– ట్విట్టర్‌లో నోటీసులు షేర్ చేసిన హస్తం పార్టీ
– అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతున్నారంటూ ఫైర్
– 15 రోజులు గడువు కోరినట్లు లీగల్ సెల్ వెల్లడి
– ఢిల్లీ పోలీసుల వైఖరిపై టీపీసీసీ ఫైర్
– డీజీపీ జవాబివ్వాలన్న ఉపాధ్యక్షులు నిరంజన్
Congress Party: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేసిన వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపిన వ్యవహారం తెలంగాణలో కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటలయుద్ధానికి దారితీసింది. తనకు ఎలాంటి నోటీసులు రాకున్నా ఎన్నికల వేళ లబ్ది పొందేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, కేటీఆర్‌కు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని, జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఆయన అబద్ధాల ఫ్యాక్టరీని నడుపుతున్నారంటూ మండిపడింది. ఢిల్లీ పోలీసులు గాంధీభవన్ వచ్చి తమకు ఇచ్చిన నోటీసుల కాపీని కూడా ట్విట్టర్‌లో కాంగ్రెస్ పార్టీ షేర్ చేసింది.
అయితే, ఈ వ్యవహారంలో తనకు వచ్చిన నోటీసులకు ముఖ్యమంత్రి స్పందించారు. ఈ ఫేక్ వీడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని, నోటీసుల్లో పేర్కొన్న ఐఎన్‌సి తెలంగాణ ట్విట్టర్ ఖాతాను తాను నిర్వహించటం లేదని ఆయన బదులిచ్చారు. తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్‌తో బాటు సీఎంవో తెలంగాణ అనే అకౌంట్‌ను మాత్రమే తాను వాడుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. సీఎం వాదనను ప్రస్తావిస్తూ ఆయన తరపున న్యాయవాది సౌమ్యా గుప్తా ఢిల్లీ పోలీసులు పంపిన నోటీసుకు జవాబిచ్చారు. అమిత్ షా ఫేక్ వీడియో పోస్ట్ అయిన ట్విట్టర్ అకౌంట్‌తో తన క్లయింట్ రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఆయన రోజూ ఏ ట్విట్టర్ అకౌంట్లలో స్పందిస్తున్నారనే విషయం తెలంగాణ ప్రజలకు తెలుసని కూడా ఆమె తన సమాధానంలో తెలిపారు.
Also Read: బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్టు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
మరోవైపు గాంధీభవన్ వర్గాలూ ఈ నోటీసులపై స్పందించాయి. తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్‌ఛార్జ్ రాం చంద్రారెడ్డి మాట్లాడుతూ.. తమకు నోటీసులు పంపిన ఢిల్లీ పోలీసులకు జవాబు ఇచ్చామని వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగుతుండటం, ఈ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో కాంగ్రస్ ప్రచారం చేసే స్టార్ క్యాంపెనర్ల జాబితాలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకరుగా ఉన్నారని, ఢిల్లీ పోలీసులు ఇచ్చిన లింక్‌లు వెరిఫై చేసేందుకు తమకు మరో 15 రోజుల సమయం ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కోరినట్లు రాం చంద్రారెడ్డి తెలిపారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ తరపున సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే గీత అనే మహిళ ఫోన్‌ను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు. సికింద్రాబాద్ శాంతినగర్‌కు చెందిన గీతకి సీఆర్పీసీ 41 ఏ నోటీసు ఇచ్చారు. ఈ నెల 5 వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. గీత ఫోన్‌ను సీజ్ చేయటంపై తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నిరంజన్ మండిపడ్డారు. ఢిల్లీ పోలీసులు నేరుగా వచ్చి ఓ మహిళ ఫోన్ సీజ్ చేయటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్న ఢిల్లీ పోలీసుల చర్యకు ప్రతిగా తెలంగాణ పోలీసులు ఏ చర్యా తీసుకోకపోవటంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ డీజీపీ దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.