆర్ఎస్ సోషల్ మీడియా బీజేపీ చేతిలోకి వెళ్లిందా అని అనుమానం వ్యక్తం చేసింది. పదేళ్ల బీజేపీ పాలనను ప్రశ్నించకుండా ఐదు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్మడం అందుకేనా అని నిలదీసింది. అబద్ధాలతో తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించింది.
ఈ సంఘటనపై టీపీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్‌పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పశువుల కన్నా హీనంగా తయారైందని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకు న్యాయస్థానం ఊచలు లెక్కపెట్టిస్తున్నా సిగ్గు రాలేదని మండిపడ్డారు. కల్వకుంట్ల రాబందుల చీకటి పాలనలో జరిగిన ఘోరాన్ని ఇప్పుడు జరిగినట్టు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.